Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఇటీవల ఎక్కువగా డీ గ్లామర్ తరహా పాత్రలు పోషించా. ఇందులో యూత్‌ఫుల్‌గా కనిపించాను. అందుకే కొత్తగా కనిపిస్తున్నాను' అని చెప్పారు నాగార్జున. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున, నాని, ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'దేవదాస్'. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది.
ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నాగార్జున మాట్లాడుతూ, 'అశ్వనీదత్ 'ఆఖరి పోరాటం' టైమ్‌లో ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు. ఇద్దరు కూతుళ్ళ రూపంలో ప్రొడక్షన్ కోసం ఆయనకి తోడు దొరికింది. నాలో వచ్చిన తేడా ఏంటంటే ఇప్పుడు టైమ్‌కి వస్తున్నాను. ఇందులో నేను అంతర్జాతీయ మాఫియా డాన్ దేవగా నటించాను. మాఫియా అంశాలు ఎక్కువగా చూపించలేదు. దేవ వ్యక్తిగత జీవితంపై ఎక్కువ ఫోకస్ పెట్టాం. అందుకే నాకూ కొత్తగా ఉంది. దాస్‌తో ఏర్పడిన స్నేహమే సినిమా. ఒకరిని మరొకరు ఎలా ప్రభావితం చేశారనేది ప్రధానం. సరదాగా నవ్వుకునేలా బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తీసిన 'మున్నాభారు', 'సంజు' చిత్రాల మాదిరిగా ఉంటుంది. టైటిల్ ఫస్ట్ 'కృష్ణదాస్' అనుకున్నాం. తర్వాత 'దేవదాస్' అని ఫిక్స్ అయ్యాం. అశ్వనీదత్ ఇటీవల 'మహానటి'తో పెద్ద హిట్ అందుకున్నారు. ఆ కోవలోనే క్లాసిక్ చిత్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ టైటిల్ అనుకున్నాం. పాత సినిమాను గుర్తు చేసుకోవడమనేది కూడా బాగుంటుంది. అందుకే రాయల్ సెల్యూట్ బాటిల్ కూడా పెట్టాం. శ్రీరామ్ ఆదిత్య లేజీ ఫెలో. మాకు మూడు రోజుల ముందు సినిమా చూపించాడు. నెల రోజుల ముందే చూపిస్తే ఇంకా బెటర్‌మెంట్ చేసుకోవడానికి ఉంటుంది. అయితే ఇంత మందిస్టార్ కాస్ట్‌ను డీల్ చేస్తూ తెరకెక్కించడం కూడా చాలా ప్రెజర్‌తో కూడినది. శ్రీరామ్‌కే కాదు, ఇతర దర్శకులకు కూడా చెబుతున్నా సినిమాను నెల రోజుల ముందే పూర్తి చేయగలిగితే ఏదైనా మార్పులు చేయడానికి స్కోప్ ఉంటుంది. సినిమాలో 'ఏమో..ఏమో' సాంగ్ నాకు బాగా నచ్చింది. ఇది నానిపై వస్తుంది. ఓ రకంగా నానిపై జెలసీగా ఉంది. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీలో మూడు వరుసగా మల్టీస్టారర్ చిత్రాలు చేయడం అనుకోకుండా కుదిరాయి. సినిమా సరదాగా, నవ్వులతో సాగుతుంది' అని అన్నారు.
'ఇందులో నేను దాస్ పాత్రలో నటించా. చాలా ఇన్నోసెంట్. సాఫీగా సాగిపోతున్న నా జీవితంలో ఊహించని వ్యక్తి రావడంతో నా లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగిందనేది ఆసక్తికరం. నాగార్జున సార్‌కి పెద్ద అభిమానిని. ఇప్పుడు ఆయనతో కలిసి నటించడమనేది గొప్పగా, అదృష్టంగా భావిస్తున్నా. ఆయనకు నచ్చినా, నచ్చకపోయినా ఓపెన్‌గా చెబుతారు. సినిమా పూర్తయిన తర్వాత నా గురించి, నటన గురించి ఆయన చెప్పిన మాటలు ఎప్పుటికీ మర్చిపోలేను. మా కెమిస్ట్రీ బాగా కుదిరింది. నా లైఫ్‌లో మోస్ట్ హెక్టిక్ వీకెండ్ ఇది. ఓ వైపు బిగ్‌బాస్, మరో వైపు 'దేవదాస్'. ఓ వైపు ఎగ్జైటింగ్‌గా, మరోవైపు టెన్షన్, ఒత్తిడి. ఇలా ప్లస్, మైనస్‌లు కలిసి ఒకేసారి వచ్చినట్టుంది. ఈ వారం గడిచిపోతే కొన్ని రోజులు కాశీకి వెళ్ళిపోతా(నవ్వుతూ)' అని నాని తెలిపారు.
దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చెబుతూ, 'నాగార్జున, నాని చాలా కంఫర్టబుల్ యాక్టర్స్. చాలా కూల్‌గా షూటింగ్ సాగింది. మల్టీస్టారర్ సినిమా చేయడం ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. సినిమాలో వినోదంతోపాటు చిన్న సర్‌ప్రైజ్ కూడా ఉంటుంది. అది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే' అని చెప్పారు. 'ఇందులో పక్కింటి అమ్మాయిగా కనిపిస్తా. నా పాత్రలో చాలా సర్‌ప్రైజ్‌లుంటాయి' అని రష్మిక మందన్నా చెప్పారు. 'నాగార్జునతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను' అని ఆకాంక్ష సింగ్ తెలిపారు. నిర్మాత అశ్వనీదత్ చెబుతూ, 'ఒకప్పుడు 'గుండమ్మకథ'లో ఎన్టీఆర్, ఏఎన్నార్‌లను చూస్తే ఎలా అనిపించిందో చాలా రోజులు తర్వాత ఈ సినిమా చూస్తే అలా అనిపించింది. ఈ సినిమా కూడా ఆ చిత్రం మాదిరి విజయం సాధిస్తుంది' అని చెప్పారు.