Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'శ్రీకారం' సినిమా చూసొచ్చిన తర్వాత ప్రతి ప్రేక్షకుడు కచ్చితంగా రైతుల గురించి ఆలోచిస్తాడు. ఆలోచించడమే కాదు.. కచ్చితంగా వారికి సహాయం చేయాలనే నిర్ణయానికి కూడా వస్తాడు' అని అంటున్నారు మాటల రచయిత బుర్రా సాయిమాధవ్. శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నూతన దర్శకుడు బి.కిషోర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'శ్రీకారం'. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ చిత్రం ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ బుధవారం మీడియాతో ఈ సినిమా విశేషాలను షేర్ చేసుకున్నారు.
'వృత్తిపరంగా కొన్ని సినిమాలు మంచి సంతృప్తినిస్తాయి. అలాంటి పూర్తి సంతృప్తినిచ్చిన సినిమా ఇది. రైతు సమస్యల నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలొచ్చాయి. అయితే రైతు కొడుకు రైతు ఎందుకు అవ్వడం లేదనే ఆలోచనాత్మక అంశంతో ఈ సినిమా రూపొందడం విశేషం. రైతులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల వల్ల రైతులు తమ కొడుకుల్ని రైతుల్ని చేయటం లేదు. తాము పడిన కష్టాలను వాళ్ళు పడకూడదనే ఉద్దేశంతో వేరే వృత్తుల్లో స్థిరపడమని చెబుతున్నారు. ఈ పరంపర ఇలాగే కొనసాగితే.. మనకి అన్నం దొరికేదెలా?, వ్యవసాయం చేసేదెవరు? వంటి ప్రశ్నలు తప్పకుండా తలెత్తుతాయి. ఇటువంటి పరిస్థితి రాకూడదని చేసిన ప్రయత్నమే ఈ సినిమా. 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' తర్వాత శర్వానంద్ చిత్రానికి పని చేయడం విశేషం. ఆ సినిమా మాదిరిగానే ఈ సినిమాలోని మాటలకు మంచి పేరొస్తుంది. దర్శకుడు కిషోర్ తాను అనుకున్న పాయింట్‌ను అద్భుతంగా తెర మీద ఆవిష్కరించాడు. రైతుల బాగు కోసం ప్రేక్షకులు కనీసం 5 నిమిషాలైనా ఆలోచిస్తారనే నమ్మకం ఉంది' అని సాయిమాధవ్ బుర్రా తెలిపారు.