Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోర్టును ఆశ్రయించిన నిర్భయ తల్లిదండ్రులు
న్యూఢిల్లీ : తన కూతురుపై అకృత్యానికి పాల్పడి డిసెంబరు 16 నాటికి ఏడేండ్లు పూర్తవుతుందనీ, అదే రోజు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుచేయాలని కోరుతూ నిర్భయ తల్లిదండ్రులు ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టులో శుక్రవారం పిటిషన్‌ను దాఖలు చేశారు. కాగా, ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 18కి వాయిదావేసింది. నిందితుల్లో ఒకడైన అక్షరు కుమార్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం ఈ నెల 17న విచారించనున్న నేపథ్యంలో.. దానికంటే ముందు ఈ పిటిషన్‌ను విచారించటం సాధ్యంకాదని ఢిల్లీ కోర్టు తెలిపింది. 23 ఏండ్ల తన కూతురు దారుణ హత్యకు గురై డిసెంబరు 16 నాటికి ఏడేండ్లు పూర్తవుతుందనీ, ఆ రోజునే ఆ నలుగురు హంతకులను ఉరితీయాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నిర్భయ కేసులోని నిందితులకు శిక్ష అమలుచేయడంలో ఆలస్యం పై ఆమె తల్లి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 'దోషులకు శిక్ష ఖరారుచేసి ఇప్పటికే రెండున్నరేండ్లు గడిచింది. నిందితులు పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చి 18 నెలలు గడిచింది. వారిని వెంటనే ఉరితీయాలని కోర్టుకు, ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను' అని బాధితురాలి తల్లి తెలిపారు. 'నిందితుడు అక్షరుసింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించి వుంటే బాగుండేది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఆమోదించటం తప్ప మాకు మరో మార్గంలేదు. ఏడేండ్లుగా మేం పోరాడుతూనే ఉన్నాం' అని ఆమె అన్నారు. నిందితులు నలుగురూ ఢిల్లీలోని తీహార్ జైలులో వున్న విషయం తెలిసిందే. వారిని ఉరితీసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలొస్తున్నాయి.