Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేను రూపొందించిన బిల్లును మార్చడం అవివేకం : జస్టిస్ శ్రీకృష్ణ
న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన వ్యక్తిగత సమాచార భద్రత(పీడీపీ) బిల్లు ప్రమాదకరంగా ఉన్నదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ విమర్శించారు. ఈ బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తే దేశం ఓర్వెలియన్ రాజ్యంగా మారుతుందని జస్టిస్ శ్రీకృష్ణ హెచ్చరించారు. పౌరుల సంక్షేమం, స్వేచ్ఛను హరించే నియంతృత్వ ప్రభుత్వాల్ని ఓర్వెలియన్ రాజ్యాలుగా చెబుతారు. నియంతృత్వ రాజ్య లక్షణాల గురించి జార్జి ఓర్వెల్ అనే బ్రిటీష్ రచయిత తన నవల నైంటీన్ ఎయిటీ ఫోర్‌లో వివరించారు.పీడీపీ బిల్లును జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ రూపొందించింది. అయితే, మంగళవారం పార్లమెంట్ సభ్యులకు పంపిణీ చేసిన బిల్లులో మోడీ సర్కార్ పలు మార్పులు చేసింది. బిల్లులోని అంశాలపై ప్రతిపక్ష ఎంపీల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో బుధవారం జాయింట్ సెలెక్ట్ కమిటీకి సిఫారసు చేసింది. కమిటీ తన నివేదికను 2020 బడ్జెట్ సమావేశాల వరకల్లా సమర్పించనున్నది.
పౌరుల గోప్యత హక్కుకు రక్షణ కల్పించే పలు నిబంధనల నుంచి ప్రభుత్వ నిఘా సంస్థలకు మోడీ సర్కార్ మినహాయింపు ఇవ్వడాన్ని జస్టిస్ శ్రీకృష్ణ తప్పు పట్టారు. పీడీపీ బిల్లు ముఖ్య ఉద్దేశం పౌరుల వ్యక్తిగత సమాచార భద్రతకు హామీ ఇవ్వడం. కాగా, నిఘా ఏజెన్సీలు పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడంటే అప్పుడు(స్వచ్ఛందంగా) తెలుసుకునేందుకు వీలు కల్పిస్తూ మోడీ సర్కార్ బిల్లులోని నిబంధనల్ని మార్చింది. సార్వభౌమత్వం కాపాడే పేరుతో పౌరుల వ్యక్తిగత సమాచారం తెలుసుకునేందుకు ప్రభుత్వ ఏజెన్సీలకు వీలు కల్పించడం ప్రమాదకర సంకేతాలనిస్తుందని జస్టిస్ శ్రీకృష్ణ విమర్శించారు. క్యాబినెట్ ఆమోదించిన బిల్లులో మార్పులు చేసే అధికారం సెలెక్ట్ కమిటీకుంటుందని జస్టిస్ శ్రీకృష్ణ తెలిపారు. కమిటీ తనను పిలిస్తే(తాను రూపొందించిన) బిల్లును మార్చ డం అవివేక చర్యగా చెబుతానని జస్టిస్ శ్రీకృష్ణ అన్నారు. 2018 జులైలో విడుద లైన శ్రీకృష్ణ కమిటీ ముసాయిదా బిల్లుపై ఏడాదిపాటు మోడీ మంత్రివర్గం అంతర్గ తంగా మథించి మార్పులు చేసింది. అయితే, మోడీ సర్కార్ చేసిన మార్పులు 2017లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని న్యాయ నిపుణులు ఇప్పటికే గుర్తు చేశారు. ఆ తీర్పులో ప్రయివసీ హక్కును పౌరుల ప్రాథమిక హక్కుగా రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.