Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరుగుతున్న చెరుకురసంలోకి తోసేశారు
పాట్నా: తనకు రావాల్సిన బకాయి డబ్బులను అడిగిన ఓ చెరుకు రైతును, మిల్లు యజమాని మరుగుతున్న చెరుకురసంలోకి తోసేశాడు. తీవ్ర గాయాలపాలైన బాధితరైతు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ఈ ఘటన బీహార్‌లోని సివాన్ జిల్లా భారిహర్వలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనేశ్వర్ ప్రసాద్ (50) అనే చెరుకు రైతు, పింటు షా అనే మిల్లు యజమానికి చెరుకు లోడ్లను సరఫరా చేశాడు. వీటికి సంబంధించిన బకాయిలను అడిగేందుకు మిల్లు వద్దకు వచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న పింటుషా, ఆయన సోదరుడు.. డబ్బులడిగిన రైతును దుర్భాషలాడారు. దీంతో వారిమధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ఈ క్రమంలో అన్నదమ్ములిద్దరు కలిసి సదరు రైతును బెల్లం తయారీకి మరగబెడుతున్న చెరుకురసంలోకి విసిరేశారు. గమనించిన కూలీలు వెంటనే బాధితుడిని బయటకు తీసి, ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఆస్పత్రిలో ఎనిమిదిరోజులుగా చికిత్స పొందిన భువనేశ్వర్.. పరిస్థితి విషమించి శనివారం మృతిచెందాడు. ఘటన రోజే కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టారు.
సీపీఐ(ఎం) ఖండన
చెరుకు రైతుల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వెస్ట్ చంపారన్ సీపీఐ(ఎం) నాయకుడు ప్రభురాజ్ నారయణ్ రావ్ ఈ ఘటనను ఖండించారు. మృతిచెందిన రైతు కుటుంబానికి నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటన చెరుకు రైతులు తమ జీవనపోరాటానికి పడే కష్టాన్ని తెలియజేస్తున్నదనీ, కానీ ఇవేవీ ప్రభుత్వానికి పట్టవని ఆవేదన వ్యక్తం చేశారు.