Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2021 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కసరత్తు మొదలైంది. దానికి ముందస్తు సంప్రదింపుల్లో భాగంగా, మొదటగా, కార్పోరేటు యాజమాన్యాల సమూహాలతో చర్చించడం ఆనవాయితీ. అయితే కార్పోరేటు యాజమాన్యాలు ఎంత ముఖ్యమో శ్రామిక సంఘాలూ, పౌర సమాజమూ అంతే ప్రాముఖ్యమైనవి. కానీ ఈ రెండవ వర్గంతో చర్చించడాన్ని ప్రస్తుత పాలకులు అంత తీవ్రంగా పరిగణించటం లేదు. గత నవంబ ర్‌లో జరిగిన ఒక రోజు సమ్మెకు కావలసినంత నోటీసు ఉన్నప్పటికీ సంఘాలతో కన్సిలియేటరీ మీటింగులకు ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వలేదు. అధికారికంగా నిర్వహించాల్సిన ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సమావేశాలకు నీళ్ళొదిలారు. కార్పోరేటు సంఘాలతో జరుగుతున్న చర్చల సారాన్ని చూస్తే ఈ బడ్జెటంతా వారి కనుసన్నల్లోనే రూపు దిద్దుకుంటున్నదన్నది నిస్సందేహం. ''ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే ప్రభుత్వానిధి బాధ్యత, మెరుగుపడితే కార్పోరేట్లకే క్రెడిట్'' అనే రీతిలో భారత కార్పోరేట్లు ప్రభుత్వాన్ని అదిమిపెట్టుకున్నాయి.
ప్రైవేటు కంపెనీలను, కార్పొరేటు గుత్త సంస్థలను ఒక క్రమపద్ధతిలో నిర్దేశించి ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాల్సిన ప్రభుత్వం ఆ రకమైన చర్యలు తీసుకోకుండా రాబోయే కాలంలో సమర్పించనున్న బడ్జెట్‌కు ఆనవాయితీగా నిర్వహించవలసిన బడ్జెట్ ముందస్తు సమావేశాలు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండిస్టీ (సీిఐఐ), ఫిక్కి మరియు అసోచామ్‌లతో నిర్వహించింది.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండిస్టీ, భారత ప్రభుత్వం ముందు పెద్ద ఎజెండానే ఉంచింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందు కోసం సరికొత్త ఉద్దీపన ప్యాకేజ్ పారిశ్రామిక వర్గాలకు ఇవ్వాలన్నది మొదటి ప్రతిపాదన. దానితో పాటు ఆరోగ్యం, మౌలిక రంగాలపై, ప్రభుత్వమే వీలైనంత ఎక్కువ ఖర్చు చేయాలని రెండో ప్రతిపాదన చేసింది. దీని సారాంశ మేమంటే ప్రభుత్వమే ప్రజలను ఆరోగ్యవం తుల్ని చేసి వారి చేతిలో కొనుగోలు శక్తిని పెంచాలి, అప్పుడుగాని తమ వ్యాపా రాలకు గిరాకీ ఉండదు. ప్రైవేట్ సెక్టార్ పెట్టుబడిని పెంచడం ద్వారా ఉపాధి పెరగడానికి అవకాశం ఉందని సూచించింది. అయితే, ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ పెరగాలంటే, ప్రభుత్వమే ప్రైవేటు కంపెనీల దీర్ఘకాలిక పెట్టుబడులకు అవసరమైన నిధులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని తెలిపింది. గవర్నమెంట్ ఖర్చు పెట్టాలంటే వారికి ఆదాయం రావాలి, కానీ ప్రస్తుతం గవర్నమెంట్ రెవెన్యూ పూర్తిగా పడిపోయింది. పన్ను రూపంలో వచ్చే ఆదాయం ముప్పై శాతం దగ్గరే ఉన్నది. అందుచేత ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయాన్ని ప్రధానంగా చేపట్టాలని సీఐఐ సూచించింది. రాబోయే బడ్జెట్లో దానిపైన నిర్దిష్టమైన ప్రకటన చేయాలని కూడా కోరింది. ప్రైవేటు పెట్టుబడికి డబ్బులు లేవు కాబట్టి ప్రభుత్వమే సమకూర్చాలని ఒక వైపు అంటారు, మరో వైపు ఆ డబ్బును సమకూర్చి పెట్టగల ప్రభుత్వ రంగాలను ప్రైవేటు వారికి అమ్మేయాలంటారు! ఇది పరస్పర విరుద్దమైనదిలా లేదూ!? అయితే ఇందులో ఒక కిటుకు ఉన్నది! కార్పోరేట్లు నేరుగా ప్రభుత్వ రంగాలను కొనరు. చిన్న చిన్న మధుపర్ల ద్వారా కొనబడిన ప్రభుత్వ రంగాల్లోకి మేజర్ వాటాదారులుగా ప్రవేశిస్తారు. ఇందుకోసం పన్నుల రూపంలో వసూలైన సొమ్మును వారికి రాయితీలుగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తారు. ఆ తరువాత కాలంలో చిన్న మధుపర్ల వాటాలను కొనుక్కుంటూ సంస్థను శాసించే స్థితికి వస్తారు. ఇన్ఫోసిస్‌లో అతిపెద్ద వాటాదారు నందన్ నిలేఖనీ ఒక ఉదాహరణ.
