Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా పశ్చిమ బెంగాల్ మూడు రోజుల పర్యటన సమయంలో ఆ రాష్ట్రంలో బీజేపీ శక్తి పెరగటానికి తృణమూల్ కాంగ్రెస్ సహాయపడుతున్నదని ఒప్పుకున్నారు. ఈ విషయం కొత్తదేమీ కాదు. వామపక్షాలు చాలా రోజులుగా చెపుతూ వస్తున్నదే. బీజేపీ నాయకత్వం ఒప్పుకోవటంతో అది రుజువైంది. కోల్‌కతాలో విలేకర్లు ఆయనను బెంగాల్‌లో బీజేపీ నిర్మాణాన్ని బలపర్చటానికి ఏదైనా ప్రణాళిక ఉందా అన్న దానికి జవాబుగా, ''రాష్ట్రంలో తృణమూల్ ఏ విధంగా నడుస్తున్నదో దాన్నిబట్టి బీజేపీ శక్తి పెంచుకునే పని బీజేపీ కార్యకర్తలకంటే తృణమూల్ కాంగ్రెస్సే ఎక్కువ చేస్తున్నది'' అని ఆయన చెప్పారు. ఈ కథనం అంతర్యం ఏమంటే ఈ ఇరు పార్టీల మధ్య వైరానికి సంబంధించి నిరంతరం మీడియాలో వార్తల రూపంలో ఏ ప్రచారమైతే సాగుతున్నదో అందులో వాస్తవం లేదు. మీడియాలో చూపబడుతున్నది ఛాయాయుద్ధంలా గోచరిస్తున్నది. ఈ ఛాయాయుద్ధంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆమె జిల్లా, జిల్లాకు వెళ్ళి ఉపన్యాసాలు చెప్పినప్పుడు బీజేపీ మతతత్వ పార్టీ అని విమర్శ చేస్తున్నారు. బీజేపీ బెంగాల్‌లో మతతత్వ కలహాలను సృష్టించటానికి ప్రయత్నాలు చేస్తున్నదనే అభియోగాలు మోపుతున్నారు. కానీ ఎవరైతే చేత ఆయుధాలు బూని (బీజేపీ) మతపరమైన అలజడి సృష్టించారో వారిపై తృణమూల్ ప్రభుత్వం వాస్తవానికి ఏ చర్యా తీసుకోలేదు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా బెంగాల్‌ను సందర్శించినప్పుడు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ఘోష్ కూడా ఆయనతో ఉన్నారు. ఈ దిలీప్‌ఘోష్ శ్రీరామనవమి రోజు ఆయుధాలు చేతబూని ఊరేగింపు నిర్వహించారు. ఘోరమేమంటే, ఆ ఊరేగింపులో పసిపిల్లలు కూడా చేతిలో ఆయుధాలతో పాల్గొన్నారు. బహిరంగంగా చేతిలో ఆయుధాలతో ఊరేగింపు నిర్వహించిన అభియోగంపై ఇప్పటివరకూ ఒక్క కేసు నమోదు చేయడం తప్ప దిలీప్‌ఘోష్‌పై చర్య తీసుకునేందుకు మమతా బెనర్జీకి మనసు రాలేదు. కానీ భాంగూర్‌లో భూమి పరిరక్షణా ఉద్యమంతో సంబంధమున్న ''నేరానికి'' అబుల్‌హుస్సేన్ అనే ఒక ఉద్యమకారుడిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) క్రింద కేసు పెట్టడానికి మాత్రం మమతా బెనర్జీ ప్రభుత్వానికి చేయి వణకలేదు. మరోవైపు చూస్తే శారద చిట్‌ఫండ్ మరియు నారద ముడుపుల కుంభకోణాల్లో మునిగిపోయిన తృణమూల్ కాంగ్రెస్ మంత్రులు, పార్లమెంటు సభ్యులకు వ్యతిరేకంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి చొరవ చూపడం లేదు. ఈరోజు వరకూ కేంద్రప్రభుత్వ విచారణ సంస్థలు చిట్‌ఫండ్ కుంభకోణంలో ఆసామీలైన తృణమూల్ నాయకులను పట్టుకుని మోసపోయిన సాధారణ ప్రజలకు డబ్బు వాపస్ ఇప్పించే ఏర్పాటు చేయలేదు. నారద స్టింగ్ ఆపరేషన్ వ్యవహారం అప్పగించబడిన బీజేపీ నాయకులు ఎల్‌కె అద్వానీ నాయకత్వంలోని పార్లమెంటు