Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల విద్యార్థుల కోసమే సంక్షేమ హాస్టళ్లు నడుపుతున్నామనీ, తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ రంగానికి పెద్దపీట వేశామనీ రాష్ట్ర ప్రభుత్వం ఊదరగొడుతోంది. ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ఈ సంక్షేమ హాస్టల్స్, గురుకులాలు, కేజీ.బీవీల నిర్వహణలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తూ తమ శ్రమ ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు సేవచేస్తున్న కార్మికులకు మాత్రం సంక్షేమం కరువైంది.
తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖలో 302 ఆశ్రమ పాఠశాలలు కొనసాగుతుంటే, అందులో 2800 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 170 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, 270 బీసీ సంక్షేమ గురుకులాలు, 119 మైనార్టీ సంక్షేమ గురుకులాలు, 119 కేజీ.బీవీ విద్యా లయాలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కళాశాల హాస్టల్స్ 200 వరకు ఉన్నాయి. వీటన్నింటిలో సుమారు 10,000మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా డైలీ వెజ్, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్, పార్ట్ టైమ్ పేరుతో వాచ్‌మెన్‌లు, స్కావెంజర్‌లు, వంట చేసేవారు, అటెండర్లుగా పని చేస్తున్నారు.
బారెడు చాకిరి బెత్తెడు జీతం
ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు వీరి పని మొదలైతే రాత్రి 9గంటల వరకు 16 నుంచి 18 గంటలు నిర్విరామంగా కొనసాగుతుంది. ఎన్ని గంటలు పని చేసినా వారికి వస్తున్న జీతం 10000లోపే. పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు ఇప్పటివరకు వీరందరికీ చేరటం లేదు. ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే వారికి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల వంటి జిల్లాల్లో 5000 నుంచి 6000 జీతం చెల్లిస్తూ పార్ట్‌టైం పేరుతో విపరీతమైన శ్రమ దోపిడీ చేస్తున్నది ప్రభుత్వం.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కనీస వేతనాల జీఓలు గానీ, జిల్లా కలెక్టర్ స్థాయిలో విడుదల చేస్తున్న కనీస వేతనాల జీఓలు గానీ వీరికి అమలు కావడం లేదు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ జీఓ ప్రకారం 12000ల వేతనం, పీఎఫ్, ఈఎస్‌ఐ అమలు చేయాలనే నిబంధనలు ఉన్నా 10,000లకు మించి వేతనాలు ఇవ్వకపోగా, పీఎఫ్, ఈఎస్‌ఐ అమలు చేయడం లేదు. పీఎఫ్ డబ్బును జీతాల నుంచి కోతపెట్టి కాంట్రాక్టర్లు, అధికారులే వాటిని కాజేస్తున్న పరిస్థితి కూడా ఉన్నది. 8గంటల పని చట్టం వారికి అమలు కావడం లేదు. డ్యూటీ చార్టులేదు. ఇన్ని గంటలు పని చేస్తూ అనారోగ్యానికి గురైతే వేతనం తో కూడిన సెలవు పొందే హక్కు కూడా వీరికి లేదు. సంక్షేమ హాస్టళ్లు, విద్యా సంస్థల కార్మికులు అత్యంత అమానుషంగా శ్రమ దోపిడీకి గుర వుతున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనమేం కావాలి?
ప్రాణాలకు రక్షణ లేదు
నిత్యం నిప్పు దగ్గర ఉంటూ లక్షల మంది విద్యార్థులకు అన్నం, కూరలు వండి పెట్టే క్రమంలో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగి మరణిస్తే 'కుక్క చచ్చింది గోడ అవతల పారేయండి' అన్న చందంగా ఈ కార్మికుల బతుకులు ఉన్నాయి. నిప్పు దగ్గర ఉండటం వల్ల పొగ కండ్లల్లోకి, ముక్కు, చెవుల్లోకి వెళ్లి తక్కువ వయసులోనే కంటిచూపును కోల్పోతున్నారు, వినికిడి సమస్యలు, శ్వాస సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలతో వందల మంది కార్మికులు జబ్బున పడుతున్నారు. ఇలా దీర్ఘకాలిక జబ్బులతో మరణించిన వారిని ఆదుకునే దిక్కు లేదు. జబ్బున పడితే వైద్య సౌకర్యం కల్పించక పోగా రెస్ట్‌లో ఉన్న కాలానికి ఇచ్చే కొద్దిపాటి జీతంలో కోత విధిస్తున్నారు.
ఊసేలేని పర్మినెంట్
తెలంగాణ వస్తే కాంట్రాక్టు విధానం, అవుట్ సోర్సింగ్ విధానమే ఉండదని చెప్పిన కేసీఆర్ తన ప్రభుత్వం వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతితోనే బోధన బోధనేతర సిబ్బందిని భర్తీ చేసి పాత పాలనకు తానేమీ మినహాయింపు కాదని నిరూపించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పర్మినెంట్ చేయకూడదని ఇచ్చిన జీఓను రద్దుచేసి హాస్టల్ వర్కర్‌లందర్నీ పర్మినెంట్ చేస్తానని ఇచ్చిన మాట నీటిమీద రాత గానే మిగిలిపోయింది.
