Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫ్రెండ్లీ ఫిల్మ్ ప్రొఫైల్ పతాకంపై శీను ఇమంది దర్శకత్వంలో మధువర్మ, రవి మామిడి, జమ్ముధన, సత్యనారాయణ కాజా, ప్రవీణ్ బూడి, కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'బీటెక్ బాబులు'. శౌర్యా, రోషిణి, షకలక శంకర్, రాణి, వైజాగ్ శంకర్, నొవల్ కిషోర్, నిషిత ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రం లోగో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో జరిగింది. అతిథిగా విచ్చేసిన ఆర్పీ పట్నాయక్ చిత్ర లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'లోగోను బట్టే దర్శకుడిలో సృజనాత్మకతలోని వైవిధ్యమేంటో అర్ధమవుతుంది. పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. స్టూడెంట్స్‌కి బాగా కనెక్ట్ అయ్యే చిత్రమిది' అని అన్నారు. 'బీటెక్ చదువుకున్న నలుగురి యువకుల్లో నాలుగేళ్లలో వచ్చిన మార్పుల నేపథ్యంలో నవ్విస్తూ కవ్విస్తు, ఆలోచింపజేసే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్ట్‌లో ఆడియో విడుదల చేసి సెప్టెంబర్‌లో సినిమాను రిలీజ్ చేయడానికి ఫ్లాన్ చేస్తున్నాం'అని దర్శకుడు శీను ఇమంది తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు అజరు పట్నాయక్, రోషిణి తదితరులు పాల్గొన్నారు.