Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంకులపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్న పాలకుల విధానాలు
- ఖాతాదారుల సొమ్ముకు భద్రత కరువు
కొండూరి వీరయ్య
ఎఫ్‌ఆర్డీఐ బిల్లుల్లో బెయిల్ ఇన్ క్లాజుతో వచ్చే ప్రమాదం ఒకటైతే డిపాజిట్ ఇన్సూరెన్స్‌లో ప్రతిపాదించిన మార్పులతో వచ్చే ప్రమాదం మరోటి. గత రెండు సంవత్సరాలుగా బెయిల్ ఇన్ క్లాజు గురించి జరిగినంత చర్చ డిపాజిట్ ఇన్సూరెన్స్ గురించి జరగలేదు. అందుకే ఈ వ్యాఖ్యలో డిపాజిట్ ఇన్సూరెన్స్ గురించి వివరించటానికి ప్రయత్నం చేస్తాను.
ప్రజలు బ్యాంకులో పొదుపు చేసుకునే మొత్తానికి ఎటువంటి నష్టం జరిగినా ఆ నష్టాన్ని బ్యాంకులు భరించి ప్రజల సొమ్ము ప్రజలకు అప్పగించాలన్నది కనీస నైతికత. దీనికోసం ఏర్పడిందే డిపాజిట్ ఇన్సూరెన్స్ మరియు క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. ఈ చట్టం ద్వారా భారతదేశంలోని బ్యాంకుల్లో జనం పొదుపు చేసుకున్న సొమ్ముకు బీమా భద్రత కల్పించాలన్నది లక్ష్యం. అయితే ఇక్కడ విశేషమేమిటంటే బ్యాంకుల్లో మనం దాచుకున్న సొమ్ము మొత్తానికి ఈ చట్టం కింద బీమా రక్షణ ఉండటం లేదు. కేవలం లక్ష రూపాయల వరకే ఈ బీమా రక్షణ కల్పిస్తున్నారు. అంటే అర్థం ఏమిటి? ప్రత్యేకించి ఎఫ్‌ఆర్డీఐ బిల్లు నేపథ్యంలో ఈ క్లాజు ఎలా అమలవుతోందన్నది తెలుసుకుంటే ఖాతాదారులకు గుండె పోటు ఖాయం. ఒక వ్యక్తి ఫలానా బ్యాంకులో రెండున్నర లక్షలు పొదుపు చేసుకున్నాడు. సదరు బ్యాంకు దివాళా తీశామని పరిష్కారాల కేంద్రం (రిసొల్యూషన్ కార్పొరేషన్)కి నివేదించింది. దివాళా తీసిన కంపెనీల అప్పులు సెటిల్ చేయటానికి దివాళా చట్టం అమల్లోకి వచ్చినట్టు అన్నమాట. ఇదేవిధంగా బ్యాంకులు ఇతర ద్రవ్య సంస్థలు దివాళా తీస్తే సంబంధిత విషయాలు పరిష్కారం కోసం రిసొల్యూషన్ కార్పొరేషన్‌ను ఆశ్రయిస్తాయి.
ఈ విధంగా ఆశ్రయించిన బ్యాంకులో ఉన్న రెండున్నర లక్షల ఖాతా సొమ్ములో లక్షకు మాత్రమే బీమా ఉంటుంది. ఈ లక్ష రూపాయలు బ్యాంకు ఖాతాదారునికి తిరిగి చెల్లించాల్సిన బాధ్యత బ్యాంకుపై ఉంటుంది మరి మిగిలిన లక్షన్నర రూపాయల విషయంలో ఖాతాదారునికి ఉన్న రక్షణేమిటి? ఆర్థిక వ్యవస్థ ప్రయోనాల రీత్యా రిసొల్యూషన్ కార్పొరేషన్ ఈ క్రింది చర్యలు ప్రతిపాదించవచ్చు. బీమా రక్షణ ఉన్న లక్ష రూపాయలు మినహాయించి అదనంగా ఉన్న లక్షన్నర చెల్లించలేము అని చేతులెత్తవచ్చు. లేదా ఎంతో కొంత బేరమాడి అందులో సగమో, మూడోవంతో నాల్గోవంతో చెల్లించటానికి సిద్ధం కావచ్చు. మరీ దయదలిస్తే ఈ మొత్తాన్ని ఖాతాదారుని ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా దీర్ఘకాల బాండ్లరూపంలోకి మార్చి ఓ పదేళ్ల వరకో పాతికేళ్ల వరకో సొమ్ము వెనక్కు తీసుకునే అవకాశం లేకుండా తీర్పునివ్వవచ్చు. ఇది ఈ చట్టంలో ఉన్న రిసొల్యూషన్ కార్పొరేషన్‌కు, ఇప్పటి వరకు ఉన్న డిపాజిట్ ఇన్సూరెన్స్ మరియు క్రెడిట్ కార్పొరేషన్ పనితీరుకు మధ్య ఉన్న సంబంధం.