బ్యాడ్ బ్యాంక్-ఒక బ్యాడ్ ఐడియా
బ్యాంకులను నిరర్ధక ఆస్థుల బెడద నుంచి బయటపడేసేందుకు చాలా సంఖ్యలో బ్యాడ్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని సీఐఐ సూచిం చింది. బ్యాడ్ బ్యాంకులు అనగా వాణిజ్య బాంకుల్లో పేరుకుపోతున్న నిరర్దక ఆస్థులను బదలాయించుకుని వసూలు ప్రక్రియను చేపడతాయి. ఈ నిరర్దక ఆస్థులు ప్రొవిజన్లను మినహాయించుకున్న తర్వాతి మొత్తంలో కొంత శాతం తగ్గుదలతో బదలాయించవలసి ఉంటుంది. ఉదాహారణకు పది వేల రూపాయల రాని బాకీలకు ఒక వెయ్యి రూపాయలు ప్రొవిజన్ ఉందనుకుంటే, బ్యాంకుకు నికర బాకీ తొమ్మిదివేలు. ఈ బాకీని వసూలు చేయలేని పక్షంలో బాడ్ బ్యాంకుకు బదలాయించవచ్చు. అయితే సదరు బ్యాడ్ బ్యాంక్ తొమ్మిది వేల నికర రాని బాకీని డిస్కౌంటెడ్ విలువకు, అనగా కొంత తక్కువకే తమకు బదలాయించుకుని మొత్తం బాకీని వసూలు చేసుకునే హక్కును పొందుతుంది. దీని ద్వారా నిరర్దక ఆస్థుల పట్టిక వాణిజ్య బ్యాంకుల్లో మాయమవుతుంది, బ్యాడ్ బ్యాంకులో ఉంటుంది. వాణిజ్య బ్యాంకులు వసూలు చేయలేని బాకీలను బ్యాడ్ బ్యాంకులు ఎలా వసూలు చేయగలవు? రాని బాకీలను వాణిజ్య బ్యాంకుల నుంచి బ్యాడ్ బ్యాంకులకు బదలాయించమని కార్పొరేట్లు ఎందుకు కోరుతున్నారు? ఎందుకంటే బదలాయింపు సందర్భంగా చోటు చేసుకునే డిస్కౌంటెడ్ విలువను మాత్రం చెల్లిస్తే సరిపోతుంది, లేదా ఋణ వసూళ్ళలో బ్యాడ్ బ్యాంకులకున్న కాలపరిమితి వల్ల పూర్తిగా రైట్ ఆఫ్ అయ్యే అవకాశమూ ఉన్నది! లేదా ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్‌ను ఉపయోగించి బ్యాడ్ బ్యాంకుల బెడద నుంచీ బయట పడవచ్చు. ఈ బ్యాడ్ బ్యాంకులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వమే ధనం వెచ్చించాలి. ఋణగ్రస్థులపై చర్యలకు ఉపక్రమించే వెసులు బాటును వాణిజ్య బ్యాంకులకు కల్పించకుండా రాని బాకీల వసూళ్ళకు బ్యాడ్ బ్యాంకులను ఏర్పాటు చేయడం అర్థరహితం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తప్ప మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వం యొక్క వాటా 50 శాతానికి తక్కువగా ఉండేటట్టుగా చూసు కోవాలని సీఐఐ సూచించింది. వీలైనంత త్వరగా ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటు యాజమాన్యాలకు అప్పజెప్పాలని సూచిం చింది. దీని ద్వారా వివాదం పూర్తి కాగలదని తెలిపింది. ప్రభుత్వం ఏ బ్యాంకులను ఉంచాలో వేటిని ఎలా నడిపించాలో వంటి మితిమీరిన సలహాలను ఇచ్చే స్థాయికి వాణిజ్య సంఘాల సమూహం రావడం మిశ్రమ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదం.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ(ఫిక్కి) ప్రతిపాదన ప్రకారం జీఎస్టీని మూడు స్లాబులకు తగ్గిం చాలని కోరుతున్నది. దానితో పాటు అర్బన్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ పేరుపైన పట్టణాల్లో నివసిస్తున్న యువతకు ఉపాధి కల్పించాలని, ముఖ్యంగా శానిటేషన్, ప్రభుత్వ ఆస్థుల పరిరక్షణ వంటివాటిలో ఉపాధి ఏర్పాటు చేయాలని సూచించింది. ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, పట్టణ ప్రాంతాల్లోని యువతకు ఉపాధి లేక కొనుగోలు శక్తి పడిపోయింది. తద్వారా పారిశ్రామిక వస్తువులకు గిరాకీ లేదు. ప్రభుత్వాన్ని ఉపాధి కల్పించమని అడిగారు కానీ తమ వస్తు సేవల ధరలూ తగ్గిస్తామన్న మాట మాట్లాడటం లేదు. అసోచాం స్పందిస్తూ, పన్ను రేట్లను కార్పొరేట్లతో సహా వ్యక్తిగత పన్ను దారులకు కూడా తగ్గించాలని సూచించింది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ గారు వీరందరి ప్రతిపాదనలపై స్పందిస్తూ, వృద్ధి లక్ష్యంగా రాబోయే బడ్జెట్ ఉంటుందని, వారు సూచించిన విధంగానే డిమాండ్‌ను పెంచే విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోబడ తాయని దానికోసం వీలైతే అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రధాన మంత్రి అసోచామ్ సమావేశంలో ప్రసంగిస్తూ పన్నుల తగ్గింపు, కార్మికచట్టాల సవరణ వంటివన్నీ పెట్టుబడిని ప్రోత్సహించడం కోసమే అని ప్రకటించారు. దీనిని బట్టి కార్మిక చట్టాల సవరణ ఎవరి సౌలభ్యం కోసమో తేటతెల్లమైందిగా!
