Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌కి టీఆర్‌ఎస్ ఎంపీల విజ్ఞప్తి
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ పరిహార నిధుల్ని తక్షణమే ఇవ్వాలని టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సీతా రామన్‌తో ఆ పార్టీ ఎంపీ లు భేటీ అయ్యారు. సుదీర్ఘ చర్చ తర్వాత మంత్రికి టీఆర్‌ఎస్ ఎంపీలు వినతి పత్రం అందజేశారు. జీఎస్టీ నిధులు విడుదల చేయకపోవడం వల్ల రాష్ట్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఇబ్బందులు తలెత్తుతున్నట్టు కేంద్రమంత్రికి వెల్లడించారు. అనంతరం టీఆర్‌ఎస్ లోక్ సభ పక్షనేత నామా నాగేశ్వర్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. జీఎస్టీ బకాయిలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు తదితర అంశాలపై కేంద్రమంత్రితో చర్చించామన్నారు. నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని విజ్ఞప్తులు చేసినా, కేంద్రం స్పందించడం లేదన్నారు. ఐజీఎస్టీ నిధులు రూ. 4,531 కోట్లు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాలకు రూ. 450 కోట్లు, స్థానిక సంస్థలకు రూ. 312 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉన్నదనీ వెల్లడించారు. కాగా, గిరిజన యూనివర్సిటీకి రూ. 450 కోట్లు విడుదల చేయాలని అడిగినట్టు చెప్పారు. నిటి ఆయోగ్ సూచనల మేరకు మిషన్ భగీరథకు రూ. 19,205 కోట్లు, కాకతీయకు రూ. ఐదు వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరామన్నారు. రాష్ట్రానికి రావాల్సి న నిధుల విడుదల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సింది పోయి, బీజేపీ ఎంపీలు తమపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం కలిసిపోదామని నామా చెప్పారు. టీఆర్‌ఎస్ ఎంపీలు మాలోతు కవిత, దయాకర్, రాములు, మన్నె శ్రీనివాస్ రెడ్డి, రంజిత్ రెడ్డి, బీ వెంకటేశ్ నేత పాల్గొన్నారు.
భారతమాల పరియోజన పథకం కింద
కోదాడ - ఖమ్మం 4లైన్ రహదారులు నిర్మించండి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారతమాల పరియోజన పథకం కింద 31.80 కిలోమీటర్ల దూరం కల్గిన కోదాడ - ఖమ్మం నాలుగు లైన్ల రహదారిని తీసుకొని త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని టీఆర్‌ఎస్ లోకసభ పక్ష నేత , ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు గురువారం ఆయన కేంద్రమంత్రి గడ్కరీకి వినతిపత్రం అందజేశారు.