Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిసెంబరు 26, 2020 నాడు ఓ వార్తా పత్రిక (డెక్కన్ క్రానికల్)కు ఒక పాఠకుడు రాసిన ఉత్తర సారాంశం మనసును గగుర్పొడిచేదిగా, భవిష్యత్తును భయపెట్టేదిగా అనిపించింది. ఆ ఉత్తరం ఏమిటి, దేనికి స్పందనగా పాఠకుడు అలా రాశాడు? అన్న విషయాలు తెలుసుకునే ముందు పురాణాలు ఇతిహాసాలు సమాజ గమనాన్ని ముందుకు తీసుకెళతున్నయా లేక తిరోగమనంలో పూడ్చి పెడుతున్నాయా? అన్న భయాందోళన కలుగుతున్నది.
పశ్చిమ బెంగాల్లోని సౌమిత్రఖాన్ అనబడే బీజేపీ పార్లమెంటు సభ్యుడు తన భార్యకు విడాకుల నోటీసు పంపించారు. తన భార్యకు ఆయన విడాకుల నోటీసు పంపిస్తే మనకేంటి అభ్యంతరం! అనుకోకండి. విడాకులు పంపించడానికి కారణం ఏమంటే సుజాత మోండల్ అనబడే ఆయన భార్య తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిందట. తాను బీజేపీలో నాయకుడిగా చలామణీ అవుతుంటే తన భార్య ప్రత్యర్థి పార్టీలో చేరడం ఏమిటని వారికి కోపం వచ్చింది. సదరు బార్యాభర్తలిద్దరూ గత కొంతకాలంగా వేరు వేరుగా నివసిస్తున్నారు. సౌమిత్రఖాన్ కూడా మొదట్లో తృణముల్ కాంగ్రెస్ నాయకుడే. అనంతర కాలంలో బీజేపీ నాయకులుగా రూపాంతరం చెందారు. భార్యతో వేరువేరుగా నివశిస్తూ ఆమె బాగోగుల గురించి ఆలోచించని వ్యక్తి, ఆమె నిర్ణయాన్ని మాత్రం తప్పుబడుతూ విడాకుల నోటీసు పంపించడం ఆశ్చర్యకరం. వారు ఎందుకు వేరువేరుగా ఉండాల్సి వచ్చిందో, ఆ కారణాల చేత విడాకులకు వెళితే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ రాజకీయమైన దురుద్దేశంతో ఒక మహిళను ఇలా కట్టడి చేయడం ఎలా సమంజసం? అయితే ఈ వ్యాసాన్ని రాయడానికి పురిగొల్పిన అంశం వీరి విడాకులో లేదా వారి రాజకీయపరమైన పూర్వాపరాలో కాదు. ఈ విడాకులపై సోషల్ మీడియాలోనూ ప్రధాన స్రవంతి మీడియాలోనూ జరుగుతున్న చర్చే కారణం. మొదట్లో ప్రస్తావించినట్టుగా ఈ విడాకుల నోటీసును దక్కన్ క్రానికల్ పాఠకుడు తన ఉత్తరంలో సమర్థించడానికి చెప్పిన కారణమేమంటే, రామాయణంలో ఒక వ్యక్తి సీతమ్మ పవిత్రతను అనుమానించడంతో రాముడు సీతాదేవిని త్యజించి ఆమెను అడవిలో వదిలి పెట్టాడు. ''ఇంతటి ఘనచరిత్ర గల మనం భర్తని కాదని, భార్య మరో రాజకీయ పార్టీతో సంబంధం పెట్టుకుంటే ఎందుకు సహించాలి, విడాకులు ఇవ్వడమే సరైన పద్ధతి'' అంటూ స్పందించాడు. రామాయణ ఇతివత్తంలో ఎవరో ఒక వ్యక్తి నిందించడంతో, నిండు చూలాలు అని కూడా చూడకుండా అడవిలో వదిలిపెట్టడం న్యాయమో అన్యాయమో చర్చించవలసిన అవసరం ప్రస్తుతం లేదిక్కడ. కానీ బోడిగుండుకూ మోకాలికీ లింకు పెట్టినట్టు చదివిన ఇతిహాసాలను ఈ విధంగా ఆపాదించుకుంటూ స్త్రీలను తక్కువగా చేసి చూడటం చాలా తప్పు. భర్త అంటేనే భరించేవాడు అంటారు. మరి అలాంటి భర్త భార్యను దూరంగా పెట్టి ఆమె బాగోగులు పట్టించుకోకుండా, దూరంగా నివసిస్తున్న ఆమె తనకు నచ్చిన పార్టీని ఎంచుకోవడాన్ని కాదనే హక్కు ఎవరిచ్చారు? ఓషో కథల నుంచి ఒసేరు రాములమ్మ వరకు అన్నింటా రాజకీయ దురంధరులు అమాయక అబలలను చెరబట్టడం మన పురాణ గాథల కొనసాగింపే. అందుకేనేమో ఇప్పుడు మత ఛాందసవాదంతో రాజకీయాలు ప్రోత్సహిస్తున్న వారు నిర్భయ సంఘటన మొదలు దిశ, కథువా, హత్రాస్ నుంచి నిన్నటి అనంతపురం స్నేహలత వరకూ మహిళలపై జరుగుతున్న లైంగికదాడులు, హత్యలపై నోరు మెదపరు, నిరసన తెలపరు, ఇంకా చెప్పాలంటే నిందితులపై మమకారం చూపిస్తారు, రక్షణగా నిలుస్తారు. ఇవన్నీ కూడా ఇతిహాసాల ప్రకారం పెద్దగా తప్పుగా అనిపించవేమో! ప్రస్తుతం నోరు మెదపకుండా, నిరసనలు తెలుపకుండా ఉంటున్నారు గానీ భవిష్యత్తులో బహిరంగంగా సమర్ధిస్తారేమో...! తలుచుకుంటేనే భయమేస్తోంది. ప్రతి ఏటా లక్షల కొద్ది పేద బాలికలూ మహిళలూ వేలంపాటల్లో కొనుగోళ్ళ ద్వారా అపహరణకు గురై కొన్నాళ్ళ తరువాత వ్యభిచార కూపాల్లో తేలుతున్నారు. ప్రస్తుతం ఇది చట్టరిత్యా నేరమే కానీ, తరువాతి కాలాల్లో స్వయంవరం పేరు మీద బహిరంగ వేలం నిర్వహించి ఆడపిల్లలను గెలుచుకొని తీసుకెళ్ళి, మహభారతంలో అర్జునుడు గెలుచుకొచ్చిన ద్రౌపదిని ఐదుగురుకి భార్యలను చేయలేదా...అంటూ వారి దుశ్చర్యకు సమర్థనగా మహాభారతాన్ని చూపిస్తారేమో! నరబలులు, కన్నెపిల్లల సమర్పణలూ అనేక గాథల్లో మనకు వినిపిస్తాయి... వాటన్నింటీని ఉటంకిస్తూ సమర్థిస్తూ పోతే ఇంకెంత ప్రమాదమో!
కుల వ్యవస్థ ఒకప్పుడు సమాజం ఏర్పరుచుకున్న పని విభజన, ''ఇది కాలక్రమేణా అంతరించిపోతుంది... అందరూ అన్ని పనులు చేసుకుంటూ సమానంగా ఉంటారు...'' అని చిన్నప్పుడు ఒక అభ్యుదయవాదంగా టీచర్లు బోధిస్తే సంతోషించాం. పౌరోహిత్యం తప్ప నేడు అన్ని వత్తులూ కులానికతీతంగా జరుగున్నవి. కానీ రాజకీయుల ప్రయోజనాల దష్ట్యా కుల కాష్టం రాజుకుంటూనే ఉన్నది. నేడు బహు ప్రాబల్యం పొందిన చిన్న జీయర్ స్వామి లాంటివాళ్ళు కుల వ్యవస్థ అవసరమని, ఒక కులం వాడు మరో కులానికి లొంగి ఉండడం అంతకన్నా అవసరమని, అన్ని కులాలు సమానంగా ఉండాలని కోరడం సరైంది కాదంటూ ''చేతికి ఐదు వేళ్ళు ఎలా ఉన్నాయో చూడండి'' అని చూపిస్తూ కుల వ్యవస్థలోని అసమానతలను సమర్థిస్తూ ఉంటే... ఇది తిరోగమనమా? పురోగమనమా?
- జి. తిరుపతయ్య
సెల్: 9951300016