Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'మేక్ ఇన్ ఇండియా కాదు..
- రేప్ ఇన్ ఇండియా' అన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నిరసన
- క్షమాపణలు చెప్పాలని డిమాండ్
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో:
దేశంలో మహిళలపై జరుగుతున్న లైంగికదాడి ఘటనలపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఇటీవల జార్ఖండ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ ఉభయసభల్లో తీవ్ర దుమారం రేగింది. ఉభయసభలు జరగకుండా బీజేపీ ఎంపీలు ఆటంకం కలిగించారు. బీజేపీ ఎంపీల ఆందోళనతో లోక్‌సభ, రాజ్యసభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో ఉభయసభల్లో వాయిదాల పర్వం నెలకొంది. రెండు, మూడు సార్లు వాయిదా పడిన తరువాత, చివరికి పూర్తిగా సమావేశాలను ముగించారు. శుక్రవారం లోక్‌సభ ప్రారంభం కాగానే, బీజేపీ ఎంపీలు రాహుల్ వ్యాఖ్యలను లేవనెత్తారు.
''మేకిన్ ఇండియాను.. రేప్ ఇన్ ఇండియా'తో పోల్చుతూ ఓ రాజకీయ నేత వ్యాఖ్యలు చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఇదేనా రాహుల్ దేశ ప్రజలకు ఇచ్చే సందేశం?'' అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విమర్శించారు. బీజేపీ ఎంపీలు తమ స్థానాల్లోంచి లేచి వెల్ వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ ''ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రధాని మోడీ మేకిన్ ఇండియాను ప్రోత్సహిస్తున్నారు. అలాంటి మేకిన్ ఇండియాను అత్యాచారాలతో పోల్చడం చాలా విచారకరం. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తులకు నైతికంగా సభలో ఉండే హక్కు లేదు'' అని అన్నారు.
డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు సభ వెలుపల చేశారని, గతంలో తాము ఇలాంటి ఉదంతాలను ప్రస్తావిస్తే సభ వెలుపల జరిగిన వాటిని ఉటంకించరాదని తమను అనుమతించని విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. ''ప్రధాని నిత్యం మేకిన్ ఇండియా గురించి చెబుతుంటారు. మేకిన్ ఇండియాపై మాకు గౌరవం ఉంది. కానీ వాస్తవంగా దేశంలో ఏం జరుగుతోంది? రాహుల్ చెప్పదలుచుకున్న ఉద్దేశం కూడా ఇదే. దురదృష్టవశాత్తు మేకిన్ ఇండియా జరగట్లేదుకానీ, నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. ఇది చాలా ఆందోళన చెందాల్సిన విషయం'' అని కనిమొళి తెలిపారు. ఆమె మాట్లాడుతున్నంత సేపు బీజేపీ ఎంపీలు అరుపులు, కేకలు పెట్టారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఎంతమాత్రం క్షమాపణలు చెప్పనని, రాహుల్ గాంధీ వెల్లడించారు.
రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి
రాజ్యసభలోనూ ఇదే అంశంపై గందరగోళం నెలకొంది. తొలుత సభలో చైర్మెన్ ఎం.వెంకయ్యనాయుడు పార్లమెం ట్‌పై ఉగ్రవాదుల దాడిలో మరణించిన వీరులకు సంతాపం తెలుపుతూ నివాళి అర్పించారు. అనంతరం జీరో అవర్ ప్రారంభించారు. ఇద్దరు సభ్యులు జీరో అవర్‌లో మాట్లాడిన తరువాత బీజేపీ, ఎన్డీఏ భాగస్వామి అన్నాడీఎంకే చెందిన నలుగురు మహిళ ఎంపీిలు ఈ అంశాన్ని లేవనెత్తారు. సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని చైర్మెన్ ఎన్ని సార్లు చెప్పినప్పటికీ బీజేపీ సభ్యులు వినిపించు కోలేదు. ఈశాన్య భారతం తగలపడిపోతుందని ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేశారు. ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ మాట్లా డుతూ అసోంతో పాటు ఈశాన్యరాష్ట్రాల్లో తీవ్రమైన హింస జరుగు తుందని, ముగ్గురు చనిపోయారని తెలిపారు. ప్రభుత్వం దీనిపై వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు,
మోడీయే క్షమాపణ చెప్పాలి: రాహుల్
దీనిపై రాహుల్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. పౌరసత్వ సవరణ బిల్లుపై జరుగున్న హింసాత్మక ఘటనల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీ ఈ రకమైన పన్నాగం పన్నిందని వెల్లడించారు. బేటీ బచావో, ..బేటీ పడావో అంటున్న మోడీ.. ఎవరి నుంచి రక్షించాలో చెప్పలేదనీ, నిజానికి బీజేపీ ఎమ్మెల్యేల నుంచి బాలికలను రక్షించాలని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిన మోడీయే క్షమాపణ చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు.