Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్వేష రాజకీయాలకు మోడీ-నెతన్యాహు-ట్రంప్ ఆజ్యం
- 'సరిహద్దు భద్రతే' ఎన్నికల్లో ప్రధానాంశం
- అంతర్జాతీయ సదస్సుల్లో శాంతి వచనాలు
- ప్రజా సమస్యలు పక్కదారి..
న్యూఢిల్లీ : దేశాలు, ప్రాంతాలు వేరైనా భారత ప్రధాని మోడీ, ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు ఎన్నికల వేళ ఒకేదారిలో పయనిస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు.. దేశంలో విపత్కర పరిణామాలు సంభవించినప్పుడు.. ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం పోయి పాలకుల మీద వ్యతిరేకత తీవ్రమైన ప్రతిసారి ఈ ముగ్గురు నేతలు 'జాతీయ భద్రత'ను ముందుకు తీసుకువస్తూ ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు తమ ప్రత్యర్థి దేశాల మీద బాంబులు కురిపిస్తూ.. 'మీ ఇంట్లోకి ప్రవేశించి మరీ దాడి చేస్తాం' అంటూ ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. ఈ క్రమంలో తాత్కాలికంగా సఫలం అవుతున్నారు. భారత్‌లో గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మోడీ, ఇజ్రాయిల్ ఎన్నికల్లో నెతన్యాహు అదే బాటను అనుసరించగా.. తాజాగా వీరిరువురి ప్రియ మిత్రుడు ట్రంప్ సైతం అదే బాటన నడుస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
భారత్‌లో 2019 సాధారణ ఎన్నికలకు ముందు భారత్.. పూల్వామా దాడులకు ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న బాలాకోట్‌లో వాయుదాడులు (ఎయిర్‌స్ట్రైక్స్) చేసింది. ఇందులో ఎంతమంది మరణించారన్నదానిపై ఇప్పటికీ ఇరుదేశాలూ ప్రకటించలేదు. కానీ, మార్చిలో మొదలైన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మోడీ పాల్గొన్న ప్రతి ప్రచార సభలోనూ సరిహద్దు భద్రత అంశాన్ని ప్రస్తావించారు. బెంగాల్‌లోని రనఘట్‌లో ఏప్రిల్ 24న జరిగిన సభలో మోడీ.. 'నవ భారతదేశానికి కావాల్సిందేమిటి..? ఉగ్రవాదుల నుంచి దేశాన్ని కాపాడే సమర్థవంతమైన నాయకుడ్ని దేశం కోరుకుంటున్నది' అని అన్నారు. యూపీలోని బహ్రెయిచ్‌లో ఏప్రిల్ 30న మాట్లాడుతూ.. 'ఈరోజు ప్రతి ఉగ్రవాది భారత్‌కు మోడీ ప్రధానిగా ఉన్నాడని భయపడుతున్నాడు' అని చెప్పారు. వీటితో పాటు ఆ రెండున్నర నెలల్లో మోడీ పాల్గొన్న ఎన్నికల సభల్లో, చేసిన ట్వీట్‌లోనూ పాక్‌ను ఉద్దేశిస్తూ.. 'మీ ఇంట్లోకి ప్రవేశించి దాడి చేస్తాం' అని తెలిపారు. ఇక బీజేపీ బృందమైతే 'మోడీ తప్ప ఈ దేశాన్ని ఎవ్వరూ రక్షించలేరు' అనే స్థాయిలో ప్రచారం సాగించింది.
మోడీ మాదిరే ఇజ్రాయిల్‌లో నెతన్యాహూ శత్రుదేశాల్లో బాంబుల వర్షం కురిపించారు. నెతన్యాహు, ఆయన భార్య మీద అవినీతి ఆరోపణలు రావడంతో దాన్నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి.. గతేడాది ఆగస్టు 25న 24 గంటల వ్యవధిలోనే సరిహద్దు దేశాలైన సిరియా, లెబనాన్, ఇరాక్‌ల మీద ఇజ్రాయిల్ బాంబులు వేసింది. పాలస్తీనా మీద విచక్షణ లేకుండా డ్రోన్ దాడులకు తెగబడింది. సిరియా అంతర్గత మిలిటరీ స్థావరాలపైనా అదే రీతిలో దాడులు చేసింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో నెతన్యాహు.. ఇరాన్ మేజర్ జనరల్ ఖాసిమ్ సులేమానితో పాటు, ఇస్లామిక్ దేశాల నాయకుల మీద విమర్శల దాడి చేసి లబ్ది పొందారు.
