Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేల నినాదాల హౌరు
- ప్లకార్డులతో సభలో బైటాయింపు.. పలు అంశాలపై నిరసన
- గవర్నర్ ప్రసంగానికి అంతరాయం
లక్నో : యూపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలి రోజు నిరసనలు, నినాదాలతో హౌరెత్తాయి. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్నార్సీ), పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)లకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనను వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో రోజురోజుకూ క్షీణిస్తున్న శాంతి, భద్రతల పరిస్థితులు, ఉపాధి కల్పనలో ప్రభుత్వ వైఫల్యం, పెరిగిన వంటగ్యాస్ ధరలతో పాటు పలు అంశాలపై యోగి సర్కారుకు వ్యతిరేకంగా సభలో ఆందోళనకు దిగారు. దీంతో రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది.
అసెంబ్లీలో ప్రసంగించడానికి రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ సిద్ధమవుతుండగా.. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి చెందిన ఎమ్మెల్యేలు సభ వెల్‌లోకి దూసుకొచ్చారు. మరి కొందరు సభలోనే బైఠాయించి నిరసలు చేశారు. వివాదాస్పద సీఏఏ, ప్రతిపాదిత ఎన్నార్సీలకు వ్యతిరేకంగా పలువురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్లకార్డులను చేతబట్టుకొని వాటికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రంతో పాటు యోగి సర్కారుకు వ్యతిరేకంగా వారంతా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితుల్లోనే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నిరసనలు చేస్తున్న సమయంలో సభలోనే ఉన్న రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్.. గవర్నర్ ప్రసంగం సందర్భంగా బల్లను చరుస్తూ కనిపించారు.
సభ బయట కూడా ఎస్‌పీ, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలు తమ ఆందోళనను కొనసాగించారు. అధిక ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బయట టమాటాలను పంపిణీ చేశారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లతో పాటు పలు అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలపై యోగి సర్కారును మరింత గట్టిగా నిలదీయాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి.
అసోం ఎన్నార్సీ మాజీ కోఆర్డినేటర్‌పై ఎఫ్‌ఐఆర్
తుది పౌర జాబితాలో ప్రతీక్ హజేలా అవకతవకలు
ఓ ఎన్జీవో ఆరోపణ
గువహతి : అసోం ఎన్నార్సీ తుది జాబితాలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై రాష్ట్ర ఎన్నార్సీ మాజీ కో-ఆర్డినేటర్ ప్రతీక్ హజేలాపై ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. ఈ మేరకు అసోం పోలీసు సీఐడీకి.. అసోం పబ్లిక్ వర్క్స్(ఏపీడబ్ల్యూ) ఫిర్యాదు చేసింది. ప్రతీక్ హజేలాతో పాటు ఆయన అనుయాయులు, విప్రోలకు ఇందులో భాగస్వామ్యం ఉందనీ, అకౌంటెంట్ జనరల్ కొన్ని అవకతవకలను గుర్తించారని ఏపీడబ్ల్యూ ఆరోపించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు, సూచనలను హజేలా గౌరవించలేదని ఏపీడబ్ల్యూ సభ్యులు రాజీవ్ డెకా అన్నారు. ఎన్నార్సీ తుది జాబితా విడుదలైన తర్వాత ఇందులో జరిగిన అవకతవకలను సామాజిక మాధ్యమాలు, మీడియా బయటకు తీసుకొచ్చాయని ఎన్జీవో తెలిపింది. తుది జాబితా విడుదల అనంతరం కూడా ఎందరో 'అనుమానిత' పేర్లు అందులో వచ్చి చేరాయని ఆరోపించింది.
కాగా, ఎన్నార్సీ అధికారిక వెబ్‌సైట్ నుంచి అసోం పౌరుల తుది జాబితా రెండు రోజుల నుంచి కనబడకుండాపోయిన విషయం తెలిసిందే. సాంకేతిక సమస్య కారణమని కేంద్రం తెలుపగా.. క్లౌడ్ సర్వీసును అందించిన ప్రముఖ ఐటీ సంస్థతో ఒప్పందాన్ని పునరద్ధరించుకోకపోవడంతోనే ఇలా జరిగిందని రాష్ట్ర ఎన్నార్సీ కో ఆర్డినేటర్ హితేశ్ దేవ్ శర్మ వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రం, రాష్ట్ర ఎన్నార్సీ అధికార యంత్రాంగాలు సమాచార భద్రతపై నిర్లక్ష్యం వహించడం పట్ల సర్వత్రా విమర్శలతో పాటు.. అవకతవకలు జరిగాయేమోనన్న అనుమానాలు ప్రజా, సామాజిక సంఘాల కార్యకర్తల నుంచి వెల్లువెత్తుతున్నాయి. అయితే తాజాగా ఎన్నార్సీ తుది జాబితాకు సంబంధించిన పాస్‌వర్డ్‌ను సమర్పించనందుకు మాజీ అధికారిణిపై హితేశ్‌దేవ్ శర్మ గువహతిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేశారు. తుది జాబితాకు సంబంధించిన పాస్‌వర్డ్‌ను తమకు అందించాలను పలుమార్లు సదరు మాజీ అధికారిణికి లేఖలు రాశామనీ, కానీ ఆమె మాత్రం స్పందించలేదని శర్మ ఆరోపించారు. అయితే కొత్తగా పాస్‌వర్డ్ నెపంతో తప్పునంతా మాజీ అధికారిణిపై నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్నార్సీ యంత్రాంగాలు చేస్తున్నాయని ఆరోపణలు వినబడుతున్నాయి. ఐటీ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందానికి సంబంధించిన ప్రతిని కోరుతూ సీనియర్ జర్నలిస్టు, సమాచార హక్కు కార్యకర్త సాకేత్ గోఖలే.. ప్రభుత్వ ఐటీ వింగ్ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ)కి దరఖాస్తు చేశారు. ఈ మేరకు ఆర్టీఐ దరఖాస్తు ప్రతిని జోడిస్తూ ఆయన ట్వీట్ చేశారు.
