Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలో ఈ వర్షా కాలం లో కోటి 34లక్షల ఎకరాల విస్తీర్ణం సాగు అయింది. అందులో వరి సాగు విస్తీర్ణం 52.77లక్షల ఎకరాలు. నియంత్రిత సాగు విధానాన్ని అనుసరించి 80శాతం మంది రైతులు సన్నరకం వరిని వేశారు. దొడ్డురకం వడ్ల కన్నా 20 నుంచి 30 రోజులు ఎక్కువ కాల పరిమితి అవసరం. దానికి తెగుళ్లు, (దోమకాటు, నల్ల కాటుక) ఎరువుల, నీటి వినియోగం కూడా ఎక్కువే. దొడ్డురకాలతో పోల్చినప్పుడు ఈ రకం ధాన్యం దిగుబడులు దాదాపు 10క్వింటాళ్లు తక్కువ. ఈ కారణాల వల్ల రైతులు చాలా కాలంగా ఇంటి అవసరాలకు సరిపడా సన్నరకాల ధాన్యాన్ని సాగు చేసి, మిగతా పొలాన్ని దొడ్డురకం వడ్లను సాగు చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేయకపోతే రైతుబంధుకు అర్హులు కారనే ప్రచారం కూడా జరిగింది. దీనితో సన్నరకం సాగు చేశామని రైతులు అందరూ అంటున్నారు. దొడ్డురకం ధాన్యానికి మద్దతు ధర ఏ-గ్రేడ్‌కు క్వింటాలుకు రూ.1888. బి-గ్రేడ్‌కు క్వింటాలుకు రూ.1868 చొప్పున ఖరారు చేసారు. కానీ సన్నరకం పంట దిగుబడి సగానికి సగం తగ్గింది. అయినా ప్రభుత్వం ఇప్పటివరకు మద్దతు ధర ప్రకటించకపోవడంతో రైతులు దళారుల చేతిలో తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సన్న వడ్లకు క్వింటాలుకు రూ.2500 చొప్పున గిట్టుబాటు ధర కల్పించి ప్రతి గింజ కొనుగోలు చేయాలి.
తెలంగాణలో వరి సాగు ఉత్పత్తి ఖర్చు కూడా చాలా ఎక్కువ. ప్రభుత్వ వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం క్వింటాలు వరి ధాన్యం సమగ్ర ఉత్పత్తి ఖర్చు రూ.2,529. కేంద్రం మద్దతు ధరలను ప్రకటించేటప్పుడు సమగ్ర ఉత్పత్తి ఖర్చును కాకుండా కేవలం పంటసాగు ఖర్చును, కుటుంబ సభ్యుల శ్రమను (ఫ్యామిలి లేబర్) మాత్రమే పరిగణనలోకి తీసుకుంటోంది. దాని ప్రకారం చూస్తే తెలంగాణలో మద్దతు ధరలకు ప్రాతిపదికగా తీసుకుంటున్న ఉత్పత్తి ఖర్చు రూ.1245 మాత్రమే. సీఏసీపీ వరి ధాన్యానికి ప్రకటించిన కనీస మద్దతు ధర ఈ సంవత్సరం కేవలం రూ.1,888. ధాన్యం ఎఫ్‌సీఐ రూపొందించిన నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఉంటేనే ఈ మద్దతు ధర లభిస్తుంది. ఈ సంవత్సరం స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం క్వింటాలు ధాన్యానికి రూ.3,793 మద్దతు ధర ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అయినా కేంద్ర ప్రభుత్వం జాతీయ సగటు ప్రకారమే మద్దతు ధరలను ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని ప్రవేశపెట్టి రాష్ట్ర అవసరాలకు రైతులతో సన్నరకం ధాన్యాన్ని సాగు చేయించింది. దానికితోడు