Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అది వెన్నెల రాత్రి. ఆ వెన్నెల్లో పంటపొలాల్లో పచ్చటినార్లు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. ఆ పొలాల మధ్య ఒక పెద్ద మర్రిచెట్టు ఉన్నది. ఆ మర్రిచెట్టు కిందికి పొలాల్లోని వరినారు, గోధుమనారు, మొక్కజొన్న కంకులు, పల్లిమొక్క, టమాటనారు, ఆలుగడ్డ మొదలైనవి చేరుకున్నాయి.
''ఏమర్రా అందరూ వచ్చారా! ఇంకా ఎవరైనా రావల్సి ఉందా?'' అడిగింది వరినారు!
''మన సమావేశానికి అందరూ వచ్చారక్కా! ఇక ప్రారంభించండి!'' అన్నది గోధుమ.
''మనందరికీ తెలుసు! గత మూడు నెలల నుంచి మన రైతన్నలు మనలను కాపాడుకునేందుకు, తద్వారా దేశాన్ని కాపాడుకునేందుకు చారిత్రాత్మక పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటంలో కొన్ని పరిణామాలు జరిగాయి! అవి మంచివా! కాదా! వాటి ఫలితాలు భవిష్యత్‌లో ఎలా ఉంటాయి? వాటి పట్ల మనకూ ఒక అవగాహన ఉండాలి అనే ఉద్దేశ్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాము!'' అన్నది వరి.
''అక్కా! నేనూ, ఆలుగడ్డా భూమిలోపలే ఉంటాము కదా! ఆ వివరాలు మాకు సరిగా తెలియదు. పూర్తిగా వివరించు!'' అన్నది వేరుశనగ.
''కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, పాత చట్టాలు రద్దుచేసి కొత్తగా మూడు వ్యవసాయ చట్టాలు చేసిన విషయం మీకు తెలుసు. ఆ చట్టాల ఫలితంగా మన రైతన్నలకు మనము దూరమై, కార్పొరేట్ల విషకౌగిలిలో చిక్కుకుని పోతాము! అంతేకాక ప్రజలు మనలను కొనలేని స్థితికి పడిపోతాము. అందుకే రైతన్నలు ఆ చట్టాలు రద్దు చేయాలని పోరాటాలు చేస్తున్నారు! కొత్తగా చేసిన చట్టాల్లో కనీస మద్దతు ధర అనే అంశాన్ని తొలగించారు. దాన్ని తొలగించటం వల్ల రైతులకు వచ్చే ఆదాయానికి గ్యారంటీ లేకుండా పోయింది'' అన్నది వరి.
''కనీస మద్దతు ధరను కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తున్నదట!'' అన్నది టమాట.
''పార్లమెంటులో అనేక హామీలు ఇచ్చారు! కాని ఎక్కడా అమలు చేయటం లేదు. చట్టంలో ఉంటే అది అమలు చేయమని అడిగే హక్కు ఉంటుంది! అందుకే రైతన్నలు పోరాడుతున్నారు!'' అన్నది గోధుమ.
''ఇంత పెద్ద పోరాటం జరుగుతుంటే సుప్రీం కోర్టు ఎందుకు స్పందించదు? సుమోటోగా స్వీకరించవచ్చు కదా!'' అన్నది ఆలుగడ్డ అమాయకంగా!
''అయ్యో! ఆలూ అంకుల్ నువ్వు భూమిలోపల ఉన్నందున నీకు పూర్తి సమాచారం లేదు. సుప్రీం కోర్టులో కేసే వేశారు! రోడ్లు దిగ్బంధనం చేసినందున, ధర్నా చేస్తున్నందున ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నవని కోర్టులో కేసు వేస్తే.. కోర్టు విచారించి, ఈ చట్టాల అమలుపై స్టే విధించింది! ఆ తర్వాత రైతులతో చర్చించటానికి నలుగురితో ఓ కమిటీ వేసింది!' అన్నది టమాట.
''హమ్మయ్య! సమస్యకు ఒక పరిష్కారం దొరికిందన్న మాట!'' అంటూ సంబరపడింది ఆలుగడ్డ.
మొక్కజొన్న ఎగిరి వచ్చి, ఆలుగడ్డ నెత్తిన ఒక్కటిచ్చింది! ''పిచ్చి ఆలూ నీవు భూమిలోపలి నుంచి బయటకి వచ్చినా, నీ తల ఇంకా భూమిలోపలే ఉంది! మొత్తం చెప్పేదాక వినవే'' అన్నది.
''సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నతమైనదే! కానీ ఆ నిర్ణయాలు, తీర్పులు కూడా అత్యున్నతంగా ఉండాలి! గతంలో చాలా తీర్పులు అత్యున్నతంగా వచ్చాయి. కానీ రైతున్నల విషయంలో మాత్రం అన్యాయంగా కమిటీ వేశారు. చట్టాల అమలుపై స్టే ఇచ్చినప్పుడు అందరూ సంతోషించారు. రైతులతో కమిటీ వేసినప్పుడు, ఆ సభ్యులు నిస్పక్షపాతంగా, నిజాయితీగా, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని, ఉంటారని అందరూ ఆశించారు. కానీ, కమిటీ సభ్యులు అంతా కొత్త వ్యవసాయ చట్టాలను పూర్తిగా సమర్థించినవారే. అలాంటి వారు, రైతులతో చర్చలు జరిపి ఏం ప్రయోజనం! ఇది చేపలను వలలతో చర్చలు జరపమన్నట్లుంది!'' వివరించింది గోధుమ.
''కొత్త సాగు చట్టాలను సమర్థించిన వారితో కమిటీ ఎలా వేస్తారు? ఇది అంత పెద్ద కోర్టుకి తెలియదా? దేశంలో నిస్పక్షపాతంగా ఉండే మేధావులే కరువయ్యారా? ఇదెక్కడి న్యాయం? సుప్రీంకోర్టే ఇలా చేస్తే ఎవరికి చెప్పుకోవాలి?'' కన్నీళ్ళు పెట్టుకుంది టమాట.
''నీ ప్రశ్నకి సుప్రీంకోర్టే సమాధానం చెప్పాలి. దేశంలో అనేక మంది మేధావులు ఉన్నారు. వ్యవసాయరంగ నిపుణులు ఉన్నారు. పాలగుమ్మి సాయినాథ్, ప్రొ.నర్సింహారెడ్డి లాంటి వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిని కాదని ఏకంగా రైతుల డిమాండ్లను వ్యతిరేకించే వారినే కమిటీగా వేసి, చర్చించమని చెప్పటం ఈ దేశంలో జరుగుతున్న అతిపెద్ద అన్యాయం!'' అన్నది గోధుమ.
''ఇప్పటికీ 11సార్లు చర్చలు జరిగాయి కదా! ఎందుకు ఒక్క డిమాండునైనా ఒప్పుకోవటం లేదు! రైతన్నలు కూడా ఒక అడుగు తగ్గవచ్చు కదా!'' అన్నది వేరుశనగ.
''రైతన్నలతో ప్రభుత్వం 11సార్లు చర్చలు జరపటం రైతులు సాధించిన ఒక విజయం! ఎందుకంటే, ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎవరి డిమాండ్లపైనా ఇన్నిసార్లు చర్చలు జరపలేదు. అయితే దీనికి మరోకోణం ఉంది! నీకువచ్చిన ఫీలింగ్, దేశ ప్రజలకి రావాలన్నదే పాలకుల ఎత్తుగడ! ఇన్నిసార్లు చర్చలు జరిపి సవరణలకు హామీలు కూడా ఇస్తుంటే, రైతులు ఒప్పుకోకుండా, మొండిగా వ్యవహరిస్తూ సమస్యను జటిలం చేస్తున్నారని, రైతన్నలను బద్నాం చేయాలని ప్రభుత్వం చూస్తున్నది! ఇప్పటికే మీడియా, వాట్సప్ యూనివర్సిటీలలో ఇలాంటి ప్రచారం మొదలైంది! కానీ వాస్తవమేమిటంటే, కొత్త సాగు చట్టాలలో కొన్ని సవరణలు చేసినా, ఆ చట్టాల స్వరూప స్వభావాలు మారవు. ఆ సవరణలతో ఎలాంటి ప్రయోజనాలు ఒనకూడవు! కాబట్టే మొత్తం చట్టాలు రద్దు చేయాలని రైతన్నలు డిమాండ్ చేస్తున్నారు!'' వివరించింది గోధుమ.
''చట్టాల అమలు ఏడాదిన్నర నిలిపేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా!'' అన్నది జొన్న.
''ప్రభుత్వం ఇచ్చిన హామీ కొత్తదేమీ కాదు! సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే అమలు చేయటం.. అంతే..! అదేమీ రైతుల డిమాండ్లు ఆమోదించటం కాదు. కొత్త చట్టాలు అంబానీ, ఆదానీ చుట్టాలు కదా! చట్టాల అమలు నిలిపేస్తామని ప్రభుత్వం ప్రకటించినా, అవి అమలు ఎలా చేయించుకోవాలో అదానీ, అంబానీలకు బాగా తెలుసు! ధాన్యంతో కళ కళ లాడాల్సిన మార్కెట్ యార్డులు ఇప్పటికే బోసిపోయి కన్పిస్తున్నాయి. తాము పండించిన కొద్దిపాటి పంటను ఎక్కడ అమ్ముకోవాలా అని రైతు దిక్కులు చూస్తున్నాడు. మరోపక్క మన ముఖ్యమంత్రి, ఇక నుంచి ధాన్యం కొనుగోలు చేయబోమని, ఎక్కడైనా అమ్ముకోవచ్చునని ప్రకటించాడు. ఇవన్నీ కొత్త చట్టాల అమలునే తెలియచేస్తున్నాయి. అందుకే రైతన్నలు, చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు'' అన్నది వరి.
''రైతన్నలపట్ల ప్రభుత్వానికి ఇంత మొండితనం ఎందుకు?'' అడిగింది టమాట.
''ఈ ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నదే; కాని కార్పొరేట్లకు ఊడిగం చేస్తోంది. అందుకు రైతులు, కార్మికులు ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న చట్టాలు రద్దు చేసి, కార్పొరేట్లకు అనుకూలంగా కొత్త చట్టాలు చేస్తున్నారు. నిన్న కార్మిక చట్టాలు రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్స్ తీసుకుని వచ్చారు. నేడు మద్దతు ధర లేకుండా వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు! కార్పొరేట్లకు తాము ఊడిగం చేస్తున్న విషయం ప్రజల తెలియకుండా అనేక విధాలుగా మభ్యపెడుతున్నారు!'' అన్నది గోధుమ.
''ఎలా మభ్యపెడుతున్నారో అది కూడా చెప్పక్కా'' అడిగింది జొన్న.
''కరోనాకు ప్రపంచమంతా వ్యాక్సిన్ వచ్చింది. ప్రజారోగ్యం తమ బాధ్యతగా గుర్తించిన అన్ని దేశాల ప్రభుత్వాలు ఉచితంగానే ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తున్నాయి. అది ప్రభుత్వాల బాధ్యత. కాని మనదేశంలో అది నరేంద్రమోడీ వల్లనే సాధ్యమైతున్నట్టు ఊదరగొడుతున్నారు. దీనివెనుక రైతన్నల పోరాటాలను మసకబార్చాలనే ఎత్తుగడ దాగున్నది!'' వివరించింది వరి.
''మభ్యపెట్టడం, అబద్ధాలు ప్రచారం చేయటం, భావోద్వేగాలు రెచ్చగొట్టడం మోడీ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య! ఒక్కపక్క రైతులు గడ్డకట్టే చలికి పోరాడుతూనే ప్రాణాలు కోల్పోతుంటే.. ఇప్పుడు రాముడి గుడికి చందాల తంతు ముందుకు తేవటంలో కూడా రైతన్నల పోరాటాలు బలహీన పర్చాలన్న కుట్రదాగుంది!'' వివరించింది వరి.
''ఇప్పుడు మనమేం చేయాలి?'' ప్రశ్నించాయి అన్నిపంటలు.
''మనమెప్పుడూ రైతన్నల పక్షమే. మనలను చూసుకుని రైతన్నలు కళ్ళనీళ్ళు పెట్టుకునే రోజులు పోయి, మనలను గుండెకు హత్తుకుని ఆనందంతో కన్నీళ్ళు వచ్చే రోజులు రావాలి. వస్తాయి కూడా. అందుకే రైతన్నల పోరాటం. దేశ ప్రజల మద్దతుతో రైతన్నే గెలుస్తాడు. మనలను, రైతన్నలను ఇంత క్షోభపెట్టిన మోడీ ప్రభుత్వం ఇంతకింత అనుభవిస్తుంది!'' అంటూ ముగించింది వరి.
- ఉషా కిరణ్