Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మహమ్మారి కారణంగా కోట్లాది మంది సామాన్య ప్రజలు జీవనోపాధి కోల్పోయి కనీస అవసరాల కోసం నానా అవస్థలు పడుతుంటే, మరోవైపు కార్పొరేట్ కంపెనీలు మాత్రం అత్యధిక లాభాలతో తులతూగు తున్నాయి. కేంద్ర ప్రభుత్వ అస్తవ్యస్త ఆర్థిక నిర్ణయాలతో నిరుద్యోగం పెరిగిపోయి స్థూల దేశీయోత్పత్తి రోజురోజుకూ తిరోగమన పథంలో పయనిస్తోంటే, దేశంలోని కార్పొరేట్ కంపెనీల నికర లాభాలు మాత్రం పురోగమిస్తూ మునుపెన్నడూ లేనంత ఎత్తుకు ఎగబాకుతున్నవి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ అభియాన్ ప్యాకేజీ కార్పొరేట్ కంపెనీలకు మరిన్ని రాయితీలు ఇచ్చి వాటి సంపద, లాభాలు మరింత పెంపొందడానికి తోడ్పడిందే కానీ రెక్కల కష్టంతో బతుకీడుస్తున్న వారిని ఆదుకోలేకపోయింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా ప్రజల కొనుగోలుశక్తి దారుణంగా పడిపోయిన పరిస్థితులలో ప్రభుత్వ చర్యలు ఏమాత్రం ఉపశమనం కలిగించక పోవడంతో ఆర్థికవ్యవస్థ కుదేలై వృద్ధిరేటు నేల చూపులు చూస్తోంది. ప్రముఖ వ్యాపార సమాచార సంస్థ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) 1,897 లిస్టెడ్ కంపెనీల బ్యాలెన్స్ షీట్లపై చేసిన అధ్యయనం దిగ్భ్రాంతి కలిగించే అంశాలను వెల్లడించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై ఆగస్టు సెప్టెంబర్)లో ఈ కంపెనీలు సమిష్టిగా రూ.1332 బిలియన్ల(1,33,200 కోట్లు) నికర లాభాలు ఆర్జించాయి. గత ఐదు సంవత్సరాల అన్ని త్రైమాసికాల్లో లిస్టెడ్ కంపెనీలు సాధించిన దానికంటే ఇది అత్యధిక నికరలాభంగా నిలిచింది. 2020 ఏప్రిల్-జూన్ మొదటి త్రైమాసికంలో రూ.441 బిలియన్లు( 44,100 కోట్లు), గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి చివరి త్రైమాసికంలో రూ.320 బిలియన్లు (32,000 కోట్లు) లాభపడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సర మొదటి త్రైమాసికంలో రూ.44,100 కోట్ల లాభాలు అర్పించిన ఈ బడా కంపెనీలు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో ఏకంగా రూ.1,33,200కోట్ల నికర లాభాలు ఆర్జించడం నివ్వెరపరుస్తోంది. గత నాలుగు త్రైమాసికాల్లో 1897 కంపెనీల సగటు త్రైమాసిక లాభం రూ.502 బిలియను ్ల(50,200 కోట్లు)గా నమోదైనట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ పేర్కొంది. కరోనా కారణంగా 2020-21 మొదటి భాగంలో వివిధ ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఈ కంపెనీలు రూ.1,77,300 కోట్ల అత్యధిక నికర లాభాలు సాధించాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మొదటి అర్థభాగంలో సాధించిన లాభాల కంటే ఇవి 23.8శాతం ఎక్కువని సీఎంఐఈ పేర్కొంది.
