Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో మత పరమైన విభజనకు మోడీ సర్కార్ కుట్ర : ప్రకాశ్ కరత్
- పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) ధర్నా
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
తమ స్వార్థ రాజకీయాల కోసం మోడీసర్కార్ దేశంలో ప్రజల మధ్య అగ్గిరాజేయాలని యత్నిస్తుందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌కరత్ విమర్శించారు. దేశవ్యాప్తంగా మత పరమైన విభజనకు కుట్ర చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మతాల మధ్య చీలిక తీసుకువచ్చి ఇష్టారీతిన చట్టాలు రూపొందిస్తుందని తెలిపారు. మంగళవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో సీపీఐ(ఎం) ఢిల్లీ కమిటీ ఆధ్వర్యంలో పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ధర్నా జరిగింది. ధర్నానుద్దేశించి ప్రకాశ్ కరత్ మాట్లాడారు. మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వడం సమంజసం కాదన్నారు. దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం, సెక్యులరిజంపై తీవ్రమైన దాడి జరుగుతున్నదని చెప్పారు. బీజేపీ దాని సైద్దాంతిక గురువు ఆర్‌ఎస్‌ఎస్ నేతృత్వంలోనే ఈ దాడి ప్రణాళికపరంగానే జరుగుతుందన్నారు. దేశాన్ని మతపరంగా ముక్కలు చేయాలని చేస్తున్న చర్యలను తిప్పికొట్టాలని అన్నారు. ఆ చట్టంలోని వివాదాస్పద లైన్లను తొలగించాలని కరత్ డిమాండ్ చేశారు. అక్రమ చొరబాటుదారులను గత చట్టాల ప్రకారమే గుర్తించి పౌరసత్వం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రోజు ప్రపంచ మానవ
హక్కుల దినోత్సవమని... కానీ, కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు పౌర హక్కులను ప్రభుత్వమే ఉల్లంఘిస్తున్న పరిస్థితి ఉందన్నారు. ఇక ప్రభుత్వాలు మానవ హక్కులపై కపట మాటలు చెప్పి ఏమి లాభమని ప్రశ్నించారు. కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్లు ఇస్తున్నదని... కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. నిరుద్యోగ రేటు పెరుగుదల, ఆర్థిక సంక్షోభం, కేంద్ర ప్రభుత్వం సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ వంటి అంశాల నుంచి దృష్టి మళ్ళించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంటుందని వివరించారు. ఈ ధర్నాలో సీపీఐ(ఎం) ఢిల్లీ కమిటీ కార్యదర్శి కేఎం తివారీ, షెబా ఫరూకీ, మైమూనా మొల్లా, సిద్ధేశ్వర్ శుక్లా పాల్గొన్నారు.
పార్లమెంట్ ఆవరణలో వామపక్షాల ధర్నా
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వామపక్ష ఎంపీలు పార్లమెంట్‌లో ధర్నా చేశారు. మంగవారం ఉభ యసభలు ప్రారంభం అయ్యే ముందు పార్లమెంట్ ఆవర ణంలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద సిటిజన్‌షిప్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వామపక్ష ఎంపీిలు ఆందోళన చేపట్టా రు. ''పౌరసత్వంలో మత వివక్షను ఆపాలి. సిటిజన్‌షిప్ సవరణ బిల్లు డౌన్ డౌన్. పౌరసత్వంలో మత ప్రాతిపదిక వద్దు'' అంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ''తాము సిటిజన్‌షిప్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తాం. ఫాసిస్ట్ హిందూ రాష్ట్రంను వ్యతిరేకిస్తాం. మతోన్మాదం డౌన్ డౌన్'' అంటూ నినాదాలు హోరెత్తించారు. మత ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వడం రాజ్యాంగాన్ని అవమాన పరచడమేనని ఎంపీలు మండిపడ్డారు. సిటిజన్‌షిప్ సవరణ బిల్లులో పొందిపరిచిన అంశాలు మతాల మధ్య వివక్ష చూపుతున్నాయని, కొన్ని మతాల వారికి పౌరసత్వం ఇవ్వడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఎంపీలు కెకె రాగేష్, ఎలమరం కరీం, కె.సోంప్రసాద్, జర్నాదాస్ బైద్య, పీఆర్ నటరాజన్, ఏఎం ఆరీఫ్, సీపీఐ ఎంపీలు బినరు విశ్వం, కె. సుబ్బరాయన్ పాల్గొన్నారు.
నేడు రాజ్యసభకు పౌరసత్వ సవరణ బిల్లు
లోక్‌సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లు, బుధవారం రాజ్యసభ ముందుకు రానుంది. ఈ బిల్లు పై చర్చ కోసం రాజ్యసభలో 6 గంటలు కేటాయించినట్టు తెలిసింది. లోక్‌సభలో బీజేపీకి మెజార్టీ ఉన్నందున బిల్లు సులభంగానే ఆమోదం పొందింది. రాజ్యసభలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కన్పిస్తోంది. అయినా అన్నాడీఎంకే, టీడీపీ, వైసీపీ, బీజేడీ, జేడీయూ తదితర పారీల మద్దతుతో బిల్లు గట్టేక్కెందుకు అవకాశాలు ఉన్నాయి. రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు మిగతా పార్టీలు విప్ జారీ చేశాయి.