Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తూటాల్లాంటి మాటలకు పక్కా కేరాఫ్ గొల్లపూడి మారుతీరావు. రచయితగా, వక్తగా, నటుడిగా, దర్శకుడిగా, కాలమిస్టుగా బహుముఖ ప్రజ్ఞతో తెలుగు ప్రేక్షకుల మనసులపై చెరగని సంతకం చేసిన గొల్లపూడి (80) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. మూడున్నర దశాబ్దాల కాలంలో దాదాపు 250కి పైగా చిత్రాల్లోని విలక్షణ పాత్రలతో ఆశేష ప్రేక్షకలోకాన్ని అలరించిన గొల్లపూడి ఇకలేరనే విషయాన్ని యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది.
నాటకాలతో బీజం
'గొల్లపూడి'గా పాపులర్ మారుతీరావు విజయనగరం జిల్లాలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో 1939 ఏప్రిల్ 14న జన్మించారు. సుబ్బారావు, అన్నపూర్ణలకు గొల్లపూడి ఐదో సంతానం. విశాఖపట్నం సీబీఎం హైస్కూల్‌లో పాఠశాల విద్యని, ఏ.వి.ఎన్ కాలేజ్‌లో కాలేజ్ విద్యని, ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నత విద్యని పూర్తి చేశారు.
తన పద్నాలుగవ ఏటనే కథా రచయితగా కెరీర్‌ని ప్రారంభించారు. 'రేనాడు' అనే ప్రొద్దుటూరు పత్రికలో 'ఆశాజీవి' పేరుతో తొలి రచన చేశారు. రచయితగా గొల్లపూడికి జన్మనిచ్చిన కథ అది. 16 ఏండ్లకే నాటకాలు రాయడం ప్రారంభించారు. 'అనంతం' పేరుతో మొదటి నాటకాన్ని రాశారు. అంతేకాదు ఇందులోని ఓ పాత్రలోనూ నటించారు. స్టూడెంట్‌గా ఉన్నప్పుడే 'స్నానాలగది', 'మనస్తత్వాలు' అనే నాటకాల్లో నటించారు. అనేక నాటకాలు రాసి, అందులో నటించారు. కాలేజ్ టైమ్‌లో జరిగిన నాటక రచనా పోటీల్లో ఉత్తమ రచయితగా బహుమతి కూడా గెలుచుకున్నారు. ఆ టైమ్‌లోనే 'రాఘవ కళానికేతన్' పేరుతో నాటక బృందాన్ని నడిపించారు. 'ఆడది', 'కుక్కపిల్ల దొరికింది', 'స్వయం వరం', 'రిహార్సల్స్', 'వాపస్', 'మహానుభావులు' వంటి తదితర నాటకాలకి నిర్మాణం, దర్శకత్వం వహించడంతోపాటు ప్రధాన పాత్రలోనూ నటించి మెప్పించారు.
రచయితగా విశేష గుర్తింపు
ఒక పని మరో పనిలోకి ప్రవేశం కల్పించిందన్నట్టు ఆయన చేసిన జాబ్‌లు ఒక్కోదానికి మరోటి కారణమయ్యాయి. 1959లో చదువు పూర్తయిన తర్వాత ఆంధ్రప్రభ పత్రికలో ఉప సంచాలకునిగా పనిచేశారు. ఆ తర్వాత రేడియోలో ట్రాన్స్ మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా ఎంపికయ్యారు. ఇందులో ఉద్యోగం సంపాదించడానికి ముందు 'వందేమాతరం' నాటిక రాశారు. పలు జిల్లాలో దాన్ని ప్రదర్శించారు. దీని ద్వారా వచ్చిన రూ.50వేల రూపాయల్ని ప్రధానమంత్రి రక్షణ నిధికి అందజేశారు. ఆ నాటకానికి అప్పటి విదేశీ వ్యవహారాల మంత్రి పి.వి.నరసింహారావు ఉపోద్ఘాతం రాయడం విశేషం. 1959 డిసెంబర్ 16న 'రాగరాగిణి' అనే నాటకం అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎదుట ప్రదర్శించారు. దీన్ని తర్వాత 'పథర్ కే అన్సూ' పేరుతో హిందీలోకి అనువదించారు. 1981లో ఆకాశవాణి కడప కేంద్ర డిప్యూటీ డైరెక్టర్‌గా దాదాపు రెండు దశాబ్దాలు పనిచేశారు.