కోల్పోయిన ఉపాధి పునః ప్రారంభం కాకుండానే, ఉత్పాధకత పెరగకుండానే, బెంబేలెత్తిన సెన్సెక్స్ లాక్‌డౌన్ కన్నా ముందున్న స్థితిని అధిగమించి పరుగెడుతుంది. భౌతిక ఉత్పత్తితో సంబంధం లేకుండానే స్టాక్ మార్కెట్లో అస్థులు పుడాతాయి - మాయ మౌతాయన్న సత్యం మరోసారి ఋజువైంది. లాక్‌డౌన్ కారణంగా మార్చి 2020లో భారత స్టాక్ మార్కెట్లు 42000 సెన్సెక్స్ సూచీ నుంచి 24 వేల స్థాయికి పడిపోయాయి. భారత స్టాక్ మార్కెట్ మొత్తం విలువ సుమారు లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు ఉంటుంది. మార్కెట్లు పడిపోవడం వల్ల 40 వేల కోట్ల రూపాయలు హుష్‌కాకి అయ్యాయి. ఉపాధి - ఉత్పత్తి లేకున్నా స్టాక్ మార్కెట్లు లాక్‌డౌన్ కన్నా ముందు స్థాయి 46వేల పాయింట్లతో పరిగెడుతున్నాయి. ఉత్పత్తితో సంబంధం లేని స్టాక్‌మార్కెట్లు ఎలాంటి అభివద్దికి సంకేతం? కరోనానంతర లాక్‌డౌన్‌వల్ల 11.7 ట్రిలియన్ డాలర్లు అనగా 866 లక్షల కోట్ల రూపాయలు హాంఫట్ అయ్యాయని ఆక్స్‌ఫమ్ తన తాజా నివేదికలో తెలిపింది. 8.1శాతం ఉద్యోగాలు ఊడిపోయాయని సరాసరి ఐ.ఎల్.ఒ (ఇంటర్నేషల్ లేబర్ ఆర్గనైజేషన్) తాజా నివేదిక వెల్లడించింది. ఉపాధి ఉన్న వారికి కూడా 15.2శాతం మేర పని గంటలు తగ్గాయని ఐ.ఎల్.ఒ తెలిపింది. ఇంతటి గడ్డు పరిస్థితుల్లోనూ భారత పెట్టుబడి దారుల ఆదాయాలు అమాంతం పెరుగుతున్నాయి. గౌతం అదానీ ఆస్థి ఈ ఒక్క ఏడాది 1,50,380 కోట్లు అదనంగా సమకూరింది. ముఖేశ్ అంబానీది 1,33,287 కోట్ల మేర పెరిగింది. సైరస్ పూనా వాలా, శివ నాడర్, అజీమ్ ప్రేమ్జీ, రాధాకిషన్ దమానీ, దిలీప్ సంఘ్వీ... ఇలా అనేక మందిదీ ఇదే రీతి. కోటానుకోట్ల మంది సంపాదనలు తిరోగమనంలో ఉంటే కొందరివీ ఇలా పెరగటానికి కారణం ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానం కాక మరేమిటి? మితిమీరిన అసమానతలకు తావిస్తున్న విధానాలకు స్వస్థి చెప్పకుండా మళ్ళీ వాళ్ళు చెప్పినట్టే, వారికి ఉపయోగపడే బడ్జెట్‌ను తయారు చేయడానికి ప్రభుత్వం సిద్దమౌతుంది!
- గోళ్ల తిరుపతయ్య