కరోనా దెబ్బకు దేశ స్థూల జాతీయోత్పత్తి తిరోగమిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి దిగజారుతున్న క్రమంలో కార్పొరేట్ కంపెనీల లాభాలు అనూహ్యంగా పెరగడం ఆశ్చర్యాన్ని కలిగించే పరిణామం. కార్పొరేట్ బహుళజాతి సంస్థల ప్రయోజనాలే పరమావధిగా మోడీ ప్రభుత్వం పనిచేసిన ఫలితంగానే ఈ కంపెనీలు గరిష్ట లాభాలు ఆర్జించాయి. ఆర్థిక వ్యవస్థ ఉద్దీపన పేరుతో కార్పొరేట్ల సేవలో నిమగమైన ప్రభుత్వం గత నవంబర్‌లో కార్పొరేట్ పన్నును 32శాతం నుంచి 22శాతానికి తగ్గించి రూ.1,45,000 కోట్ల దేశ ఆదాయాన్ని కార్పొరేట్‌లకు పంచిపెట్టింది. ప్రభుత్వరంగంలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న రైల్వే, ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్, బీపీసీఎల్, ఎయిర్ ఇండియా మొదలగు ప్రభుత్వరంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం ఓ పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేస్తూ ఆదాని, అంబానీలకు కట్టబెట్టడం, బ్యాంకులలో పేరుకుపోయిన సంపన్నుల మొండి బకాయిలను రద్దు చేయడం, బ్యాంకులు దివాలా తీయకుండా అరికట్టలేక పోవడం, నోట్లరద్దు, జీఎస్‌టీ, జాతీయ ఆదాయంలో కీలక పాత్ర పోషిస్తున్న అనేక అనేక రంగాలను నిర్వీర్యం చేయడం, ప్రజల కొనుగోలు శక్తి పెంచే చర్యలు తీసుకోకపోవడం తదితర కారణాలతో దేశ వద్ధిరేటు క్షీణిస్తూ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారుకుంటున్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ తొలి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి రేటు గణనీయంగా మైనస్ 23.9శాతానికి క్షీణించింది. రెండో త్రైమాసికంలో కూడా జీడీపీ వృద్ధి మైనస్ 12శాతం కుదించుకు పోతుందని క్రిసిల్, మైనస్ 10.6శాతం వద్ధిరేటు క్షీణిస్తుందని మూడీస్ సంస్థలు అంచనా వేశాయి. ఈనెల 27న కేంద్ర గణాంకాల కార్యాలయం క్యూ2 జీడీపీ వృద్ధి గణాంకాలను విడుదల చేయనుంది. వృద్ధిరేటు వరుసగా రెండు త్రైమాసికాల పాటు రుణాత్మక స్థాయికి పతనమైన పక్షంలో సాంకేతికంగా ఆ దేశ ఆర్థికవ్యవస్థ మాంద్యం లోకి జారుకున్నట్టుగా పరిగణిస్తారు. ప్రస్తుత 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు ప్రతికూల (మైనస్) స్థాయిలో లేదా దాదాపు సున్నా(శూన్యం) నమోదు కావచ్చని స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఇటీవల ప్రకటించారు. గ్లోబల్ రేటింగ్ సంస్థలైన పిచ్ రేటింగ్స్ 10.5శాతం, గోల్డ్ మన్ శాచ్స్ 14.8శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 16.5శాతం ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతికూల వృద్ధిని అంచనా వేశాయి.
కరోనాను సాకుగా చూపి అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగించడం, అడ్డగోలుగా జీతాలు ఎగ్గొట్టడం, వేతనాలలో భారీ మొత్తంలో కోత పెట్టడం లాంటి కార్యక్రమాలతో ఉద్యోగులను శ్రమదోపిడీ చేయడంతో కార్పొరేట్ కంపెనీలు కరోనా కాలంలో భారీ లాభాలను ఆర్జించడం విస్మయ పరుస్తోంది. ప్రయివేటు కంపెనీలపై ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ ఏమాత్రం లేకపోవడంతో ఉద్యోగుల పట్ల దారుణంగా వ్యవహరించాయి. లాక్‌డౌన్ కాలంలో పనులు స్తంభించిపోవడంతో ప్రజల ఆదాయాలు మొత్తం తగ్గిపోయి ప్రజల కొనుగోలుశక్తి పడిపోవడంతో దేశ స్థూల దేశీయోత్పత్తి అమాంతం పడిపోయింది. ప్రజల చేతుల్లో డబ్బులు ఉండేవిధంగా, వారి కొనుగోలుశక్తి పెంచే కార్యక్రమాలు చేపట్టకుండా ప్రభుత్వం కేవలం కార్పొరేట్ సంపన్నుల సేవలో నిమగమైంది. ఆత్మనిర్భర్ అభియాన్ ప్యాకేజీ సామాన్యుడిని ఏమాత్రం ఆదుకోలేకపోయింది. 20లక్షల కోట్ల ప్యాకేజీ కోటీశ్వరులు తమ సంపదను మరింత పోగేసుకోవడానికి తోడ్పడిందే కానీ పేదవాడికి దానితో ఒరిగిందేమీ లేదు. యూబీబిఎస్, పీడబ్ల్యుసీ రిపోర్టు ప్రకారం ఏప్రిల్ నుంచి జూలై మధ్య కరోనా సమయంలో ప్రపంచంలోని శత కోటీశ్వరులు సంపద 27.5శాతం పెరిగితే భారతదేశంలోని శత కోటీశ్వరులు తమ సంపదను ఏకంగా 35శాతం పెంచుకున్నారు. దేశంలోని కంపెనీల లాభాలు విపరీతంగా పెరగడానికి, ప్రజల ఆదాయాలు, దేశ వృద్ధి రేటు పడిపోవడానికి, ఆర్థిక అసమానతలు పెంపొందడానికి గల కారణాలు విశ్లేషించు కుని ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం తన ఆర్థిక విధానాలను మార్చు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నదే నిన్నటి సార్వత్రిక సమ్మె సందేశం, నేటి గ్రామీణ బంద్ సారాంశం.
- బిల్లిపెల్లి లక్ష్మారెడ్డి
సెల్: 9440966416