Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోడీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలు వ్యవసాయంలో కీలక పాత్రధారులైన వివిధ వర్గాలు, ఆర్థిక తరగతులపై ఏ తరహా ప్రభావాన్ని ఏ మేరకు చూపించ నున్నాయన్న విషయాలను వివరించేందుకు ఉద్దేశించిన వ్యాసాల్లో మొదటిది ఈ వ్యాసం. ఈ వ్యాసంలో కాంట్రాక్టు వ్యవసాయ చట్టం దేశంలోని కౌలు రైతుల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించనుందో పరిశీలిద్దాం. దేశంలో వ్యవసాయక కమతాలు, సేద్యం తీరు తెన్నుల గురించి జాతీయ నమూనా సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) వివరాలు సేకరించి విశ్లేషణాత్మక నివేదికలు ప్రభుత్వానికి అందచేస్తుంది. ఈ నివేదికలే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అధ్యయనం చేసే వారికి ప్రత్యేకించి వ్యవసాయం తీరుతెన్నులు అధ్యయనం చేయదల్చు కున్న వారికి ప్రధానమైన ముడిసరుకు. అంతేకాదు, వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వాలు రూపొందించే విధానాలకు కూడా ఇవే నివేదికలు కీలకమైన సమాచారాన్ని అందిస్తాయి. అందువల్ల నా ఈ పరిశీలనకు కూడా ఇవే నివేదికలను ఆధారం చేసుకుంటున్నాను. దురదృష్టవ శత్తూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చాక ఇటువంటి సర్వేలు నిలిచిపోయాయి. దేశంలో వ్యవసాయ కమతాలు, రైతాంగం ఆదాయాల గురించిన వివరాలు 2013 తర్వాత అందుబాటులో లేవు. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ 2013లో విడుదల చేసిన 70వ దఫా సర్వే నివేదిక అంచనాలు ఇలా ఉన్నాయి.
దేశంలో 2013 నాటికి 141 మిలియన్ హెక్టార్ల నికర సాగు భూమిని 156.1మిలియన్ కుటుంబాలు సాగు చేస్తున్నాయి. 1970 నాటికి మొత్తం సాగుదారుల్లో 15శాతంగా ఉన్న కౌలుదారులు మొత్తం సాగవుతున్న భూమిలో 10.6శాతం భూమి సాగు చేస్తున్నారు. 1970-90 దశకాల్లో కౌలుకివ్వటం గణనీయంగా తగ్గింది. దీనికి ఓ కారణం 1970 దశకం నాటికి కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించిన భూ సంస్కరణల చట్టాలు. రెండో కారణం సాగుదారులను లక్ష్యంగా పెట్టుకుని అమలు చేసిన కనీస మద్దతు ధరలు, వ్యవసాయక సబ్సిడీలు, లెవీ ధాన్యం సేకరణ, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి సేకరణ వంటి అనేక విధానాలు. ఈ పద్ధతుల ద్వారా ప్రభుత్వం వ్యవసాయంలో తీసుకున్న చర్యల కారణంగా 1980-1985 వరకూ సేద్యం గిట్టుబాటుగానే ఉంది. దాంతో 1970 నాటికి 25శాతంగా ఉన్న కౌల్దారులు 1990 నాటికి తొమ్మిదిశాతానికి పడిపోయారు. అంటే దాదాపు 17శాతం కౌలుదారులు తగ్గిపోయారు. వీరంతా పొట్టపోసుకోవటం కోసం వ్యవసాయ కూలీలుగా మారారు. 1990-2013 మధ్య కాలంలో ప్రభుత్వాలు స్థూలంగా అనుసరించిన ఆర్థిక సంస్కరణల ప్రభావంతో వ్యవసాయ రంగానికి ఇస్తున్న మద్దతు, రాయితీలు కూడా కోతకోసింది. ప్రభుత్వ సహకారం లేకుండా ఏ దేశంలోనూ వ్యవసాయం గిట్టుబాటు కాదు. దాంతో ఫలసాయం మీద వచ్చే ఆదాయం కంటే కౌలు రూపంలో వచ్చే ఆదాయం నికరంగా ఉండే పరిస్థితులు తలెత్తాయి. ఫలితంగా కౌలుసేద్యం ఒకింత పుంజుకోవటం మొదలైంది. జాతీయ సగటుతో పోలిస్తే ఏపీ, తెలంగాణల్లో కౌలుదారుల సంఖ్య మూడురెట్లు అధికంగా ఉండటం గమనించాల్సిన విషయం. ఏపీలో 1991 నాటికి మొత్తం సాగుదారుల్లో 21శాతంగా ఉన్న కౌలు దారులు 2012 నాటికి 42శాతానికి పెరిగితే తెలంగాణలో 1991 నాటికి కేవలం ఐదుశాతంగా ఉన్న కౌలుదారులు 2012 నాటికి 20శాతానికి పెరిగారు.
ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు కౌలుదార్ల రక్షణ చట్టం ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టు సేద్యం చట్టం ఆమోదించింది. ఈ చట్టం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా ఉన్న కౌలుదారుల కుటుంబాలు వ్యవసాయానికి దూరం కానున్నాయి. తిరిగి వ్యవసాయ కూలీల జాబితాలోనో లేక గ్రామీణ శ్రామికుల జాబితాలోనో చేరనున్నాయి. తాజా చట్టం స్వాతంత్య్రానంతరం 1955 నుంచి 1970 దశకం మధ్య కాలంలో ఉనికిలోకి వచ్చిన వ్యవసాయక సంస్కరణల చట్టాల స్ఫూర్తికి పూర్తి భిన్నంగానూ, వ్యతిరేంకగానూ ఉంది. నాటి చట్టాలు రైతు ప్రయోజనాలు నేపథ్యంగా పెట్టు కుని వస్తే నేటి చట్టాలు వ్యవసాయో త్పత్తుల వాణిజ్యం నేపథ్యంగా పెట్టుకుని వచ్చాయి.
కాంట్రాక్టు సేద్యం చట్టం నేరుగా కౌలుదారుల కడుపు కొట్టే చట్టం అని చెప్పటానికి మరో కారణం కూడా ఉంది. కౌలుకు ఇచ్చే రైతులు సాధారణంగా చిన్న కమతాల రైతులే. ఇప్పుడున్న గ్రామీణ ఆర్థిక జీవితంలో స్థూలంగా కౌలు పంటదిగుబడి మోతాదుపై ఆధారపడి ఉంది. మరింత లోతుగా పరిశీలిస్తే ఆహారపంటల్లో కౌలుసాగు చేసే కుటుంబాలు వాణిజ్య పంటల్లో కౌలుసాగు చేసే కుటుంబాలకంటే ఎక్కువగా ఉన్న విషయం స్పష్టమవుతుంది. కొత్త చట్టం పంట దిగుబడితో నిమిత్తం లేకుండా కౌలు చెల్లింపుల నిర్ధారణ, చెల్లింపు ఉండాలని ఆదేశిస్తోంది. ఇది ఓ రకంగా భూమి స్వంతదారుకు కాస్తంత ఊరట కలిగించే అంశమే. సాగు సాధకబాధకాలతో నిమిత్తం లేకుండా తన కౌలు సొమ్ము దక్కుతుందన్న భరోసా భూ యజమానికి ఉంటుంది. అదే సమయంలో ఈ కౌలు ఒప్పందాలు ఏ పంటకాలానికి ఆ పంటకు వేర్వేరుగా కుదుర్చుకోవాలని చట్టం చెబుతున్నా ఈ చట్టం అసలు ఉద్దేశ్యం అది కాదు. దీర్ఘకాలిక సేద్యపు కాంట్రాక్టులు ఉంటే తప్ప కాంట్రాక్టు సేద్యంలో ప్రయివేటు కంపెనీలు, వ్యవసాయోత్పత్తుల ఆధారిత ప్రాసెసింగ్ పరిశ్రమలు పెట్టుబడులు పెట్టవన్నది 2001 నుంచీ 2014 వరకూ కేంద్రం నియమించిన వివిధ కమిటీల అంచనా. నిర్ధారణ. ఈ రకంగా చూసుకున్నప్పుడు చిన్న కమతం స్వంతదారు లేదా పెద్ద కమతం స్వంతదారు అన్న తేడా లేకుండా దీర్ఘకాల ఒప్పందాలకు సిద్ధపడ్డవాళ్లతోనే ప్రయివేటు కంపెనీలు ఒప్పందాలు కుదుర్చు కుంటాయి. తదగనుగుణంగానే అధిక లాభాలు ఆర్జించే వాణిజ్య పంటలు సాగు చేస్తాయి. అంతో ఇంతో నికర ఆదాయం గ్యారంటీ కోరుకుంటున్న భూ యజమాని కౌలురైతుకు భూమి ఇవ్వటానికి బదులు కాంట్రాక్టు సాగుకు ఇవ్వటానికి సిద్ధపడతాడు. ఇది రైతులను దెబ్బతీసేదే అయినా ఈ పరిస్థితుల్లో తక్షణం నష్టపోయేది కౌలుదారీ రైతు కుటుంబాలే.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కౌలుదారీ సేద్యం చుట్టూ నిర్మితమైన ఆర్థిక వ్యవస్థ ఓ కీలక భాగాన్ని ఆక్రమించి ఉంది. ప్రభుత్వ అంచనాల ప్రకారమే జాతీయ స్థాయిలో 10శాతానికి పైగా కుటుంబాలు కౌలుసేద్యంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. కొత్త కాంట్రాక్టు సేద్యం చట్టంతో ఈ పదిశాతం కుటుంబాలు అంటే సుమారు 13కోట్ల మంది జీవనోపాధి ప్రమాదంలో పడనుంది. అంతేకాదు. దీర్ఘకాలిక ఒప్పందాలకు సిద్ధం కాని భూ యజమానులు, సిద్ధమైన భూ యజమానుల మధ్య పోటీ పెట్టి కార్పొరేట్ సంస్థలు లబ్దిపొందటానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇష్టం ఉన్నా లేకున్నా తమ పొలాలు కార్పొరేట్ సంస్థలకు అప్పగించాల్సిన దుస్థితికి రైతు నెట్టబడతాడు. అంటే ప్రభుత్వం భూసేకరణ సమయంలో అనుసరిస్తున్న వ్యూహం లాంటివన్నమాట.
అన్నిటిని మించి గ్రామీణ వేతన వ్యవస్థ మీద ఈ కాంట్రాక్టు సేద్యం చూపించే ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఇప్పటికే సాగులో దొరికే పనిదినాలు తగ్గిపోతున్నాయి. భూమి లేని వ్యవసాయ కూలీల సంఖ్య ఈ రెండు దశాబ్దాల్లో గణనీయంగా పెరిగింది. తాజా సంస్కరణలు మరో జీవనోపాధి లేని గ్రామీణ శ్రామికుల సంఖ్యను గణనీయంగా పెంచనున్నాయి. ఇప్పటికే అరకొర కూలి కోసం ఆరాటపడే పరిస్థితి ఈ చట్టాలతో మరింత దిగజారనుంది. కాంట్రాక్టు సేద్యం చట్టంతో కోట్లాదిమంది కౌలురైతులు జీవనోపాధి కోల్పోనున్నారు. గ్రామీణ వేతనాలు మరింత నేలచూపులు చూసే పరిస్థితి దాపురించనున్నది. ఈ చట్టాల పర్యవసానంగా నష్టపోనున్న గ్రామీణ ఆర్థిక సామాజిక తరగతులను ఆదుకునేందుకు ఈ చట్టంలో ఎటువంటి ఏర్పాట్లూ లేవు. ఏతావాతా ఈ చట్టం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేయనుందనటంలో సందేహం లేదు.
- కొండూరి వీరయ్య
సెల్: 9871794037