కరోనా కాలంలోనూ కనికరించని పాలకులు
కరోనా లాక్‌డౌన్, లాక్‌డౌన్ సడలింపు తర్వాత నేటికీ రాష్ట్రంలో సంక్షేమ విద్యాసంస్థలు తెరుచుకోలేదు. సంవత్సరాల తరబడి ఈ సంక్షేమ రంగంలోని విద్యాసంస్థల్లోనే పనిచేస్తున్న కార్మికులకు పూర్తిగా ఉపాధి లేకుండా పోయింది. కొద్దిపాటి జీతాల మీదనే ఆధారపడి జీవిస్తున్న ఈ కార్మికులకు జీతాలు లేక పోవటంతో గత 6నెలలుగా వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడు తున్నాయి. పస్తులతో ఉంటున్నా మన పాలకులు కనికరించడం లేదు. అందరికీ వేతనాలు ఇవ్వాలని జీఓ 45ను విడుదల చేసిన ప్రభుత్వం సంక్షేమ రంగ విద్యాసంస్థల కార్మికులకు మాత్రం నేటికీ వేతనాలు చెల్లించలేదు.
కార్మిక చట్టాల మార్పుతో తీవ్రమవుతున్న దోపిడీ
ఇంతకాలం కార్మిక చట్టాలు ఉంటేనే పనిగంటలు చట్టం, కనీస వేతనాల చట్టం, పీఎఫ్ చట్టం ఈఎస్‌ఐ, పని కేంద్రాల్లో సౌకర్యాలు ఏమీ అమలు కాలేదు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలు అన్నింటిని రద్దు చేసి నాలుగు కోడ్‌లుగా మార్చింది. 8గంటల చట్టం ఉండగానే 16గంటల పని చేయిస్తున్న పాలకులు ఇక మీదట కార్మికులను కట్టు బానిసలుగా మార్చే ప్రమాదం ఉంది. శాశ్వత స్వభావం కలిగిన పనిచేస్తున్న కార్మికులకు పర్మినెంట్ వారికి ఇచ్చే వేతనం, సౌకర్యాలు అమలు చేయాలని సుప్రీంకోర్టు 2016లోనే తీర్పు చెప్పింది. అయినప్పటికీ సంక్షేమ రంగంలో ఆ తీర్పును పరిగణలోనికి కూడా తీసుకోలేదు ప్రభుత్వం. చట్టాల్లో మార్పులు వచ్చిన నేపథ్యంలో మరింత ప్రమాదకరమైన స్థితిలోకి కార్మికులు అనివార్యంగా నెట్టివేయబడు తున్నారు. నిత్యావసర సరుకుల చట్టాన్ని సవరించిన బీజేపీ ధరల పెరుగుదలను అదుపు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నది. చాలీచాలని వేతనాలతో జీవిస్తున్న కార్మికులపై ధరల పెరగుదల ''మూలిగె నక్కపై తాటిపండు పడ్డట్టు'' అనే చందంగా మారింది. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు దోచిపెట్టే చట్టాల వలన భవిష్యత్‌లో ఆహారధాన్యాలు, నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరుగుతాయి. ఇప్పటికే పేట్రోల్, డిజిల్ ధరలు అడ్డుఅదదుపు లేకుండా పెంచుతున్నారు. ఈ ఆర్థిక భారాలకు మొదట బలయ్యేది కార్మికులు, సమాన్య మధ్యతరగతి ప్రజలే.
ఈ సంక్షేమ గురుకులాలు, హాస్టల్స్‌లో పనిచేస్తున్న వారంతా నూటికి నూరుశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద కుటుంబాల నుంచి వచ్చిన వారే. వారికి సరైన వేతనాలు, సౌకర్యాలు కల్పించక పోవడం, చట్టాలను అమలు చేయకపోవటం, వేతన దోపిడీకి పాల్పడడం, శ్రమ దోపిడీకి గురి చేయటం సామాజిక వివక్షతకు ప్రతిరూపం. ఇప్పటికైనా ప్రభుత్వం అందరినీ పర్మినెంట్ చేయాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలి. డ్యూటీ చార్ట్‌ను ప్రకటించాలి. పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలి. ప్రతి వర్కర్‌కు 25 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలి. వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలి. యూనిఫారం బట్టలు, గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అన్నిటికీ మించి కార్మిక చట్టాలను వర్తింపచేయాలి. ఈ కనీస కొర్కెలు తీరాలంటే పోరాటమొక్కటే మార్గమని కార్మికులు గుర్తించాలి. నేడు దేశం మొత్తం కార్మికవర్గం తమ సమస్యల పరిష్కారం కోసం, కార్మికచట్టాల రక్షణ కోసం ప్రజలు ఎదుర్కొంటున్న ధరల పెరుగుదల నిరుద్యోగం వంటి సమస్యలపైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా, కార్మికవ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబర్ 26న సమ్మె చేస్తున్నది. ఈ సమ్మెలో సంక్షేమ హాస్టళ్ల కార్మికులు కూడా పాల్గొని జయప్రదం చేయాలి.
- కె. బ్రహ్మాచారి
సెల్: 8639774475