సినీ రంగ ప్రవేశం
సంపాదకునిగా, మాటల రచయితగా రాణించిన గొల్లపూడి సినీ రంగ ప్రవేశం 1980 తర్వాత జరిగింది. తొలుత పలు సినిమాలకు కథా రచనల్లో సహకారం అందించారు. దీంతో పలువురు దర్శకులు, నిర్మాతలతో ఆయనకు మంచి పరిచయం ఏర్పడింది. చిరంజీవి నటించిన 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' చిత్రంతో నటుడిగా మారారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో దీన్ని నిర్మాత కె.రాఘవ నిర్మించారు. వీరిద్దరి ఒత్తిడి మేరకు ఆయన నటుడిగా మారాల్సి వచ్చింది. 'డాక్టర్ చక్రవర్తి'తో ఆయన పూర్తి స్థాయి రచయితగా మారారు. ఈ చిత్రానికి కె.విశ్వనాథ్ కో డైరెక్టర్‌గా పని చేశారు. అంతేకాదు మొదటి సినిమాతోనే నంది అవార్డు అందుకున్నారు. దీంతో నటుడిగాను, రైటర్‌గా బిజీ అయి కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మాటలతో అనేక ప్రయోగాలు చేసి విలక్షణ రైటర్‌గా పేరు తెచ్చుకున్నారు.
అలాగే నటుడిగానూ తనలోని భిన్న కోణాలను ఆవిష్కరించారు. 250కిపైగా చిత్రాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా నటించి తన విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిపై చెరగని ముద్ర వేశారు. 'మనిషికో చరిత్ర',
'ఇది పెళ్ళంటారా', 'సంసారం ఒక చదరంగం', 'స్వాతిముత్యం', 'తరంగిణి', 'త్రిశూలం', 'అసెంబ్లీ రౌడీ', 'ముద్దుల ప్రియుడు', 'ఆదిత్య 369', 'యముడికి మొగుడు', 'స్వాతి', 'గూఢచారి నెం.1', 'అభిలాష', 'పల్లెటూరి మొనగాడు', 'ఛాలెంజ్', 'మురారి', 'లీడర్', 'దరువు', 'కంచె', 'మనమంతా' వంటి చిత్రాలు ఆయన నటనలోని విలక్షణత్వానికి ప్రతిబింబంగా నిలిచాయి. చివరగా ఆయన 'జోడి' చిత్రంలో కనిపించారు. దీంతోపాటు పలు సీరియల్స్‌లోను, అలాగే పలు టీవీ షోస్‌కి వ్యాఖ్యాతగానూ వర్క్ చేసి అందర్ని అలరించారు.
