Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అతనొక్కడే' నుండి '118' వరకు వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన కథానాయకుడు కల్యాణ్‌రామ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'ఎంత మంచివాడవురా'. ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీదేవి మూవీస్ శివలెంక కష్ణప్రసాద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. 'శతమానం భవతి' చిత్రంతో జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్న సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈనెల 15న ప్రేక్షకుల ముందుకి వస్తోంది. ఈ సందర్భంగా హీరో కల్యాణ్‌రామ్‌తో మీడియా జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..
టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి?
- 'నమ్మిన బంటు' సినిమా పాట నుండి ఈ టైటిల్‌ను తీసుకున్నాం. కథ డిమాండ్ మేరకే టైటిల్ పెట్టాం. పాజిటివ్‌నెస్‌ని మంచితనం అంటాం. హీరో తన చుట్టూ జరిగే పరిస్థితులను చెడుగా తీసుకోడు. జీవితంలో ఇతరులకు ఇవ్వడం అనే పాయింట్‌ను ఈ సినిమాలో చూపించాం. అలాంటి పాజిటివ్ టైటిల్ కావాలనుకున్నప్పుడు డైరెక్టర్‌గారు 'ఆల్ ఈజ్ వెల్' అనే టైటిల్ అనుకున్నారు. అయితే ఆయన సినిమాలు టైటిల్ నుండే తెలుగుదనంతో ఉంటాయి. కాబట్టి మంచి తెలుగు టైటిల్‌ను మీ నుండి ఆశిస్తున్నానని చెప్పగానే.. 'ఎంత మంచివాడవురా' అనే టైటిల్‌ను పెట్టారు. మనుషులంతా మంచోళ్లే.. ప్రతి ఒక్కరూ వారి సైడ్ నుండి మంచివాళ్లే. కాకపోతే కొంతమంది చేసే పనుల వల్ల మనం హర్ట్ అవుతాం. వారిని బ్యాడ్ అంటాం. మనుషులందరూ మంచోళ్లే.. అయితే వాళ్ళు ఏం తప్పు చేశారో వాళ్లకి అర్థమయ్యేలా చెప్పాలనేదే మా సినిమా కాన్సెప్ట్.
మరి సినిమాలో నెగిటివ్ టచ్ ఎలా చూపిస్తారు?
- 'శతమానం భవతి' అనేది ఓ ఇంట్లోని ఇద్దరు పెద్ద వ్యక్తులకు సంబంధించిన కథ, 'శ్రీనివాస కల్యాణం' సినిమా పెళ్లికి సంబంధించింది. వేర్వేరు మనస్తత్వాలు, ఆలోచనలు ఉన్న వ్యక్తుల జీవితాల్లోకి హీరో ఎలా ఎంట్రీ ఇచ్చి వాళ్ళని మార్చాడు అనేదే ఈ సినిమా. కచ్చితంగా ఓ వ్యక్తిలో నెగిటివిటీ కూడా ఉంటుంది. అయితే దాన్ని హీరో ఎలా కట్ చేశాడనేదే ఆద్యంతం ఆసక్తికరం.
ఈ సినిమాతో మీకెలాంటి ఇమేజ్ వస్తుంది?
- నేనెప్పుడూ ఇమేజ్ గురించి ఆలోచించలేదు. సినిమాలు చేస్తూ వచ్చాను. కథ నచ్చితేనే సినిమాలు చేశాను. అయితే రిపీట్ కథ, క్యారెక్టర్ లేకుండా ఉండేలా చూసుకున్నాను. ప్రేక్షకులకు ఏదైనా కొత్తగా చూపించాలనుకుంటాను. '118' సినిమా తర్వాత నాకు చాలా మంది థ్రిల్లర్ కథలు చెప్పారు. లుక్ పరంగా మార్పు ఉంటుందేమోగానీ వాటిల్లో కొత్తగా ఏం చేస్తాను. అదే క్యారెక్టర్, కథ కొత్తగా ఉంటుందనుకోండి.. మనం కూడా కొత్తగా ఆలోచిస్తాం. 'శతమానం భవతి' చిత్రాన్ని నా వైఫ్ చూశారు. ఇంటికి వచ్చిన తర్వాత చాలా మంచి ఫీల్ గుడ్ మూవీ చూశాను. మీరెందుకు అలాంటి సినిమాలు చేయరు?, కమర్షియల్ సినిమాలే ఎందుకు చేస్తారని ప్రశ్నించింది. అలాంటి కథ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తానని చెప్పాను. అది ఇప్పుడు కుదిరింది.
ఇది గుజరాతీ సినిమాకి రీమేకా?
- '118' తర్వాత చాలా కథలు విన్నాను. ఇదొక గుజరాతీ చిత్రం. దర్శకుడు సతీశ్ ప్రధాన అంశాన్ని చాలా బాగా మార్చారు. అది నచ్చి ఈ ప్రాజెక్ట్ ఓకే చేశా. ఎంత మంచివాడవురా అంటే ఓ క్యారెక్టర్ చేసే జర్నీ. తనకు కావాల్సిన రిలేషన్స్ తీసుకుంటూ, ఎదుటివాడికి కావాల్సిన ఎమోషన్స్ ఇచ్చే పాత్రలో నటించాను.
మీ పాత్ర మాదిరిగానే రియల్ లైఫ్‌లోనూ ఉంటారా?
- మేం ఉమ్మడి కుటుంబం నుండి వచ్చాం. చిన్నప్పుడు ఇంటికి పెద్దమ్మ, పెద్దనాన్న, ఇతర బంధువులు వచ్చినప్పుడు చాలా బావుండేది. వాళ్లు వెళ్లేటప్పుడు బాధగా అనిపించేది. ఇప్పుడు మా ఇంట్లో తొమ్మిది మంది ఉంటున్నాం. అందరితో పొద్దునే కలిసి మాట్లాడటం నాకు ఇష్టం. అలాంటి ఎపిసోడ్స్ ఈ సినిమాలో ఉన్నాయి. అవన్నీ నాకు బాగా నచ్చాయి. అయితే ఇలాంటి పాత్ర చేయడం చాలా సులభమని నేను చెప్పను. కోపంతో కనపడకుండా, నవ్వుతూ కనపడాలని డైరెక్టర్ సతీశ్‌గారు అన్నారు. నా రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉన్న క్యారెక్టర్.
సంక్రాంతికి ఎక్కువ సినిమాలు రిలీజవ్వడం గురించి?
- సంక్రాంతి రైతుల పండగే కాదు.. మా సినిమా వాళ్లకు కూడా పండగే. ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూస్తుంది. ప్రతిసారి సంక్రాంతికి నాలుగు సినిమాలు వస్తన్నాయి. మేమేదో వచ్చేశామని కాదు.. పెద్ద బడ్జెట్ సినిమాలు వచ్చినప్పుడు మీడియం బడ్జెట్ సినిమాలు కూడా విడుదలవుతుంటాయి. ఈ సీజన్ దాటితే ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ థియేటర్‌కు వచ్చే వరకు వెయిట్ చేయాలి. దానికి చాలా సమయం పడుతుంది కాబట్టే సంక్రాంతికి రావాలని అనుకున్నాం. బడ్జెట్ పరంగానే కాదు సక్సెస్‌పరంగా కూడా మంచి ఫలితం వస్తుందనే నమ్మకం ఉంది.
సతీశ్ వేగేశ్నతో జర్నీ ఎలా అనిపించింది?
- పూరిగారు, అనిల్ రావిపూడితో వర్క్ చేసేటప్పుడు ఎంత కంఫర్ట్ ఇచ్చారో సతీశ్‌గారు కూడా అంతే కంఫర్ట్ ఇచ్చి పని చేయించుకున్నారు. ఎప్పుడైనా నేను టెన్షన్‌గా ఉంటే రిలాక్స్ చేసేలా జోక్స్ చెప్పేవారు. ఇక ఈ సినిమాలో మెహరీన్ సూపర్బ్ రోల్‌లో నటించింది. తన పాత్ర అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. మ్యూజిక్ రంగంలో అగ్రగామిగా ఉన్న ఆదిత్య సంస్థ నిర్మాణంలోకి వచ్చిన తర్వాత చేసిన తొలి చిత్రమిది. ఏ రోజూ ఖర్చు గురించి ఆలోచించలేదు. 'నిన్ను కోరి' సినిమా చూసిన తర్వాత గోపీసుందర్‌గారి మ్యూజిక్‌లో సినిమా చేయాలనుకున్నాను. ఈ సినిమాతో తీరింది. పాటలు వినేటప్పుడు కూల్‌గా ఉన్నాయి. వాటిని తెరపై చూస్తున్నప్పుడు ఇంకా బావుంటుంది.