Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతుల దీక్షలకు మద్దతు తెలపడానికి ఖమ్మం నుంచి 2వ తేదీ ఉదయం 5గంటలకు బయలుదేరి ఢిల్లీ వెళ్ళాం. ముందు అఖిల భారత కిసాన్‌సభ ఆఫీస్‌కు చేరుకొని అక్కడి నుంచి సింఘూ బోర్డర్‌కు బయలుదేరాం. సరిగ్గా 5కిలోమీటర్ల దూరం ఉందనగా పోలీసులు ఔట్‌పోస్ట్ పెట్టి రైతులను చేరేందుకు అనుమతివ్వకుండా అడ్డుకున్నారు. అయినప్పటికీ ఎన్నో అవరోధాలను అధిగమించి ఎలాగోలా రైతుల దీక్షలకు చేరుకొని, మూడు రోజుల పాటు వారితో కలిసి పోరాడాం. పంజాబ్ గదర్ వీరుల వారసులతో, భగత్ సింగ్, ఉద్ధామ్ సింగ్, కర్తార్ సింగ్ శరభల వారసులతో కలవడం గొప్ప అనుభూతినిచ్చింది. అక్కడ ఐఐటీ విద్యార్థులు మేం చేరుకోగానే మా పాదరక్షలు తుడిచి శుభ్రంచేసి దేశానికి వెన్నెముక అయిన రైతుల దీక్షలకు మద్దతు తెలుపుతున్న మీరు నిజమైన దేశభక్తులని చెప్పడం భావోద్వేగానికి గురిచేసింది. వారిచ్చిన ఉద్యమ స్ఫూర్తి వర్ణణాతీతం. మరుసటి రోజు పానిపట్ యుద్ధానికి నాయకత్వం వహించిన యుద్ధ వీరుల మనవలు, మనవరాళ్ల నాయకత్వంలో ఢిల్లీకి 120కిలోమీటర్ల దూరంలో లక్షలాది మంది రైతులతో పోరాటం నిర్వహిస్తున్న టిక్రీ బోర్డర్‌కు వెళ్ళి పాల్గొన్నాం. ఇప్పుడు ఢిల్లీని నలువైపులా ముట్టడించి, మోడీ-షాల దుర్మార్గ పాలన మెడలు వంచడానికి ప్రయత్నిస్తున్నది ఈ రైతు ఉద్యమం.
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల వశంచేసే చట్టాలు తెచ్చారు. పౌరహక్కులను కాలరాశారు. ఎదురులేదన్నట్టుగా విర్రవీగుతూ ముందుకు సాగుతున్న మోడీషా రథం ఇప్పుడు రైతుల ప్రతిఘటనతో ఇరకాటంలో పడింది. ఆ ఉద్యమం మరింత విశాలమై, బలం పుంజుకుని జయించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ ఉద్యమం విస్తరించి ఈ దేశ ప్రజల స్వప్నం సాకారం కావాలని కోరుకుందాం. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, హిందూత్వం కోరలు చాచి విస్తరిస్తున్న ఈ చీకటి సమయంలో కాంతిరేఖలా పొడుచుకొచ్చింది రైతు ఉద్యమం. చార్లెస్ డికెన్స్ రెండు మహానగరాలు ప్రారంభంలో రాసినట్టు.. ''ఇది ఎంత విచారకరమైన, విషాదగ్రస్తమైన, నిరాశాజనకమైన వల్లకాటి అధ్వాన్న శకంగా కనబడుతున్నప్పటికీ, అదే సమయంలో ఇది ఒక ఉత్సాహభరితమైన, ఉత్తేజకరమైన, ఆశా సూచనలు వెల్లివిరుస్తున్న వైభవోజ్వల శకం కూడా.'' ప్రజావ్యతిరేక దుర్మార్గశక్తుల దుందుడుకు వేగం ఎంత నిజమో, ప్రజా చైతన్య సమీకరణ, ప్రతిఘటన, సమరోత్సాహం కూడ అంతే నిజం. నిజంగానే గడిచిన ఐదు సంవత్సరాలు, మరీ ముఖ్యంగా గడిచిన సంవత్సరం ప్రపంచం మొత్తంగానూ, దేశంలోనూ, రాష్ట్రంలోనూ నిరాశాజనకమైన ప్రజావ్యతిరేక