Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఖైదీ', 'దొంగ' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత కార్తి నటిస్తున్న తాజా చిత్రం 'సుల్తాన్'. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి బక్కియరాజ్ కణ్ణన్ దర్శకుడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై యస్.ఆర్. ప్రకాష్‌బాబు, యస్.ఆర్.ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్రాల్లో కార్తికేయ ఎగ్జిబిటర్స్ ద్వారా వరంగల్ శ్రీను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా కథానాయకుడు కార్తి మంగళవారం మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు..
ఈ కథలో మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన పాయింట్?
- మాములుగా ఇంట్లో ఒక అన్నయ్య ఉంటేనే గొడవలు వస్తాయి. అలాంటిది వందమంది అన్నయ్యలు ఉంటే ఏం జరుగుతుంది? అనే పాయింట్ నన్ను బాగా ఎగ్టైట్ చేసింది. అదే ఈ సినిమా కథాంశం కూడా. దర్శకుడు బక్కియరాజ్‌కి ఇది రెండో చిత్రం. నన్ను కలిసి 20 నిమిషాలు ఈ కథకి సంబంధించిన ఐడియా చెప్పారు. రోబోటిక్ ఇంజనీర్ అవ్వాలనుకునే ఓ యువకుడు తన కుటుంబం కోసం 100 మంది రౌడీలను చూసుకోవాల్సి వస్తే అతడి పరిస్థితి ఏంటి?, ఆ వంద మంది రౌడీలను ఎలా కంట్రోల్ చేశాడనే స్టోరీలైన్ చెప్పాడు. ఈ సినిమాలో డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్‌కి మంచి స్కోప్ ఉంది. ఒక కుటుంబంలోని అందరూ ఎంజారు చేసే చిత్రమిది. ఆ ధైర్యంతోనే ఈ సినిమాని థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం.
ఓటీటీ నుంచి ఏమైనా ఆఫర్లు వచ్చాయా?
- చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ఈ సినిమా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కోసమే చేశాం. అందుకే థియేటర్స్‌లోనే రిలీజ్ చేస్తున్నాం. కొన్ని సినిమాలను థియేటర్లలో చూస్తేనే కిక్ వస్తుంది. అలాంటి కిక్ ఇచ్చే సినిమా ఇది.
'సుల్తాన్' టైటిల్ పెట్టడానికి కారణం?
- ఈ సినిమాలో మలయాళ నటుడు లాల్ నాకు గాడ్ ఫాదర్ లాంటి క్యారెక్టర్ చేశారు. వాళ్లు ఈ సినిమాలో ముస్లీమ్స్. చిన్నప్పటినుండి వాళ్లే పెంచుతారు. ఆయన నన్ను ముద్దుగా సుల్తాన్ అని పిలుస్తాడు. అందుకే ఆ టైటిల్ పెట్టాం. ఈ సినిమాలో వెరీ స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ ఉంది. కెమెరామెన్ సత్యన్ సూర్యన్ 'ఖాకీ', 'ఖైదీ', 'మాస్టర్' వంటి సినిమాలు చేశారు. ఎడిటర్ రూబెన్ కూడా అన్ని పెద్ద సినిమాలకే వర్క్ చేశారు.
రష్మికతో వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?
- తను ఈ సినిమాలో గ్రామీణ అమ్మాయి క్యారెక్టర్‌లో కనిపిస్తుంది. తను ఇంతకు ముందు ఇలాంటి పాత్రలు చేసిందనుకున్నా. కాని తనకీ ఇది ఫస్ట్ టైమ్. పల్లెటూరు అంటే ఏం తెలీదు. ఈ సినిమాలో ట్రాక్టర్ నడపటం, పాలు పితకడం వంటి పనులన్ని చేసింది. సగం మూవీ పూర్తయ్యాక విలేజ్ లైఫ్ ఇంత టఫ్‌గా ఉంటుందా? అని అడిగేది. తన పాత్రలో చాలా బాగా నటించింది. అద్భుతమైన నటి.
'ఖైదీ' తర్వాత మీ కథల ఎంపికలో ఏమైన మార్పు వచ్చిందా?
- సినిమాకి, సినిమాకి వేరియేషన్ ఉండేలా, అలాగే నా పాత్రలు సైతం డిఫరెంట్‌గా ఉండేలా చూస్తున్నాను. ప్రస్తుతం మణిరత్నంతో చేస్తున్న 'పొన్నియణ్ సెల్వన్' ఓ ఎపిక్ మూవీ అయితే, 'అభిమన్యుడు' డైరెక్టర్ మిత్రన్‌తో మరో డిఫరెంట్ సినిమా చేస్తున్నాను. అది కూడా నాకొక ఛాలెంజింగ్ మూవీ.
లాక్‌డౌన్ తర్వాత తెలుగు, తమిళ పరిశ్రమల్లో మీరు గమనించిన అంశాలు?
- తెలుగునాట సినిమాలు బాగా ఆడుతున్నాయి. తెలుగు ఇండిస్టీ వల్లే అందరికీ ఒక నమ్మకం వచ్చింది. నా సినిమా వస్తుంది అన్నప్పుడు కూడా ఇక్కడ మంచి సినిమా వస్తే బాగా ఆడుతుంది అనే నమ్మకం ఉంది.
అన్నయ్య సూర్యతో కలిసి ఎప్పుడు నటిస్తారు?
-మంచి కథ దొరికితే తప్పకుండా అన్నయ్యతో కలిసి నటిస్తాను. మీలాగే నేనూ ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నా.