Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రజనీకాంత్, కమల్ హాసన్ ఈ ఇద్దరు తమిళ చిత్ర పరిశ్రమలోనే కాదు యావత్ భారతీయ సినీ పరిశ్రమని విశేషంగా ప్రభావితం చేసిన హేమాహేమీలు.
రజనీకాంత్ తనదైన స్టయిలీష్, మాస్ నటనతో మెప్పిస్తే, కమల్ హాసన్ అద్భుతమైన విలక్షణ నటనతో ప్రేక్షకులను ఫిదా చేశారు. అలాంటిది వీరిద్దరు తెరపై మెరిస్తే ఆ అద్భుతాన్ని ఓ వండర్‌గా చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. మరి అలాంటి అరుదైన, అద్భుతమైన కలయిక త్వరలో కుదరబోతుందని సమాచారం. రజనీకాంత్, కమల్ హాసన్ హీరోలుగా ఓ భారీ మల్టీస్టారర్‌కి యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ('ఖైదీ' ఫేమ్) ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం వారితో కథా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇదే సెట్ అయితే దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు కలిసి నటించబోతున్న సినిమా అవుతుంది. అలాగే భారతీయ సినిమా చరిత్రలో ఇదొక సంచలన చిత్రం అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇద్దరు హీరోల అభిమానుల ఆనందానికైతే ఆకాశమే హద్దు. ఇప్పటికే ఈ వార్త తెలిసి అభిమానులు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. త్వరగా ఈ కాంబినేషన్ సెట్ కావాలని కోరుకుంటున్నారు. కెరీర్ బిగినింగ్‌లోనే రజనీకాంత్, కమల్ కలిసి 'అపూర్వ రాగంగల్'తోపాటు 'అవళ్ అప్పడిదాన్', 'ఇళమై ఊంజలాడు గిరదు', 'అవర్గళ్', 'వయసు పిలిచింది', 'గెరాప్తార్', 'ఊరువంగళ్ మారలామ్', 'అలవుదీనుమ్ అల్బుత వెలక్కుమ్' వంటి దాదాపు 16 సినిమాలు చేశారు. అందులో చాలా వరకు విజయం సాధించాయి. అయితే అప్పట్లో మల్టీస్టారర్ చిత్రాలకు అంతగా క్రేజ్ లేదు. ఈ నేపథ్యంలో తాజా మల్టీస్టారర్‌పై సర్వత్రా విపరీతమైన క్రేజ్ నెలకొంది. ప్రస్తుతం రజనీకాంత్ 'దర్బార్' చిత్రంలో నటిస్తున్నారు. ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల కానుంది. కమల్ హాసన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'భారతీయుడు 2' చేస్తున్నారు.