Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మంచి పాలకుడు ఉన్న చోటే మంచి విద్య ఉంటుంది. మంచి విద్యా వ్యవస్థ ఉన్న దగ్గరే మంచి పాలకులు తయారవుతారు'' అంటారు ప్రముఖ తత్వవేత్త రూసో. కానీ మన దేశమే కాదు, రాష్ట్రం కూడా ఇందుకు విరుద్ధంగానే ఉన్నది. రాష్ట్రంలో నేడు అందరికీ నాణ్యమైన విద్య అందుబాటులో ఉందా? ఉచితంగా నాణ్యమైన విద్యను అందరికీ అందించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నదా? అనే ప్రశ్నలు కాసింత సామాజిక జ్ఞానం గల ప్రతి బుద్దిజీవి వేదిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయలతో పాటు ఇతర ఏ విశ్వవిద్యాలయాలలో కూడా టీచింగ్ - నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయక ప్రభుత్వ విద్యను తుంగలో తొక్కుతున్నారు. సరైన బడ్జెట్ ఇవ్వకుండా, అడ్మిషన్ సీట్ల సంఖ్యను పెంచకుండా యూనివర్సిటీలను క్రమక్రమంగా నిర్వీర్యం చేస్తున్నారు. ప్రయివేటు - కార్పొరేట్ శక్తులకు ఇష్టానుసారం పర్మిషన్స్ ఇచ్చి, విద్యను అంగట్లో సరుకుగా మారుస్తున్నారు. నాటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం విచ్చలవిడిగా ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతి ఇస్తే, నేటి కేసీఆర్ ప్రభుత్వం డొనేషన్ల రూపంలో తల్లిదండ్రులను దోచుకోమని ఇంజనీరింగ్ కాలేజీలకు పరోక్ష మద్దతు ఇస్తోంది. ఇవాళ రాష్ట్రంలో ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీటు కోసం 10లక్షల నుంచి 14 లక్షల దాకా డొనేషన్లు వసూలు చేస్తుంటే, ఫీజుల నియంత్రణ కమిటీ, ఉన్నత విద్యా మండలి, విద్యాశాఖ మౌనం వహిస్తున్నాయి. ఎందుకు అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవటం లేదు?! అక్రమ ఫీజులపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తే, ఆందోళనలు చేస్తే పోలీసులచే అరెస్టు చేయిస్తున్నారు. పోరాట రూపం వస్తే కేసులు పెడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసుల చేత, దోపిడీ దారులైన ఇంజనీరింగ్ కళాశాల యజమానులను కాపాడే ప్రయత్నం చేయిస్తుంది. అక్రమంగా చట్టవిరుద్ధంగా సారా, డ్రగ్స్ వ్యాపారం మాదిరిగా విద్యా వ్యాపారం చేస్తున్న ప్రయివేటు ఇంజనీరింగ్ కళాశాలల దోపిడీని నియంత్రించకపోగా, కనీసం నివారణ చర్యలు కూడా చేపట్టడం లేదు.
ఇంజనీరింగ్ కళాశాలల యజమానులు ఎక్కడదాక వెళ్ళారంటే, కళాశాలలో వచ్చే దోపిడీ లాభాలతో రాజకీయాల్లో పెట్టుబడులు పెట్టి, అధికార పార్టీలో, ప్రభుత్వాల్లో పదవులు పొందేదాకా వెళ్ళారు. అనంతరం వారికి అనుకూల చట్టాలను చేయించు కుంటున్నారు.
ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రతి బ్రాంచిలో 30శాతం సీట్లను కాలేజీ మేనేజ్‌మెంట్ సొంతంగా భర్తీ చేసుకోవచ్చు. అయితే వాటికి ప్రత్యేకమైన నియమ నిబంధనలు కూడా ఉన్నాయి. ఉన్నత విద్యామండలి, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నిబంధనల ప్రకారం 30శాతం మేనేజ్‌మెంట్ సీట్లలో 15శాతం ఎన్‌ఆర్‌ఐ కోటా కింద భర్తీ చేయాలి. మిగిలిన సీట్లను జేఈఈలాంటి జాతీయ స్థాయి పరీక్షలలో ర్యాంకులు పొందిన వారికి ఇవ్వాలి. అనంతరం మిగిలిన వాటిని, ఎంసెట్‌లో ప్రతిభ కనబరిచిన వారికి ఇవ్వాలి. ఇంకా సీట్లు మిగిలితే ఇంటర్ మీడియట్‌లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు ఇవ్వాలి. ఈ మేనేజ్‌మెంట్ సీట్ల భర్తీ ప్రక్రియను విద్యార్థులకు చేరవేసే ప్రక్రియలో భాగంగా తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ పత్రికల్లో బహిరంగ నోటిఫికేషన్‌ను ప్రచురించాలి. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ అప్లికేషన్లు స్వీకరించి, అప్లయి చేసిన ప్రతి ఒక్కరి పూర్తి వివరాలను నోటీస్ బోర్డులో పొందుపరచాలి. వారి అర్హత, కౌన్సిలింగ్‌లో ప్రదర్శిం చిన ప్రతిభ ఆధారంగా సీట్లను భర్తీ చేయాలి. కానీ ఒక్కటి, రెండు ఇంజనీరింగ్ కాలేజీలు తప్ప మిగతా ఏ ఇంజనీరింగ్ కాలేజీలూ పై నిబంధనలను పాటించ కుండా ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికి సీట్లను కేటాయిస్తూ కోట్లాది రూపాయలను దండుకుంటున్నారు. ఈ తతంగమంతా బహిరంగ రహస్యమే.
ఇంత తతంగం బహిరంగంగా జరుగుతున్నదని ప్రభుత్వానికి ఇంటిలిజెన్స్ ద్వారా కూడా సమాచారం ఉన్నప్పటికీ ఇంజనీరింగ్ కాలేజీ ఫీజుల దోపిడీలపై ఈ మౌనం ఎందుకు? కరోనా విపత్కర పరిస్థితులలో ప్రజల ఆదాయాలు తగ్గిపోయాయి. లక్షల రూపాయల డొనేషన్లు ప్రజలు ఎలా కట్టగలరు? మానవత్వాన్ని మరిచిన ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునే తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకొని ఈ డొనేషన్ల దందా కొనసాగిస్తున్నాయి. కరోనా టైంలో రాష్ట్రంలో చాలా ఇంజనీరింగ్ కళాశాలల్లో పనిచేసిన అధ్యాపకులకు జీతాలు సరిగ్గా ఇవ్వలేదు. కానీ విద్యార్థుల దగ్గర మాత్రం పూర్తి ఫీజులు వసూలు చేస్తున్నారు. ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇవ్వలేని కాలేజీలకు, విద్యార్థుల నుంచి పూర్తి ఫీజులు వసూలు చేసే నైతికత ఉందా? ఇప్పుడు మొత్తం ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణ జరుగుతున్నప్పుడు కాలేజీలకు నిర్వహణ ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయి. నిర్వహణ ఖర్చులు తగ్గినప్పుడు విద్యార్థులకు ఫీజులు కూడా తగ్గాలి కదా? విద్యార్థుల ఈ న్యాయమైన హక్కుపై ప్రభుత్వం మౌనం వీడి, డొనేషన్ల పేరుతో ఫీజుల దందా చేస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలను వెంటనే సీజ్ చేయాలి. లేనియెడల విద్యార్థులు పెద్దఎత్తున ఉద్యమాన్ని నిర్మించి, ఇటు కాలేజీ యాజమాన్యాలకు, అటు ప్రభుత్వానికి బుద్దిచెపుతారు.
- ఆర్.ఎన్.శంకర్
సెల్: 9963169415