ఇక తాజాగా వీరి పెద్దన్న ట్రంప్ సైతం అదే బాటలో పయనిస్తున్నారు. మొదటినుంచి ముస్లింలంటేనే అగ్గి మీద గుగ్గిల్లమయ్యే ట్రంప్.. మధ్య, పశ్చిమాసియాలో ఉన్న ఇస్లామిక్ దేశాల మీద దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. మెక్సికో సరిహద్దుల్లో గోడ కడతాననీ, వలసదారులను అమెరికానుంచి వెళ్లగొడతానని అంటున్నారు. కాగా, ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ట్రంప్‌పై అమెరికాలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఇరాన్ వ్యవహరాల్లో తలదూర్చి ఉన్న అగ్రరాజ్యం.. ఆ దేశ సైనికదళాధిపతి సులేమానిపై ఈనెల 3న దాడికి తెగబడి హత్య చేసింది. ఇదే విషయాన్ని ప్రస్తుతం ట్రంప్ అనుకూల మీడియా అమెరికాలో ప్రచారం చేస్తున్నది.
ఈ మూడు దేశాల విదేశాంగ విధానాలు భిన్నంగా ఉన్నా ఈ దేశాధినేతల చర్యలు మాత్రం ఒకే విధంగా ఉన్నాయి. ప్రజాక్షేత్రంలో భావోద్వేగాలను రెచ్చగొట్టి గెలిచినా.. వారి ఆకాంక్షలకు అనుకూలంగా పనిచేయడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే విషయమై అంతర్జాతీయ రాజకీయ పరిశీలకురాలు సారా జుకెర్మన్ డాలి స్పందిస్తూ.. 'కయ్యానికి కాలుదువ్వే నాయకులు తరుచుగా శాంతి వచనాలు చేస్తూ భద్రతా అంశాన్ని తమ సమర్థతకు వాడుకుంటారు. ఎన్నికల్లో వీరు జాతీయ భద్రత అంశాలను లేవనెత్తి లబ్ది పొందుతారు' అని తెలిపారు. ధైర్యం, హింస అనే విషపూరిత మిశ్రమాన్ని వారు ప్రజల మీద చల్లుతారని విమర్శలు చేశారు. అయితే ఇలాంటి చర్యలు విభజనవాదాన్ని ప్రోత్సహిస్తాయని ఆమె హెచ్చరించారు.
తాజా పరిణామాలూ అలాగే ఉన్నాయి. భారత్‌లో ఏ సమస్య ఉత్పన్నమైనా మోడీ పాక్ వైపు వేలు చూపిస్తుండగా.. నెతన్యాహు పాలస్తీనాను దోషిగా నిలబెడుతున్నారు. ఇక ట్రంప్ అయితే బాహాటంగానే ప్రపంచ ముస్లిం దేశాలపై యుద్ధం ప్రకటిస్తున్నారు. భారత్‌లో కొంతకాలంగా ఆర్థిక వ్యవస్థ నేలచూపులు చూస్తున్నది. మందగమనంతో కీలకరంగాలు అస్తవ్యస్తమవుతున్నాయి. ఉద్యోగ, ఉపాధి రంగాలు దెబ్బతింటున్నాయి. అయినా కేంద్ర సర్కారు మాత్రం ఎన్నార్సీ, ఎన్పీఆర్, సీఏఏ పేరుతో దేశంలో విభజన రాజకీయాలకు తెరలేపింది. నెతన్యాహు, ఆయన భార్యల మీద అవినీతి ఆరోపణల కత్తి వేలాడుతూనే ఉంది. ట్రంప్‌పై ఇటీవలే అభిశంసన అభియోగాలు నమోదయ్యాయి. అయినా కూడా ఈ నాయకులు ప్రత్యర్థి దేశాలను బూచీగా చూపిస్తున్నారే తప్ప ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడంలో దారుణంగా విఫలమవుతున్నారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. తమ భవిష్యత్తుపై కోట్లాది ఆశలు పెట్టుకున్న ప్రజల ఆకాంక్షలను ఈ నాయకులు తుంగలో తొక్కుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.