ఇంత ఆందోళనకరమైన క్లాజులు ఉన్నాయి కాబట్టే ఎఫ్‌ఆర్డీఐ బిల్లు పట్ల ఖాతాదారుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల సమయంలో ఖాతాదారులతో గొడవ ఎందుకులెమ్మని బీజేపీ కూడా వెనక్కు తగ్గింది. ఇప్పుడు ఇదే బిల్లును ఎఫ్‌ఎస్‌డిఆర్ (ఫైనాన్షియల్ సెక్టార్ డెవలప్మెంట్ మరియు రెగ్యులేషన్ - ద్రవ్య రంగ అభివృద్ధి మరియు నియంత్రణ బిల్లు)గా ముందుకు తెస్తోంది. పేరులో సవరింపు తప్ప చట్టం ఉద్దేశాల్లో ఎటువంటి సవరింపులూ లేవు. పాత బిల్లుకు కొత్త బిల్లుకు ఉన్న తేడా ఒక్కటే. పాత బిల్లులో ఖాతాదారుల సొమ్మును ఖాతాదారుల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా టర్మ్ డిపాజిట్లుగా మార్చవచ్చు. కొత్త బిల్లులో బ్యాంకులకు ఆ అధికారం ఇవ్వటం లేదు. మిగిలినవన్నీ షరామామూలే. అంటే జాతీయ ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణ కర్తవ్యం రీత్యా బ్యాంకుల్లో ఉన్న ఖాతాదారుల సొమ్ములో ఇంత మాత్రమే చెల్లించగలం. మిగిలింది చెల్లించలేమని బ్యాంకులు చేతులెత్తేందుకు సంపూర్ణ అధికారాన్ని ఈ బిల్లు బ్యాంకులు, ఇతర ద్రవ్య సంస్థలకు కట్టబెడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఖాతాదారుల సొమ్ముకు భద్రత ఏమిటి అన్న ప్రశ్న ముందుకొస్తుంది. స్థూలంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. ఉన్న సొమ్మును ఒకే బ్యాంకులో పొదుపు చేయొద్దు. నాలుగైదు బ్యాంకుల్లో పొదుపు చేసుకుంటే వీలైనంత ఎక్కువ సొమ్ము వెనక్కు రాబట్టుకోవచ్చు. సహకార బ్యాంకుల్లో పొదుపు చేయరాదు. 'జమ చేయండి. మర్చిపోండి' అన్న పాశ్చాత్య బ్యాంకింగ్ సూత్రాల దిశగా భారత బ్యాంకింగ్ వ్యవస్థ అడుగులేస్తోంది. తస్మాత్ జాగ్రత్త!
కొత్త చట్టంలో డిపాజిట్ ఇన్సూరెన్స్ కింద బీమా రక్షణ కల్పించే మొత్తాన్ని ఇప్పుడున్న లక్ష రూపాయల నుండి పెంచాలన్న ప్రతిపాదన కూడా ఉంది. 1993లో తెచ్చిన సవరణ ద్వారా ఖాతాదారుల సొమ్ములో లక్ష రూపాయల వరకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంది. ప్రస్తుతం చట్టంలో ఉన్న ప్రతిపాదనల వరకు మన పరిశీలన పరిమితమైతే పరిస్థితి ఇలా ఉంటుంది. ఖాతాదారులు ఓ బ్యాంకులో ఎంత సొమ్ము దాచుకున్నారు అన్న దాంతో నిమిత్తం లేకుండా లక్ష రూపాయల వరకు పొందుతారు. ఈ విషయం తెలియని ఖాతాదారులు బ్యాంకులపై పూర్తి భరోసాతో ఇంట్లో ఉన్న పొదుపు సొమ్ము అంతా బ్యాంకుల్లో జమ చేస్తారు. అంతటి నమ్మకం ప్రభుత్వ బ్యాంకుల మీద ఎందుకు వచ్చింది. 1969లో బ్యాంకులు జాతీయం చేసినప్పటి నుండీ అటువంటి నమ్మకం పెరిగింది. ఈ విషయాన్ని నాటి ఆర్బీఐ గవర్నర్ ఐజి పటేల్ ఆర్బీఐ చరిత్ర మూడో సంపుటంలో పేర్కొన్నారు. వ్యవస్థల మీద ప్రజలకు ఉన్న నమ్మకం అది. పాలకవర్గం తన ప్రయోజనాల కోసం పెట్టుకున్నవే ఈ వ్యవస్థలనీ, తన ప్రయోజనాలకు అడ్డం అనుకుంటే ఆ వ్యవస్థలను సైతం కూలదోయటానికి సిద్ధం అన్నది మన కళ్లముందున్న వాస్తవం.