తనయుడి పేరుతో అవార్డులు
గొల్లపూడి వివాహం శివకామసుందరితో 1961 నవంబర్ 11న హన్మకొండలో జరిగింది. వీరికి ముగ్గురు కుమారులున్నారు. పెద్దవాళ్ళిద్దరు సుబ్బారావు, రామకృష్ణ మారుతీ ఎయిర్ లింక్స్ అనే ట్రావెల్ ఏజెన్సీని నడిపిస్తున్నారు. చిన్న కుమారుడు శ్రీనివాస్ 1992లో మరణించారు. గొల్లపూడి తొలి ప్రయత్నంగా దర్శకత్వం వహిస్తున్న 'ప్రేమ పుస్తకం' అనే చిత్ర షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో కుమారుడు శ్రీనివాస్ మరణించారు. దీంతో తన కుమారుడి జ్ఞాపకార్థం గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డుని నెలకొల్పారు. అందులో భాగంగా ఉత్తమ నూతన దర్శకుడికి, సినిమాలకు సంబంధించి విశేష ఉపన్యాసం చేసిన ప్రముఖునికి గౌరవ సూచకంగా గొల్లపూడి మెమోరియల్ లెక్చర్ పేరిట అవార్డులను అందిస్తున్నారు. సునీల్‌దత్, సనీరుద్దీన్ షా, మృణాల్ సేన్, శ్యామ్‌బెనెగల్, జావెద్ అక్తర్, అనుపమ ఖేర్ ఇందులో ప్రసంగించిన వారులో ఉండటం విశేషం.
ప్రతిభకు దక్కిన పురస్కారాలు
గొల్లపూడి రచనకు అనేక పురస్కారాలు దక్కాయి. తొలి సినిమా 'డాక్టర్ చక్రవర్తి', 'ప్రేమ పుస్తకం'కిగానూ ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా, 'ఆత్మ గౌరవం' చిత్రానికి ఉత్తమ రచయితగా, 'కళ్ళు'కి ఉత్తమ రచయితగా, 'మాస్టారి కాపురం' చిత్రానికి ఉత్తమ మాటల రచయితగా నంది అవార్డులు పొందారు. 1975లో 'కళ్ళు' నాటకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, 2002లో రాజాలక్ష్మీ ఫౌండేషన్ విశిష్ట పురస్కారం దక్కాయి. 'కళ్ళు' నాటకాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ ఆదాన్ ప్రదాన్ కార్యక్రమం కింద అన్ని భారతీయ భాషల్లోకి అనువదించారు. ఇదే నాటకం ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ. తెలుగు సాహిత్యం వారికి పాఠ్య పుస్తకంగా ప్రతిపాదించారు. ఉత్తమ హాస్య రచయితగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అందించే సర్వరాయ మెమోరియల్ బంగారు పతకం అందుకున్నారు. 2002లోనే తెలుగు యూనివర్సిటీ నుంచి పైడి లక్ష్మయ్య ధర్మనిధి పురస్కారం పొందారు. 1983లో 'తరంగిణి' చిత్రానికిగానూ ఉత్తమ హాస్యనటుడి పురస్కారం, 1987లో 'సంసారం ఒక చదరంగం' సినిమాకిగానూ ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవార్డుని దక్కించుకున్నారు.
పాఠకుల్ని మెప్పించిన రచనలు
గొల్లపూడి 'కౌముది' పేరుతో రచనలు చేసేవారు. అవి పలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అలాగే పుస్తకాలు కూడా రాశారు. 'సమగ్ర సాహిత్యం' పేరుతో ఓ పుస్తకాన్ని పలు భాగాలుగా రాశారు. దీంతోపాటు 'ఎలిజీలు', 'జీవనకాలమ్', 'ఆచార్య ఆత్రేయ', 'రుణం' (నవల), 'సాయంకాలమైంది' వంటి తదితర పుస్తకాలు రాశారు. అలాగే పురాణం సుబ్రహ్మణ్య శర్మ, కొమ్మూరి వేణుగోపాల్‌తో కలిసి 'ఇడియట్' అనే మరో పుస్తకాన్ని రాశారు. వీటితోపాటు 'గాలిలో ఓ క్షణం', 'అహంకారపు అంతిమ క్షణాలు', 'కాలం దాచిన కన్నీరు', 'బహుళపంచమి జోత్స్న', 'ఎర్రసీత', 'వెన్నెల కాటేసింది', 'మళ్ళీ రైలు తప్పిపోయింది', 'తీర్థయాత్ర', 'అవీ- ఇవీ' వంటి నవలలతోపాటు 'గొల్లపూడి కాలమ్స్'తో పాఠకులను మెప్పించారు.