Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపణ
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
దేశవ్యాప్తంగా ధనవంతుల జాబితాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుంటుంబం ఉంటే, దివాలా రాష్ట్రాల జాబితాల్లో తెలంగాణ చోటు దక్కించుకోవడం బాధాకరమ ని టీ కాంగ్రెస్ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యా నించారు. కేసీఆర్ కుటుంబం దోపిడీని ఆపేస్తేనే, తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారుతుందన్నారు. కేవలం, ఒకటి... రెండు కంపెనీలకే కాంట్రాక్ట్‌లు ఇస్తూ, ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. శనివారం ఢిల్లీ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. వేలాది మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ, నియంతత్వ, రాచరిక పోకడల మధ్య బందీ అయిందన్నారు. మిగులు బడ్జెట్‌తో రాష్ట్రం ఏర్పడితే, ఆరేండ్లలో మూడు లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని చెప్పారు.
భారత్ బచావోలో రాష్ట్ర నేతలు
కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో శనివారం చేపట్టిన భారత్ బచావో కార్యక్రమంలో తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొ న్నారు. సభలో వివిధ జిల్లాల నుంచి దాదాపు నాలుగు వేల మంది పార్టీ శ్రేణులు హాజర య్యారు. ప్రధాన వేదికపై టీపీసీసీ, సీఎల్‌పీ నేతలకు మాత్రమే అవకాశం కల్పించారు. అంతకుముందు ఎన్‌ఎస్ యూఐ రాష్ట్ర బృందం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయింది.
రాష్ట్రాన్ని కమీషన్ల అడ్డాగా మార్చారు : వివేక్
ఎంతోమంది త్యాగాల ఫలితమైన తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ కమీషన్ల రాష్ట్రంగా మార్చారని మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎప్పుడూ నిధులు లేవని చెబుతున్న సీఎం కేసీఆర్... కమీషన్ల కోసం భారీ నీటి పారుదల ప్రాజెక్ట్‌లను చేపడు తుండటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కేటీఆర్‌ను సీఎం చేసేందుకు కేసీఆర్, పార్టీలో సీనియర్ నాయకులైన ఈటెల రాజేందర్, హరీశ్‌రావులకు చెక్ పెట్టాలని చూశారన్నారు.