Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
కడదాకా అణగారినవర్గాల కోసం పోరాడిన వ్యక్తిగా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీఎస్ కృష్ణన్ చరిత్రలో నిలిచిపోతారని వక్తలు తెలిపారు. శనివారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్, నేషనల్ యాక్షన్ ఫర్ సోషల్ జస్టిస్... ఏపీ భవన్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోయేషన్ ఆధ్వర్యంలో పీఎస్ కృష్ణన్ సంస్మరణ సభ నిర్వహించారు. సభ ప్రారంభానికి ముందుకృష్ణన్ సతీమణి శాంతాకృష్ణన్ ఏపీ భవన్ ఆవరణలోని రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. గురజాడ హాల్‌లో పీఎస్ కృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నేషనల్ యాక్షన్ ఫర్ సోషల్ జస్టిస్ అధ్యక్షులు నానక్ చంద్ మాట్లాడుతూ... చివరివరకు అణగారినవర్గాల శ్రేయస్సు కోసం పోరాడిన అధికారి పీఎస్ కృష్ణన్ అని కొనియాడారు. దేశవ్యాప్తంగా అణగారినవర్గాలకోసం ప్రభుత్వాలు రూపొందించిన ఎన్నో పథకాలకు ఆయనే సృష్టికర్తని చెప్పారు. ఆలిండియా దళిత్ రైట్స్ ఫోరం(ఏఐడీఆర్‌ఎస్) జాతీయ అధ్యక్షులు కందుల ఆనందరావు మాట్లాడుతూ... పీఎస్ కృష్ణన్ సామాజిక థృక్పథం కల్గిన అధికారి మాత్రమే కాదని... ప్రజల్లో సామాజిక పరివర్తన కోసం పాటుపడిన వ్యక్తి అంటూ వివరించారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక సబ్‌ప్లాన్ ఆయన నేతృత్వంలోనే ముసాయిదా రూపొందించినట్టు వివరించారు. 1989 ఎస్సీ, ఎస్టీ చట్టం రూపకల్పనలో కూడా ఆయన కీలక పాత్ర పోషించినట్టు చెప్పారు. ఈ సభలో ఏపీ భవన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగరాజు, భవన్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.