ఎథిక్స్ కమిటీ ఈరోజు వరకూ సమావేశమే జరపలేదు. గతంలో లంచం తీసుకున్న నేరానికి పార్లమెంటు సభ్యులపై త్వరగా చర్యలు తీసుకుని పార్లమెంటు సభ్యత్వం నుండి తొలగించడం జరిగింది. కానీ ఈసారి లంచం పుచ్చుకున్న అసామీలు తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు కాబట్టి వారిపై చర్య తీసుకోవడానికి బిజెపికి ధైర్యం చాలడం లేదు. తృణమూల్ నాయకులని జైళ్ళల్లో కుక్కితే పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని మరియు ఆ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాల్సి వస్తుంది. దానివల్ల బీజేపీకి ఎటువంటి లాభం లేదు. ఈ రాజకీయ లెక్కల ఆధారంగానే బీజేపీ అడుగులు వేస్తోంది. వారి లెక్కల ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్‌లో ప్రభుత్వంలో ఉంటేనే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నిర్మాణం త్వరగా విస్తరిస్తుంది. గతంలో వామపక్ష సంఘటన ప్రభుత్వ హయాంలో హిందూత్వవాదులకు బెంగాల్‌లో తలెత్తే అవకాశం చిక్కలేదు. వారి మతపరమైన కార్యకలాపాల విషయంలో పరిపాలన అడ్డుగా ఉండేది. వామపక్షాల రాజకీయాల అడ్డు కూడా ఉండేది. ఇప్పుడు తృణమూల్ ప్రభుత్వ హయాంలో అలాంటివేమీ లేవు. రాష్ట్రంలో ఇంతటి సానుకూల పరిస్థితులు లభించడంతో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు సహజంగానే చాలా ఖుషీగా ఉన్నాయి.
ఇలాంటి ప్రత్యక్ష సహకారంతో పాటు మరో అదనపు లాభం కూడా తృణమూల్ నుండి ఉంది. అది ధృవీకరణ రాజకీయం. బీజేపీ దీన్నే ఎక్కువ కీలకంగా భావిస్తోంది. పెద్ద నోరు పెట్టుకుని అమిత్‌షా తృణమూల్ నుండి సహాయం అని ఏ నిజాన్నయితే అంగీకరించారో వాస్తవానికి అది ఈ ధృవీకరణే. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బెంగాల్‌లో మతపరమైన రాజకీయాల ద్వారా ఎలాంటి ధృవీకరణ చేసిందంటే, తృణమూల్‌కి బీజేపీయే ప్రత్యామ్నాయమనే భావన కలిగేలా చేసింది. 2014 సంవత్సరం నుండి ఈ ప్రక్రియ సంఘటితంగా జరుగుతున్నది. నిరంకుశ, అవినీతిపర, లౌకికవాద బాట అనుసరించని తృణమూల్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం వామపక్షాలు కాకుండా బీజేపీ అనే భావన ఏర్పర్చే ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ ప్రజలను వారి వర్గ చైతన్యం నుండి తప్పించి మత చైతన్యం లోకి నెట్టేయగలిగితే వారు బీజేపీ, తృణమూల్ అనే రెండు శిబిరాలుగా విడిపోతారు. వామపక్షాలు నష్టపోతాయి. అమిత్‌షా, మమతా బెనర్జీల ఉమ్మడి ప్రణాళిక ఇదే. కానీ దీనివల్ల ప్రజల తిండి, బట్ట, ఉపాధిసమస్యల పరిష్కారం లభించదు. అందుకే వాస్తవానికి తృణమూల్ మరియు బీజేపీ ఉభయులకూ ప్రత్యామ్నాయం ఇవ్వగలిగేది కేవలం వామపక్షాలే. ప్రజల జీవిక, జీవనోపాధి సమస్యల పోరాటంలో వారి పక్షాన నిలకడగా నిలుస్తున్నది వామపక్షాలే అనేది ఎల్లప్పుడూ రుజువవుతూనే ఉన్నది.
-వేదుల రామకృష్ణ