Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుమంత్ హీరోగా ప్రదీప్ కృష్ణమూర్తి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'కపటధారి'. 'సుబ్రహ్మణ్యపురం', 'ఇదంజగత్' చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్న సుమంత్ ఇప్పుడు 'కపటధారి' అనే ఎమోషనల్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. కన్నడంలో మంచి విజయం సాధించిన 'కావలుధారి' సినిమాకి ఇది తెలుగు రీమేక్. క్రియేటివ్ ఎంటర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బ్యానర్‌పై ఓ భిన్న పాయింట్‌తో రూపొందిన 'కావలుధారి' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో డా.ధనంజయన్ నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ను అక్కినేని నాగచైతన్య, సమంత విడుదల చేశారు. ''మెట్రో లైన్ తవ్వకాల్లో కొన్ని అస్థిపంజరాలు బయటపడ్డాయి.. ఈ శవాలను పాతిపెట్టి ఎంత కాలం అయ్యుంటుంది..! ట్రాఫిక్ ఎస్సైవా.. అదొక క్లోజ్డ్ కేస్ చనిపోయిన వ్యక్తి పేరు సంపత్ రాజ్.. దీన్ని బట్టి చూస్తే స్టేట్మెంట్ ఇచ్చిన వారిలో ఎవరో ఒకరు అబద్దం చెప్పారు. క్రైమ్ అయినా ట్రాఫిక్ అయినా పోలీస్ పోలీసే.. ఇలాంటి డైలాగ్స్‌తో పాటు ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ చిత్ర ట్రైలర్ ఉంది. కొంతకాలం క్రితం జరిగిన హత్యలకు సంబంధించిన అస్థిపంజరాలు దొరుకుతాయి. వాటిని సీరియస్‌గా తీసుకున్న పోలీస్ ఆఫీసర్ ఎలా ఛేదిస్తాడు?, ఈ కేసును సాల్వ్ చేసే క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు ఏంటి?, వాటిని కథానాయకుడు ఎలా అధిగమించాడు?, అసలు హంతకుడు ఎవరు? అనే అంశాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందేనని, త్వరలో విడుదల తేదిని ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. 'ఆద్యంతం ఆసక్తికరంగా ఉండే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుందనే నమ్మకం ఉంది. ఇప్పటివరకు ఎన్నో థ్రిల్లర్ సినిమాలొచ్చాయి. వాటితో పోలిస్తే ఇదొక డిఫరెంట్ సినిమా' అని దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి అన్నారు.
ఈ చిత్రానికి డా.ధనుంజయన్ స్క్రీన్‌ప్లే అడాప్షన్ చేస్తుండగా, బాషాశ్రీ మాటలు అందిస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్ ఎడిటర్‌గా, స్టంట్ సిల్వ స్టంట్ మాస్టర్‌గా, విదేశ్ ఆర్ట్ డైరెక్టర్‌గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.
సుమంత్, నందిత, పూజాకుమార్, నాజర్, జయప్రకాశ్, సంపత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం: ప్రదీప్ కృష్ణమూర్తి, నిర్మాత: డా.జి. ధనంజయన్, యాక్షన్: స్టంట్ సిల్వ, మ్యూజిక్: సైమన్ కె.కింగ్, ఆర్ట్: విదేశ్, ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్, మాటలు: బాషా శ్రీ, స్క్రీన్ ప్లే అడాప్షన్: డా.జి.ధనంజయన్, కథ: హేమంత్ ఎం.రావు.