Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రహ్మానందం, యువ హీరో రాహుల్ విజయ్, 'మత్తు వదలరా' ఫేమ్ నరేష్ అగస్త్య ముఖ్య తారాగణంగా ఓ సినిమా రూపొందుతోంది. టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంస్థలు సంయుక్తంగా ప్రొడక్షన్ నెం1గా నిర్మిస్తున్న ఈ సినిమా బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్, సజన్ ఎరబోలు నిర్మాతలు. పూజా కార్యక్రమాల అనంతరం రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్మాత సజన్ ఎరబోలు మాట్లాడుతూ 'బ్రహ్మానందం, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్యతో పాటు మరో ముగ్గురు స్టార్లు ఈ సినిమాలో నటించనున్నారు. త్వరలో ఆ స్టార్లు ఎవరనేది వెల్లడిస్తాం. సోమవారం హైదరాబాద్‌లో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించాం. 13 రోజుల పాటు ఏకధాటిగా నగరంలోనూ, నగర పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ చేస్తాం. విశాఖ, పాండిచ్చేరిలో తదుపరి షెడ్యూల్స్ ప్లాన్ చేశాం. 'కలర్ ఫొటో'తో ప్రేక్షకులతో పాటు పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు సందీప్ రాజ్ మా చిత్రానికి మాటలు రాయడం సంతోషంగా ఉంది. అలాగే, వరుస విజయాల్లో ఉన్న సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందిస్తున్నారు' అని చెప్పారు. ఈ చిత్రంతో రచయితగా, దర్శకుడిగా పరిచయమవుతున్న హర్ష పులిపాక మాట్లాడుతూ, 'ప్రతి జీవికి అవసరమైన పంచేంద్రియాలు.. చూపు, వినికిడి, రుచి, స్పర్శ, వాసన... ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ అల్లుకున్న కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. మనిషి మనుగడకు అవసరమైన ఎన్నో భావోద్వేగాలను వివరిస్తూ సాగే సినిమా ఇది. యువతరం ఆలోచనలు, వాళ్ల దక్పథాలకు అద్దం పట్టేలా కథ, కథనాలు నిజాయితీగా ఉంటాయి' అని తెలిపారు.