Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ న్యాయమూర్తి జస్టిస్ సిర్పుర్కర్ నేతృత్వంలో..
- ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని సుప్రీం ఆదేశం
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాద్‌నగర్ యువతి దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో న్యాయవిచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. నిందితుల ఎన్‌కౌంటర్‌ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన మూడు పిటిషన్లపై రెండో రోజైన బుధవారం ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి విఎస్ సిర్పుర్కర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ధర్మాసనం వెల్లడించింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జ్యుడిషనల్
కమిషన్‌లో సభ్యులుగా బాంబే హైకోర్టు మాజీ న్యాయూమూర్తి రేఖా ప్రకాశ్ బల్దోతా, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ ఉంటారని స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో విచారణకు అనువైన చోట ఉండే అవకాశాన్ని కల్పించిన సుప్రీంకోర్టు... తొలి విచారణ తేదీని కమిషన్‌కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ విఎస్ సిర్పుర్కర్ ఖరారు చేస్తారని తన మార్గదర్శకాల్లో వివరించింది. తొలి విచారణ తేదీ నుంచి ఆరు నెలల్లో సమగ్ర నివేదిక రూపొందించి సుప్రీంకోర్టుకు సమర్పించాలని ధర్మాసనం సూచించింది. దాంతోపాటు ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ హైకోర్టు, జాతీయ మానవ హక్కుల సంఘంలో విచారణ, సిట్ విచారణలపై సుప్రీంకోర్టు స్టే విధిస్తున్నట్టు ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఇతర ఎలాంటి విచారణలు చేయవద్దని కోర్టు వెల్లడించింది. విచారణ కమిషన్ జరిపే విచారణపై మీడియా ప్రసారాలు, ప్రచురుణల చేయొద్దని ధర్మాసనం స్పష్టం చేసింది. దాఖలైన మూడు పిటిషన్లపై విచారణ ప్రారంభించిన ధర్మాసనం, తొలుత వాదనలు వినిపించిన పిటిషనర్ జీఎస్ మణి... ఎన్‌కౌంటర్ జరిగిన తీరు పలు అనుమానాలకు తావిస్తున్నదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్‌కౌంటర్ ఘటనను తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వివరిస్తూ.. దిశ కేసు నిందితులు ఘటనా స్థలంలో పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడటంతో పాటు పిస్తళ్లు లాక్కొని కాల్పులకు తెగబడ్డారని కోర్టుకి తెలిపారు. ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో నలుగురు నిందితులు మరణించినట్టు వివరించారు. అయితే, మధ్యలో కలుగజేసుకున్న సీజే బోబ్డే... 'మీరు తప్పు చేశారని మేం అనడం లేదు. కానీ ఏం జరిగిందో వాస్తవాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంద'ని గుర్తుచేశారు. అందుకోసం న్యాయ విచారణ జరపాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. తామేమి న్యాయ విచారణకు వ్యతిరేకం కాదన్న రోహత్గి.. ఇప్పటికే పోలీసులు ఉన్నతాధికారులతో సిట్ విచారణ సుమోటోగా తీసుకుని జాతీయ మానవ హక్కుల సంఘం విచారణ చేస్తున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చివర్లో మరో పిటిషనర్ ఎంఎల్ శర్మ ఎన్‌కౌంటర్ అయిన నలుగురు నిందితుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కోరగా... నిందితులు దిశ విషయంలో ఏం చేశారో తమకి తెలుసు అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు కండ్లు కప్పలేరని సీజేఐ చెప్పడంతో ఆయన ప్రతిగా సమాధానం ఇవ్వలేదు.
దిశ హత్య కేసు నిందితుల మృతదేహాలు భద్రపరచాలి : సుప్రీం
దిశ హత్యకేసు నిందితుల మృతదేహాలను భద్రపరచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు మృతదేహాలు భద్రపరచాలని, మృతదేహాల అప్పగింతపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించింది. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొంది.