Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం ప్రధాని నరేంద్ర మోడీని సంకట పరిస్థితుల్లోకి నెట్టివేసి ఉండాలి. ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వాన్ని ధ్రువీకరించిన తొలి భారతీయ ప్రధాని మోడీనే. 2019 సెప్టెంబరులో హూస్టన్‌లో జరిగిన ''హౌడీ మోడీ'' ర్యాలీలో ''ఈసారీ ట్రంప్ సర్కారే'' (అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్) అంటూ మోడీ ఇచ్చిన నినాదం ఇప్పటికీ మనందరి చెవుల్లో గింగురు మంటూనే ఉంది. 2020 ఫిబ్రవరిలో 'నమస్తే ట్రంప్' పేరుతో ట్రంప్‌కు అనుకూలంగా అహ్మదాబాద్‌లో మోడీ మరో రాజకీయ కార్యక్రమం నిర్వహించారు.
రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత ప్రభుత్వం ఎప్పుడూ తటస్థ వైఖరిని అనుసరిస్తూ వస్తుంది. గత మూడు దశాబ్దాలుగా అమెరికాతో ఏర్పరచుకుంటున్న వ్యూహాత్మక సంబంధాలకు అమెరికాలో ఇరుపక్షాల మద్దతు ఉంది. అధ్యక్షుడిగా డెమొక్రాటా, రిపబ్లికనా ఎవరున్నారనే దాంతో నిమిత్తం లేకుండా అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాలే ఆ దేశ విదేశాంగ విధానంలో కీలకంగా ఉంటాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో బుష్ ప్రభుత్వంతో వ్యూహాత్మక పొత్తు బలపడింది. ఆ తర్వాత వచ్చిన ఒబామా ప్రభుత్వం దీనిని కొనసాగించిందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి.
ట్రంప్ ప్రాపకం కోసం ఆయనతో మరింతగా జత కట్టడం కోసం మోడీ అడ్డదారులు తొక్కారు. ఈ ఇరువురి నేతల మధ్య బంధానికి ఒక సైద్ధాంతికత కూడా ఉంది. ట్రంప్‌లో, ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న మితవాద సర్కిల్‌లో బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ కూటమి తమతో భావసారూప్యత కలిగిన మిత్రుల్ని చూసుకున్నాయి. శ్వేతజాతి దురహంకారం, ట్రంపిజంలోని జాత్యహం కారంతో కూడిన ప్రాపంచిక దృక్పథాన్ని వీరు కనుగొన్నారు. అరిగిపోయిన రికార్డులా ట్రంప్ పదే పదే మాట్లాడే 'ఇస్లామో ఫోబియా, చైనా వ్యతిరేకత' వీరికి నచ్చింది. ట్రంపిజానికి, హిందూత్వ జాతీయవాదానికి లంకె కుదిరింది.
విదేశాంగ కార్యదర్శి కావడానికి ముందుగా అమెరికాలో భారత రాయబారిగా వున్న హర్షవర్ధన్ శ్రింగ్లా ట్రంప్ మాజీ వ్యూహాత్మక సలహాదారు స్టీవ్ బానన్‌ను కలసినప్పుడే ఈ సైద్ధాంతిక ప్రేమ వ్యవహారానికి బీజం పడింది. పచ్చి శ్వేతజాతి దురహంకారి, ముస్లింలపై విషం కక్కే బానన్‌ను 2019 సెప్టెంబరులో కలిసిన అనంతరం శ్రింగ్లా ట్వీట్ చేస్తూ, ''ప్రఖ్యాత సైద్ధాంతికవేత్త, ధర్మ పోరాట యోధుడిని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. హిందూ పురాణగ్రంథం భగవద్గీతను ఆసక్తిగా అనుసరించే వ్యక్తి బానన్'' అని పేర్కొన్నారు.
బానన్ వ్యాఖ్యలు మరీ దుర్మార్గంగా ఉన్నాయని అభిప్రాయపడిన ట్రంప్ సర్కిల్ ఆయను వైట్ హౌస్ సిబ్బంది నుంచి తొలగించారు. అయినా, అమెరికాలో భారత దూతగా ఉన్న శ్రింగ్లా ఆయనను ఏరి కోరి కలిశారు. తాను చేసిన ట్వీట్‌ను తర్వాత శ్రింగ్లా తొలగించినప్పటికీ మోడీ ప్రభుత్వం వైఖరి ఎలా ఉందో ఈ సంఘటన తెలియచేస్తుంది. ఆ వెంటనే శ్రింగ్లాకు విదేశాంగ కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు.
అమెరికన్ కాంగ్రెస్‌కు చెందిన మహిళ పరిమళ జైపాల్ ఉందన్న కారణంతో విదేశాంగ వ్యవహారాలకు సంబంధించిన అమెరికన్ పార్లమెంటరీ కమిటీ నాయకత్వాన్ని కలవడానికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశకంర్ తిరస్కరించడం ట్రంప్ ప్రభుత్వంతో మోడీ భాగస్వామ్యం ఎంతగా పెనవేసుకుపోయిందో చెప్పడానికి మరో ఉదాహరణ. జమ్మూ కాశ్మీర్‌లో కమ్యూనికేషన్స్‌పై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని, రాజకీయ బందీలనందరినీ విడుదల చేయాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరుతూ 2019 డిసెంబరులో అమెరికన్ కాంగ్రెస్ కమిటీలో పరిమళా జైపాల్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జైపాల్ సభ్యురాలిగా ఉన్నందున ఆ ప్రతినిధి బందాన్నే కలవడానికి జైశంకర్ నిరాకరించారు.
ఇక ఇప్పుడు బైడెన్-హారిస్ బందానికి స్వాగతం పలకడం తప్ప మోడీ ప్రభుత్వానికి మరో మార్గం లేదు. జమ్మూ కాశ్మీర్‌పై భారత ప్రభుత్వ విధానాలను కమలా హారిస్ కూడా విమర్శించిందన్న వాస్తవాన్ని జైశంకర్ జీర్ణించుకోవాల్సిందే. భారత్‌తో వ్యూహాత్మక పొత్తును బైడెన్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందంటూ రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. అది స్పష్టంగా కనిపిస్తోంది కూడా. అమెరికా మూడు దశాబ్దాల ప్రాజెక్టులో భాగంగా భారత్‌ను మిత్రపక్షంగా చేర్చుకుంది. కొత్త ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్నాక దీని నుంచి అది వెనక్కి మళ్లే అవకాశం లేదు.
అయితే, ఇందులో ఒక కీలకమైన అంశాన్ని మనం గమనించడం లేదు. భారతదేశ కీలక ప్రయోజనాలు-అవి వాతావరణ మార్పులు కావచ్చు లేదా ఇరాన్‌తో సంబంధాలు కావచ్చు లేదా వాణిజ్య, వీసా నిబంధనలకు సంబంధించినవి కావచ్చు-ఏవైనా మన దేశ ప్రయోజనాలను దెబ్బతీసేవే. ప్రమాదకరమైన సామ్రాజ్యవాద శత్రువుతో జత కలిసిన ఈ నాలుగు సంవత్సరాల చేదు అనుభవాల నుంచి భారత ప్రభుత్వం ఏమాత్రం గుణపాఠం నేర్చుకున్నట్టు లేదు. తమ గుత్తాధిపత్యాన్ని కొనసాగించేందుకు, తన ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు భారత్‌ను ఒక డోర్ మ్యాట్ (కాలి కింద ఉండే పట్టా)లా ఉపయోగించు కోవాలని ట్రంప్, పాంపియో చూశారు.
అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో భారత్ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని నొక్కి చెప్పాల్సిన అవసరముంది. అలాగే తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని విస్తరించుకోవడంపై దష్టి పెట్టాలి. భారత్ తనకు తానుగా అమెరికాకు బంటుగా మార్చే విధానం నుంచి విడగొట్టుకుని బయటకు వచ్చేందుకు ఇదొక మంచి అవకాశం. అయితే, హిందూత్వ జాతీయవాదుల కూర్పులోనే అమెరికా సామ్రాజ్యవాదంతో మిలాఖత్ ఒక అవిభాజ్య అంశంగా ఉంది. అయితే వారు ఈ నైజాన్ని అంత తేలికగా వదులుకోరు.
-'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం