Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈశాన్యంలో వెల్లువెత్తిన నిరసనలు
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో భగ్గుమంటున్న ఆందోళనలు
- పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా
పలుచోట్ల ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు
- ఆందోళనలపై ఖాకీల వీరంగం
- లాఠీచార్జి, రబ్బరు బుల్లెట్లు, భాష్పవాయు గోళాలు ప్రయోగం
- కాశ్మీర్‌లోని బలగాలు త్రిపుర,అసోంలకు తరలింపు
పౌరసత్వ సవరణ బిల్లు మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఓ వైపు మోడీ సర్కార్ పౌరసత్వ బిల్లు సవరణకు బీజేపీ మందబలం...ఇతర పార్టీలను బెదిరించే ధోరణితో చట్టసభల్లో చిచ్చురేపింది. దీనికి నిరసనగా బీజేపీ పాలిత ఈశాన్యరాష్ట్రాలు అగ్గిలా మండుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ భారీ స్థాయిలో బలగాలను రంగంలోకి దించి..అట్టుడుకుతున్న నిరసనలపై ఖాకీలను ఉసిగొల్పుతున్నది. శాంతియుతంగా జరుగుతున్న ప్రదర్శనలపై లాఠీలతో పోలీసులు వీరంగం సృష్టిస్తున్నారు. నిరసనలు ఉధృతం కావటంతో రబ్బరు బుల్లెట్లు...భాష్పవాయుగోళాలను ప్రయోగిస్తున్నారు. అసోం,త్రిపుర రాష్ట్రాల్లో క్యాబ్‌వ్యతిరేక ఆందోళనల్ని అదుపుచేయటం అక్కడి ప్రభుత్వాలకు సాధ్యం కావటంలేదు. కాశ్మీర్‌లోని బలగాలను ఆయా రాష్ట్రాలకు తరలించేలా మోడీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్యం అట్టుడుకుతున్నది. వరుసగా మూడో రోజూ ఇక్కడి రాష్ట్రాల్లో ఆందోళనలు అగ్గిరాజేశాయి. మరీ ముఖ్యంగా అసోం, త్రిపుర రాష్ట్రాల్లో నిరసనకారుల ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. చిన్నా,పెద్దా తేడాలేకుండా నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మోడీ సర్కారుకు వ్యతిరేకంగా పలుచోట్ల విద్యార్థులు, ప్రజలు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ, పౌర సంఘాల నాయకులు, ప్రముఖులు.. ఇలా సకలజనులూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. ఊహించని విధంగా ఆందోళనలు ఉధృతమవు తున్న దశలో.. ఖాకీలు రెచ్చిపోయారు. ప్లకార్డులు చేతపట్టుకుని శాంతియుత ప్రదర్శనలు చేస్తున్న వారిపై లాఠీలు ఝుళిపించారు. రబ్బరు బుల్లెట్లు, భాష్పవాయు గోళాలు ప్రయోగించడంతో పెద్దసంఖ్యలో ప్రదర్శనకారులు గాయపడ్డారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో హింస చేలరేగింది. నిరసనకారుల ఆందోళనల నేపథ్యంలో వారిని అదుపులోకి తేవడం పోలీసులకు కష్టతరంగా మారింది. 'పౌరసత్వ' నిరసనలను అణచివేయడానికి కేంద్రం ముమ్మర యత్నాలు మొదలుపెట్టింది. ఆర్టికల్ 370 నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌లో మోహరించిన బలగాలను ఈశాన్య రాష్ట్రాలకు తరలించేలా మోడీ సర్కార్ ఆదేశాలిచ్చింది.
అసోంలో హింసాత్మకం... పోలీసుల లాఠీచార్జి
బీజేపీ పాలిత రాష్ట్రం అసోంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల నిరసనకారులు మోడీ సర్కారుకు వ్యతిరేకంగా దిష్టిబొమ్మలను దహనం చేశారు. టైర్లను తగలబెట్టారు. కాగడాల ప్రదర్శనలను నిర్వహించారు. కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు హౌరెత్తాయి. డిస్పూర్, గువహతి, దిబ్రూగఢ్, జోర్హట్ లలో భారీ సంఖ్యలో ఉన్న నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది రెచ్చిపోయారు. లాఠీలతో పోలీసులు వీరంగం సృష్టించారు. ఆందోళనకారులను దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. ఈ ఘటనలో దాదాపు 25 మంది జర్నలిస్టులూ గాయపడ్డారు. సెక్రెటేరియట్ వద్ద జరిగిన నిరసనల్లో పోలీసులు అకారణంగా తమపై దాడి చేశారనీ... పలువురికి తీవ్ర గాయాలయ్యాయని విద్యార్థి నాయకులు తెలిపారు. దిబ్రూగఢ్‌లోని మోరన్ ప్రాంతంలో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. అప్పటికీ అదుపుచేయటం సాధ్యంకాలేదు. భాష్పవాయు గోళాలను ఆందోళనకారులపై ఎక్కుపెట్టారు. వందలాది మంది నిరసనకారులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. గువహతిలో బీజేపీ కార్యాలయం ముందు విద్యార్థులు, నిరసనకారులు గుమిగూడి బిల్లుకు, మోడీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గువహతి యూనివర్సిటీలో బిల్లుకు వ్యతిరేకంగా విద్యార్థులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. మరోపక్క.. రైలు సర్వీసులకు సైతం అంతరాయం ఏర్పడింది. దాదాపు 14 రైళ్లు రద్దు లేదా దారి మళ్లించినట్టు రైల్వే అధికారులు తెలిపారు.
