Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారతీయ పౌరులుగా మమ్మల్ని చూడటంలేదు
- రాష్ట్రపతికి గుజరాత్ ఉనా బాధితుల వినతి
లక్నో : తమను ఈ దేశ పౌరులుగా చూడటంలేదనీ, వివక్షలేని దేశానికి మమ్మల్ని పంపించాలని 'ఉనా' బాధితులు రాష్ట్రపతికి మొరపెట్టుకున్నారు. గుజరాత్‌లోని గిర్‌సోమ్‌నాథ్ జిల్లా ఉనాలో సర్వయ్యా కుటుంబానికి చెందిన దళిత యువకులను కారుకు కట్టేసి విచక్షణా రహితంగా కొట్టిన ఘటనకు సంబంధించి బాధితులు ఏడుగురిలో ఒకరైన వాష్‌రాం ఈ మేరకు జిల్లా కలెక్టరేట్‌లో ఈ నెల 7న పిటిషన్ సమర్పించారు. గోవధకు పాల్పడి.. దాని చర్మం వలిచారన్న ఆరోపణలతో ఏడుగురు దళితులను పెత్తందారీ కులానికి చెందిన దాదాపు 40 మంది 2016 జులై 11న ఇనరరాడ్లు, కర్రలతో తీవ్రంగా కొట్టిన విషయం తెలిసిందే. 'ఉనా ఘటన మమ్మల్ని ప్రాథమిక హక్కు, ఉపాధి నుంచి దూరం చేసింది' అని వాష్‌రాం అన్నారు. 'అధికారులు మమ్మల్ని ఈ దేశ పౌరులుగా చూడటంలేదు. మమ్మల్ని ఈ దేశ పౌరులుగా పరిగణించకపోతే.. మా పౌరసత్వం రద్దుచేయండి.. వివక్షలని మరో దేశానికి మమ్మల్ని పంపించండి' అన్నారు. ఉనా దారుణంపై నిరసనలు వెల్లువెత్తటంతో వేగవంతమైన దర్యాప్తు కోసం ప్రత్యేక కోర్టును, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను అప్పట్లో ఏర్పాటుచేశారు. 'ఘటన జరిగి నాలుగేండ్లు కావస్తున్నా... విచారణ కొనసాగుతూనే ఉన్నది. బాధితులకు వ్యవసాయ భూమి, ఇండ్ల కోసం స్థలం, ఉపాధి కల్పిస్తామని అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ హామీ ఇచ్చారు. కానీ, ఆ తర్వాత ఆమెకానీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఎవ్వరూ మమ్మల్ని కనీసం కలవలేదు.. ఒక్క హామీ కూడా నెరవేరలేదు' అని వాష్‌రాం వాపోయారు. మా హక్కులకు రాష్ట్రపతి హామీ ఇవ్వకపోతే.. కనీసం చనిపోయేందుకు అనుమతివ్వాలని కోరారు. మా పిటిషన్‌ను పరిగణనలోనికి తీసుకోకపోతే.. రాష్ట్రపతి భవన్ ఎదుట సజీవదహనానికి పాల్పడతామని హెచ్చరించారు.