Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కస్తూరి రంగ రాజన్ కమిటీ 2019 మార్చిలో జాతీయ విద్యావిధానం ముసా యిదాను ప్రవేశ పెట్టడం, అందులోని అప్రజాస్వామిక, అభివృద్ధి నిరోధక ధోరణులను విమర్శకు పెడుతూ పెద్దఎత్తున చర్చ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అవేవీ పరిగణనలోకి తీసుకో కుండానే, పార్లమెంటులో పెట్టకుండానే చర్చలేకుండానే మంత్రిమండలి ఆమోదంతో 'జాతీయ విద్యావిధానం 2020'ని ప్రకటించి కేంద్ర ప్రభుత్వం 'తాంబూలాలు ఇచ్చేశాను తన్నుకు చావండి' అంటున్నది. ఈ నూతన విద్యావిధానం-2020 ప్రాచీనమూ, శాశ్వతమూ అయిన భారతీయ జ్ఞానానికి సంబంధించిన సంపద్వంతమైన వారసత్వం వెలుగులో రూపొందించబడినట్టుగా చెప్పడమే దాని పునాదిని సూచిస్తున్నది. సుసంపన్నమైన, వైవిధ్యభరితమైన భారతీయ సంస్కృతిని ప్రత్యక్ష అనుభవం నుంచి తెలుసుకోవడానికి విద్యార్థులను భిన్న ప్రాంతాల పర్యటనకు తీసుకువెళ్లాలని, అందుకు ఒక వంద పర్యాటక క్షేత్రాలను గుర్తించాలని చెప్పిన సందర్భంలో 'ఏక్ భారత్ శ్రేష్ట భారత్' భావన ప్రస్తావనకు వచ్చింది. అలాగే ఇందులో భాషల బోధన, అధ్యయనాల గురించి చెప్పే సందర్భంలోనూ ప్రస్తావనకు వచ్చిన 'ఏక్ భారత్ శ్రేష్ట భారత్' భావన భిన్నత్వాలను, బహుళత్వాలను రద్దు చేసే ఆధిపత్య సంస్కృతీ ప్రతిధ్వని తప్ప మరొకటి కాదు. ప్రతి పాఠశాల విద్యార్థి 'ఏక్ భారత్ శ్రేష్ట భారత్' భావన దృష్ట్యా భారతీయ భాషలలో సరదాగా ఒక ప్రాజెక్ట్ చేయాలని అందువల్ల ప్రధాన భారతీయ భాషల ఉచ్చారణ, వర్ణమాల, లిపి, సాధారణ వ్యాకరణ నిర్మాణం, పదజాల సంస్కృత మూలాలు, వాటి పరస్పర సంబంధాలు, భేదాలు తెలుసుకోవడం సాధ్యం అవుతుందని, తద్వారా భాషకు ఉన్న శక్తి అర్థం అవుతుందని చెప్తూనే సంస్కృతం గురించి 'అదొక జ్ఞాన వ్యవస్థ' అని ప్రత్యేక పూనికతో చెప్పడం, సంస్కృతాన్ని పాఠశాల విద్యలో ఒక ఐచ్ఛిక విషయంగా ప్రవేశపెట్టడం ద్వారా ప్రధాన స్రవంతిలోకి తేవాలి అని చెప్పడం, సంస్కృత విద్యాలయాల ప్రస్తావన మొదలయినవన్నీ విద్య కాషాయీకరణ ప్రమాదాన్ని సూచించేవే. కోర్సుల రూపకల్పన ఎలా ఉంటుంది? పాఠ్య విషయాలు ఏముంటాయి? నిర్ణయాధికారం ఎవరిది? ఉద్యోగ పరికల్పనలో వీటికి ఉన్న ప్రమేయం ఏమిటి? మొదలైన ప్రశ్నలకు సమాధానం లేదు. భారతీయ భాషా జ్ఞానం వ్యక్తి ఉద్యోగార్హతలలో ఒకటిగా చేయాలన్నారు. అందువల్ల అదనంగా ఒరిగేది ఎమన్నా ఉన్నదా? భారతీయ భాషా జ్ఞానం అవసరం ఉన్న ఉద్యోగాలు పెరగకుండా అందువల్ల సమకూరే ప్రయోజనం ఉంటుందా? - అన్నీ ప్రశ్నలే. ఈనాడు విద్యారంగంలో కార్పొరేట్ ప్రయోజనాలకు అనుగుణమైన అంతర్జాతీయ వైఖరులను అమలు చేయడానికే 'బహుళ కళా జ్ణానం' అన్న భావన ముందుకు తెచ్చింది. గుణాత్మక విద్య ద్వారా ప్రపంచంలోనే అత్యున్నత జ్ణానశక్తి (గ్లోబల్ నాలెడ్జ్ సూపర్ పవర్)గా దేశాన్ని అవతరింపచేయడం ఈ నూతన విద్యా విధానానికి అంతిమ గమ్యమట. విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాల ప్రాతిపదికగా ప్రపంచ దేశాల మానవాభివృద్ధి సూచికలో అన్నిటా దిగువ స్థానాలతో సంతృప్తి పడిన దేశాన్ని అత్యున్నత జ్ఞానశక్తిగా అవతరింప చేయడం ఎలా సాధ్యమో వీరికి ఎవరు చెప్పాలి? ఈ జ్ఞాన ఆధిక్యత దృష్టి దేశంలో జ్ఞాన వైవిధ్యాన్ని అణగదొక్కి ఒకే రకమైన జ్ఞానాన్ని సర్వోతష్టమైనదిగా, శ్రేష్టమైనదిగా స్థాపించే ఫాసిస్ట్ సంస్కృతిని పరివ్యాప్తి చేసే ప్రమాదమే ముందు ఉన్నది. సామాజిక న్యాయం, సమానత్వం సాధించడానికి ఉన్న ఏకైక గొప్ప సాధనం విద్య అని ఈ నూతన విద్యావిధానం-2020 పేర్కొంటున్నది. 2040 నాటికి సామాజిక, ఆర్థిక నేపథ్యాలతో సంబంధం లేకుండా అందరికీ అత్యున్నత గుణాత్మక విద్యకు సమాన అవకాశాలు సాధించడం గురించి వాగ్దానం కూడా చేసింది. కానీ జాగ్రత్తగా గమనిస్తే ఇవి శూన్య హస్తాలు చూపే శుష్క ప్రియాలు మాత్రమే అని సులభంగా అర్థమవుతుంది. అందరికీ ప్రత్యేకించి సామాజిక, ఆర్థిక అననుకూలతలలో ఉన్న సమూహాలకు చదువుకునే అవకాశాలు కల్పించడానికి పాఠశాల విద్య బహుముఖ మార్గాలలో విశాలం కావలసి ఉంటుందని అంటూ అందుకు ఫార్మల్, నాన్ ఫార్మల్ విద్యా విధానాలను సిఫారసు చేసింది ఈ నూతన విద్యావిధానం-2020. ఆ రకంగా అసమ సంస్కృతికి ఈ విద్యా విధానం రాస్తాను మరింత విశాలం చేసేదిగా ఉంది.
ఎక్కువ మందికి గుణాత్మక ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చే సహజ మార్గం 'ఆన్‌లైన్ డిస్టెన్స్ లెర్నింగ్' అని పేర్కొనడం గమనిస్తే రాబోయే బహుళ జ్ఞాన కేంద్రాలుగా ఉండే విశాల విద్యా సంస్థలు ఎవరి కోసమో సులభంగానే అర్థమవుతుంది. అయితే ఈ లెర్నింగ్ అనేది ఇప్పటికే మార్కెట్ సరుకుగా స్థిరపడింది. నూతన విద్యావిధానం దానిని వ్యవస్థీకృతం చేయడానికి సంకల్పించిందే తప్ప మరొకటి కాదు. విద్యారంగాన్ని ఆశ్రయించి ఆర్థిక సంపదను రాజకీయ, సామాజిక, సాంస్కృతిక సంపదగా మార్చడానికి జరుగు తున్న అంతర్జాతీయ కుట్రలో భాగంగా వచ్చిన ఈ నూతన విద్యావిధానం భారతీయమైనది అనుకుంటే పొరపాటే. ఆ పేరు మీద ప్రపంచ పెట్టుబడికి భారతీయ విద్యారంగాన్ని తాంబూలంలో పెట్టి అప్పజెప్పడమే జరగబోయేది. తస్మాత్ జాగ్రత్త!
- ఎన్. శ్రీనివాస్
సెల్ : 9676407140