గత రెండేండ్లుగా పంటల బీమా పథకం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. బ్యాంకులు గతంలో పంటరుణం తీసుకున్న ప్రతి రైతుకు నిర్బంధంగా ఇన్సూరెన్స్ చేసేవి. కానీ ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పంటరుణం తీసుకున్న ప్రతి రైతు తన ఇష్టం ఉంటేనే ఇన్సూరెన్స్ చేసుకోవచ్చనే నిబంధనతో ఈ సంవత్సరం బ్యాంకులు కూడా సరిగా ఇన్సూరెన్స్ చేయలేదు. ఈ సంవత్సరం పంట రుణం తీసుకున్న ప్రతి రైతు ఇన్సూరెన్స్ విషయంలో నష్టపోయినట్టే. రాష్ట్రంలో 90శాతం మంది చిన్న, సన్నకారు రైతులు నిరక్షరాస్యులే. కాబట్టి బ్యాంకులు ఇప్పటినుంచి అయినా రైతులతో మాట్లాడి తప్పకుండా క్రాప్ ఇన్సూరెన్స్ చేయాలి. వరి ధాన్యం కోత యంత్రాల కిరాయిలు గంటకు రూ.3500 చేరుకున్నాయి. ఒక గంటకు కేవలం ఐదు లీటర్ల డీజిల్ మాత్రమే అవసరముంటుంది. రైతుల అవసరాల దృష్ట్యా యంత్రాల రేటు బాగా పెంచారు. దీనిపైన కూడా ప్రభుత్వ నియంత్రణ అవసరం. సాపేక్షికంగా కూలీ రేట్లు రోజుకు రూ.400 పెరిగాయి. ఈ నేపథ్యంలో వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి కనీసం రూ.20 వేలు నష్టపరిహారం అందించాలి.
ఈ సంవత్సరం రాష్ట్రంలో 60.78లక్షల ఎకరాలలో రైతులు పత్తి పంట సాగుచేశారు. మామూలు రోజులలో పత్తి దిగుబడి ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ళు వచ్చేది. కాని భారీ వర్షాలకు అది పూర్తిగా దెబ్బతిన్నది. ఎకరానికి 2-3 క్వింటాళ్ళకు మించి దిగుబడిలేదు. పత్తి తీయడానికి కూలీరేట్లు బాగా పెరిగాయి. రాష్ట్ర వ్యవసాయశాఖ అంచనా ప్రకారం పత్తి సమగ్ర ఉత్పత్తి ఖర్చు క్వింటాలుకు రూ.9,469. మద్దతు ధరలను ప్రకటించడానికి సీఏసీపీ తీసుకున్న సగటు ఉత్పత్తి ఖర్చు రూ.3676 మాత్రమే. దీని ఆధారంగా ఈ సంవత్సరం పత్తికి లభించే కనీస మద్దతు ధర కేవలం రూ.5,825. ఫలితంగా తెలంగాణలో పత్తి సాగు చేసిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. పైగా ఈ సంవత్సరం బీమా కూడా అమలు కావడం లేదు. దీనికి తోడు నాణ్యతా ప్రమాణాలను మరింత సవరించి ఈ సారి 12శాతం తేమ ఉన్న పత్తిని మాత్రమే కొంటామని షరతు విధించింది. ఈ నేపథ్యంలో కనీస మద్దతు ధరను అందించడానికి తేమ శాతాన్ని కనీసం 18వరకూ పెంచకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు. రాష్ట్ర ప్రభుత్వమే పత్తి విస్తీర్ణం పెంచేలా చేసింది. కాబట్టి మొత్తం పత్తిని సీసీఐ మద్దతు ధరలకు కొనేలా తానే బాధ్యత తీసుకోవాలి. వాతావరణ ఆధారిత పంటల బీమా ప్రామాణికాల అనుసరించి ప్రభుత్వమే పత్తిరైతులకు ఎకరాకు రూ.25వేలు నష్టపరిహారం చెల్లించాలి.
- పులి రాజు
సెల్ 9908383567