పరిణామాలెన్నో సంభవించాయి. అనేక దేశాలలో అభివృద్ధి నిరోధక శక్తులు అధికారానికి వచ్చాయి. అంతర్జాతీయంగా సామ్రాజ్యవాద శక్తులదే పైచేయి అయింది. దేశంలో నరేంద్రమోడీ-అమిత్‌షా ద్వయం అత్యంత ఆధిక్యతతో గద్దెనెక్కింది. అంతర్జాతీయం గానూ దేశీయంగానూ ఆర్థిక సంక్షోభం వడివడిగా పరుగెత్తుకొస్తున్నది. దేశంలోనూ, రాష్ట్రంలోనూ కనీస పౌర, ప్రజాస్వామిక హక్కుల మీద ఉక్కుపాదం అమలవుతున్నది. ఎటు చూస్తే అటు నిరాశ, అటు దుఃఖం. నిజమే. కాని, అదే సమయంలో అన్ని ఖండాలలోనూ అనేక దేశాలలో రాజధాని నగరాలలో, కీలక స్థలాలలో ఉవ్వెత్తున లేచి నిలిచి అధికారాన్ని ప్రశ్నిస్తున్న లక్షలాది ప్రజా సమూహాలు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయి. ధిక్కారం చుట్టూ రాతిగోడలు కట్టి బంధించిన కొద్దీ ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు బండల మధ్య నుంచి తొంగిచూస్తున్న చిగుళ్ల స్వేచ్ఛాగీతాలు ఈ సమూహాలు. అణచివేసిన కొద్దీ ఉక్కుపాదాలను పడదోస్తున్న చైతన్య సంకేతాలు ఈ ఉద్యమాలు. ఈ రైతు ఉద్యమంపైకి చూడటానికి ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ రంగ చట్టాల ఉపసంహరణ అనే పరిమిత లక్ష్యంతో సాగుతున్నట్టు కనబడుతున్నది గానీ... నిశితంగా పరిశీలిస్తే అందులో మరెన్నో కోణాలున్నాయి. ఇది ఈ దేశపు రైతాంగ చైతన్యం ఎంత క్రియాశీలమైనదో ఎలుగెత్తుతున్నది. రైతాంగం తలచుకుంటే ప్రభుత్వాన్నీ, కార్పొరేట్లనూ ప్రతిఘటించగలదని చూపుతున్నది. చలికాలపు ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోతున్నా ప్రజల పోరాట దీక్ష చెక్కు చెదరడం లేదంటే ఈచట్టాల ప్రమాదం ఎంత తీవ్రమైనదో, రైతుల సంకల్పం ఎంత ధృడమైనదో అర్థమవుతున్నది. చర్చలంటూ పిలుస్తూ, అసలు విషయాలు చర్చించ కుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వ కార్పొరేట్ దాస్య స్వభావాన్ని ఈ ఉద్యమం బట్టబయలు చేస్తున్నది. ఒక నిజమైన ప్రజా సమస్య మీద, విస్తృతమైన భాగస్వామ్యంతో సాగుతున్న ప్రజా ఉద్యమాన్ని పట్టించుకోకుండా, అబద్ధాలు ప్రచారం చేస్తూ, తప్పుడు విశ్లేషణలు చేస్తూ కాలం గడుపుతున్న ప్రధాన స్రవంతి ప్రచార సాధనాలు పాలకవర్గాల పెంపుడు పక్షులనే వాస్తవాన్ని ఈ ఉద్యమం ఎత్తి చూపుతున్నది. నిజమైన ప్రజా ఉద్యమం విశాలమైన ప్రజా సంఘీభావాన్ని కూడగట్టుకోగలదని చాటిచెపు తున్నది. అది ఇప్పటికే ప్రజా చైతన్యాన్ని విస్తరించడంలో విజయం సాధించింది. ఆ ప్రజా చైతన్యాన్ని అందిపుచ్చుకుని, మరింత విశాలం చేసి, మరిన్ని ప్రజారాశులలోకి ప్రవహింపజేసే ప్రజాశక్తుల కోసం ఈ దేశం ఎదురుచూస్తున్నది.
- యం.ఎ. జబ్బార్
సెల్ : 9177264832