బెయిల్‌పై కఫీల్ ఖాన్ విడుదల
అలీగఢ్ : సీఏఏకు వ్యతిరేకంగా ప్రసంగించారన్న ఆరోపణలపై అరెస్టయిన యూపీ వైద్యుడు కఫీల్ ఖాన్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ కేసుపై అలీగఢ్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేటు బెయిల్ మంజూరు చేయడంతో మథుర కారాగారం నుంచి కఫీల్‌ఖాన్ విడుదలయ్యారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గత డిసెంబర్‌లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ)లో జరిగిన నిరసన కార్యక్రమంలో ప్రసంగించారన్న ఆరోపణలపై యూపీ పోలీసులు ఆయనను గతనెల 29న ముంబయిలో అరెస్టు చేశారు. ఆయనపై కేసు కూడా నమోదు చేశారు. అనంతరం కఫీల్‌ఖాన్‌ను పోలీసులు మథుర జైలుకు తరలించారు. గోరఖ్‌పూర్‌లోని బీఆర్డీ మెడికల్ కాలేజీలో దాదాపు 60 మందికి పైగా చిన్నారుల మరణాలపై బాధ్యుణ్ణి చేస్తూ యోగి సర్కారు కఫీల్‌ఖాన్‌ను అరెస్టు చేయించి విధుల నుంచి తప్పించిన విషయం తెలిసిందే.
ఇంకా కస్టడీలోనే బీదర్ మహిళలు
పాఠశాలలో సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా నాటకం ప్రదర్శించారనే ఆరపణతో దేశద్రోహం కింద అరెస్టు చేసిన ఇద్దరు బీదర్ మహిళలు ఇంకా పోలీసుల కస్టడీలోనే ఉన్నారు. వీరిలో ఒకరు ఉపాధ్యాయిని కాగా మరొకరు ఓ పసిబిడ్డకు తల్లి. 14 రోజులుగా వీరు పోలీసుల కస్టడీలోనే ఉంటున్నారు. వీరి బెయిల్ పిటిషన్‌పై స్థానిక కోర్టు నేడు విచారణ చేపట్టనున్నది. ఇదే విషయమై బాధితుల తరఫున వాదిస్తున్న న్యాయవాది మైత్రేయి కృష్ణన్ స్పందిస్తూ.. ఇది కచ్చితంగా వేధింపులకు గురిచేయడమేనని అన్నారు. 1962లో కేదర్‌నాథ్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం.. ఏదైనా హింసకు దారితీసిన కేసులనే దేశద్రోహం కింద చూడాలని చెప్పిందని ఆమె తెలిపారు. ఈ కేసులో అలాంటిదేమీ జరగలేదనీ, విద్యార్థులు నాటకం ప్రదర్శించిన తర్వాత కూడా ఎలాంటి హింసాత్మక ఘటనలో చోటుచేసుకోలేదని ఆమె వివరించారు.
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చర్చకు నో
సీఏఏపై ఐఐటీ ఖరగ్ పూర్‌లో నిర్వహించదలిచిన చర్చ కార్యక్రమానికి వర్సిటీ యాజమాన్యం అనుమతి నిరాకరించింది. కొంతమంది పరిశోధక విద్యార్థులు కలిసి సీఏఏపై చర్చించడానికి బుధవారం (12న) ఓ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. దీనికి ముందు అనుమతినిచ్చిన వర్సిటీ యాజమాన్యం.. తర్వాత రద్దు చేసింది. యాజమాన్యం నుంచి ఆదేశాలతో.. 'పలు కారణాల రీత్యా' అనుమతులు రద్దు చేస్తున్నామని పరిపాలక విభాగం తెలిపింది. అవసరమైతే క్యాంపస్ బయట ఇలాంటివి నిర్వహించుకోవాలే గానీ లోపల అనుమతించబోమని విద్యార్థులకు చెప్పింది. దీనిపై విద్యార్థులు స్పందిస్తూ.. ఇది సాధారణ చర్చే అనీ, దీనిపై అనుమతులు రద్దు చేయడం దారుణమని అన్నారు. చర్చలో వక్తలుగా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులెవరూ లేరనీ, అయినా కూడా క్యాంపస్ యాజమాన్యం దీనిని తిరస్కరించిందని వారు తెలిపారు.