త్రిపురలోనూ.... బీజేపీ వ్యతిరేక నిరనసలు
త్రిపురలోనూ ఆందోళనలు ఉగ్రరూపం దాల్చాయి. ఈశాన్య విద్యార్థి సంఘం(ఎన్‌ఈఎస్‌ఓ)తో పాటు వామపక్ష అనుబంధ సంఘాలు తమ నిరసనలను ఉధృతం చేశాయి. అక్కడ కూడా 48 గంటలపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తూ రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకున్నది. సమాచార వ్యవస్థను స్తంభింపజేయడంతో రాష్ట్ర రాజధాని అగర్తలలో ఆందోళనకారులు మోడీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిల్లు నుంచి రాష్ట్రాన్ని మినహాయించాలంటూ డిమాండ్ చేశారు. మిగిలిన ఈశాన్య రాష్ట్రాల్లో సైతం పలు ప్రాంతాలలో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఆందోళనలు, ర్యాలీలు, నిరసన ప్రదర్శనలను దృష్టిలో ఉంచుకొని అసోం, త్రిపుర, మిజోరం, మేఘాలయలలోని యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూళ్లు పరీక్షలను వాయిదా వేశాయి.
ఈశాన్యానికి భారీగా బలగాలు
మండుతున్న ఈశాన్యంలో.. శాంతి భద్రతలను అదుపులో ఉంచడానికి జమ్మూకాశ్మీర్ నుంచి భారీగా సైనిక బలగాలను తరలించేలా కేంద్రం ఆదేశాల్చింది. అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు ఐదువేల పారామిలిటరీ సిబ్బందిని కేంద్రం తరలించినట్టు అధికారులు తెలిపారు. ఇందుకు, ఆర్టికల్ 370 నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌లో మోహరించిన బలగాల్లో దాదాపు 20 కంపెనీలను(2000 మంది సిబ్బంది) అక్కడ నుంచి ఉపసంహరించుకొని వాటిని ఈశాన్య రాష్ట్రాలకు తరలించేలా ఆదేశాలు జారీఅయ్యాయి.
ఏఎంయూలో ఉద్రిక్తతలు 520మంది విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లోని 'అలీఘర్ ముస్లీం యూనివర్సిటీ' (ఏఎంయూ)లో విద్యార్థులు నిరసన చేపట్టగా, దీనిని అడ్డుకోవడానికి వర్సిటీ ప్రాంగణంలోకి పోలీసులు ప్రవేశించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. దీంతో పోలీసులు 520మంది విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. విద్యార్థులు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే నిరసన చేపట్టి, నగరంలోకి ప్రవేశించేందకు యత్నించారనీ, అడ్డుకున్న పోలీసులు, అధికారుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారనీ, అందుకే వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సి వచ్చిందని నగర ఎస్పీ అభిషేక్ తెలిపారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినవారిలో ఏఎంయూ విద్యార్థి సంఘం (ఏఎంయూఎస్‌యూ) అధ్యక్షుడు సల్మాన్ ఇమ్తియాజ్, మాజీ అధ్యక్షుడు ఫైజల్ హసన్‌లు ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం వర్సిటీ ప్రాంగణంలో అదనపు బలగాలను మోహరింపజేశామని వెల్లడించారు. కాగా, పోలీసులు రాకముందు జరిగిన నిరసనలో వేలమంది విద్యార్థులు పాల్గొని, పౌరసత్వ బిల్లు ప్రతులను దహనం చేశారు. కర్ఫ్యూ .. ఇంటర్నెట్ కట్..
ఎయిర్‌పోర్టులోనే అసోం సీఎం
అసోం అగ్గిలా మండుతుంటే... సీఎం సర్భానంద్ సోనోవాల్ గువహతి ఏయిర్‌పోర్టులోనే కొన్ని గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. అసోంలో ఆగని నిరసనకారులను కట్టడి చేయటానికి కర్ఫ్యూ విధించారు. రాష్ట్రంలోని పది జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను 24 గంటల పాటు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.