Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కామ్రేడ్ నల్లశివన్ తమిళనాడులో కమ్యూనిస్టు అగ్రనేత. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడుగా బాధ్యతలను నిర్వహించిన ఆయన శత జయంతి సంవత్సరం తమిళనాడు రాష్ట్రంలో పార్టీ రాష్ట్రశాఖ ఘనంగా నిర్వహిస్తోంది. 1922 ఫిబ్రవరి 22న నల్లశివన్ తిరునల్వేలి జిల్లాలోని ఒక గ్రామంలో జన్మించారు. 1940లో తన 18వ ఏటనే ఆయన కమ్యూనిస్టుపార్టీలో చేరారు. అనతికాలంలోనే పార్టీ పూర్తికాలం కార్యకర్తగా పని చేయనారంభించారు. 57ఏండ్ల సుదీర్ఘ ఉద్యమ జీవితం గడిపి 1997 జూలై 20న తన 76వ ఏట అనారోగ్యంతో మరణించారు.
పార్టీపై బ్రిటిష్ పాలకులు విధించిన నిషేధం అమలులో ఉన్న కాలంలోనే నల్లశివన్ పార్టీ సభ్యత్వం స్వీకరించారు. దాదాపు రెండు దశాబ్దాలపాటు తిరునల్వేలి జిల్లాలో కార్మికోద్యమ నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు. ముందు బ్రిటిష్ పాలకులు, ఆ తర్వాత కాంగ్రెస్ పాలకులు నల్లశివన్‌ను ఒక ప్రమాదకరమైన ప్రత్యర్థిగా పరిగణించేవారు. స్వాతంత్య్ర పోరాటంలోను, అనంతర కాలంలోను నల్లశివన్ సాగించిన ఉద్యమ నిర్మాణం, ప్రదర్శించిన సమరశీలత, సైద్ధాంతిక కృషి పాలక వర్గాలకు వణుకు పుట్టించడమే ఇందుకు కారణం.
కామ్రేడ్ నల్లశివన్ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో పలుమార్లు నిర్బంధాలను ఎదుర్కొన్నారు. మొత్తం 5 సంవత్సరాల 9 మాసాలు జైలు జీవితం గడిపారు. శత్రువుల దాడులను తట్టుకుంటూనే, మరో మూడున్నర సంవత్సరాలపాటు అజ్ఞాత జీవితం గ డిపారు.
ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా 1959లో కామ్రేడ్ నల్లశివన్ ఎన్నికయారు. 1964లో సీపీఐ(ఎం) ఏర్పడ్డాక సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీకి, 1968లో రాష్ట్ర కార్యదర్శివర్గానికి ఎన్నికయారు. 1970లో సీఐటీయూ ఏర్పడింది. అప్పుడు కామ్రేడ్ నల్లశివన్ సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శిగా, అఖిల భారత కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. 1981లో అప్పటి పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎ.బాలసుబ్రమణియన్ అకస్మాత్తుగా మరణించడంతో ఆ స్థానంలో నల్లశివన్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి 1994 వరకూ ఆ బాధ్యతల్లో కొనసాగారు. అనారోగ్య కారణంగా 1994లో కార్యదర్శి బాధ్యత నుంచి తప్పుకున్నారు. 1978లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికైన నల్లశివన్ 1988లో జరిగిన 13వ మహాసభలో పొలిట్‌బ్యూరో సభ్యునిగా ఎన్నికయారు.
తమిళనాడు శాసనమండలి సభ్యుడిగా 1978 నుంచి1984 వరకు, రాజ్యసభ సభ్యుడిగా 1989 నుంచి 1995 వరకు పని చేశారు. చట్టసభల్లో అణగారిన వర్గాల కోసం గట్టిగా పోరాడారు. గిరిజన మహిళల హక్కుల కోసం ప్రత్యేకంగా కృషి చేశారు. రాష్ట్రాల హక్కుల కోసం గళమెత్తారు. తమిళ భాషలో టెలిగ్రామ్‌లు పంపడం ఆయన కృషి ఫలితంగానే సాధ్యపడింది.
పార్టీ బాధ్యతలను, ప్రజా ఉద్యమ జీవితాన్ని, చట్ట సభలలోని బాధ్యతలను సమతూకంలో మేళవింపు చేయడం నల్లశివన్ ప్రత్యేకత. పార్టీ కమిటీల్లో ఆంతరంగిక చర్చల్లో ప్రజాతంత్రంగా వ్యవహరించడం, ఓపికగా వినడం, యువతరాన్ని ప్రోత్సహించడం వలన నల్లశివన్ కార్యకర్తలకు ఇష్టుడైన నాయకుడైనారు. సైద్ధాంతిక నిబద్ధత, క్రమశిక్షణ, నమ్రత, నిరాడంబరతల ప్రతిరూపం కామ్రేడ్ నల్లశివన్. ఆయన నిరంతర అధ్యయనశీలి. రోజువారీ పనితోబాటు సైద్ధాంతిక కృషిని ఏమాత్రమూ విస్మరించని మేధావి. కామ్రేడ్ నల్లశివన్ జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం.
- వెంకటేశ్ ఆత్రేయ