Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అతడు నా ముఖాన్ని నాశనం చేశాడు. కానీ నా ఆత్మ విశ్వాసాన్ని కాదు' అని అంటోంది దీపికా పదుకొనె. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'ఛపాక్'. ఢిల్లీ యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా మేఘనా గుల్జర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్ర ట్రైలర్‌ని మంగళవారం విడుదల చేశారు. 'మాకు న్యాయం కావాలి. న్యాయం కావాలి' అని యువత ఢిల్లీ రోడ్లపై ఆందోళన చేస్తున్న డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. పెళ్ళికి నిరాకరించాడని మాలతిగా నటిస్తున్న దీపికాపై ఓ యువకుడు యాసిడ్ చల్లడంతో ఆమె మానసికంగా ఎంతో కృంగిపోతుంది. ఆసుపత్రిలో, ఇంట్లో ఎంతో వేదన అనుభవిస్తుంది. మనోధైర్యంతో నెమ్మదిగా బయటకు రావడం, ఈ క్రమంలో 'యాసిడ్ అమ్మడం ఆపేస్తే ఎంత బాగుంటుంది, ఈ దాడులు ఆగిపోతాయి' అని ఆవేదన చెందడం, 'అతడు నా ముఖాన్ని నాశనం చేశాడు. కానీ నా ఆత్మ విశ్వాసాన్ని కాదు' అని చెప్పడం ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచింది. యాసిడ్ దాడి బాధితురాలి పాత్రలో దీపికా ఒదిగిన తీరుకి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం దీపికా ఈ చిత్రంతోపాటు '83'లో నటిస్తుంది. అలాగే 'త్రిబులెక్స్' సిరీస్‌లోనూ నటించే అవకాశం వచ్చిందని టాక్.