Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అది శాసనమండలి
ఉబుసుపోని కబుర్ల అడ్డా కాదు
చర్చలను రచ్చలుగా మార్చే
రాజకీయ గద్దలసభ కానేకాదు
అరేండ్లకోసారి అగుపించే వారికి
అక్కడేం పని దొరకదు
ఉద్యమించే సబ్బండ వర్గాలకు
ఊపిరిగా నిలిచే వారికే అక్కడ పని!
నిరుద్యోగుల నిట్టూర్పుల్లో
రాలుతోన్న అగ్ని కణాలు ఎవరికి తెలుసు
అన్నం పెట్టే రైతన్నల వెతలెవరికి తెలుసు
పాడుబడ్డ బడిగోడల
వలపోతెవరికి తెలుసు
కడుపు మాడుతున్న కార్మికుల
కష్టాలెవరికి తెలుసు
ఎర్రబస్సును వెర్రిబస్సును చేసిన
కుట్రలెవరికి తెలుసు
మూతబడ్డ పరిశ్రమల మూగరోదన
ఎవరికి తెలుసు
పారిశుధ్య కార్మికుల
పస్తులబాధలెవరికి తెలుసు
కాంట్రాక్టు ఉద్యోగుల
కన్నీటిగోస ఎవరికి తెలుసు
కొత్త పెన్షన్ తెచ్చిన
భవిష్యత్తు టెన్షనెవరికి తెలుసు
పెరుగుతున్న ధరలతో
పేదోడి దుఃఖమెవరికి తెలుసు
రంగమేదైనా పరిరక్షణకై యుద్ధరంగంలో
సైనికుడిలా నిలబడటమెవరికి తెలుసు
సామాన్యుల బతుకుల్లో వెలుగులకై
గళమెత్తి ప్రశ్నించడం ఎవరికి తెలుసు
ప్రశ్నించడమొకటేనా
పరిష్కారాలు చూపడమూ తెలుసు
విశ్లేషించడమే కాదు
వివేకమార్గాల అన్వేషణా తెలుసు
ఆ వ్యక్తి ఎవరో మనకందరికీ తెలుసు
అందుకే... ప్రశ్న గెలవాలి
ప్రజాస్వామ్యం నిలవాలి...
-వెన్నెల సత్యం