Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వినాయకచవితి ఉత్సవాలను జరుపు కోవడం అటుంచి, ఆ ఉత్సవాలు పర్యావరణా నికి హాని కలిగించేలా ఉండకూడదు. వినాయక విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసి, రసాయనాలు కలిపిన రంగులు వాడటం వలన నిమజ్జనం అనంతరం చెరువులు, కుంటలు కలుషితం అవుతున్నాయి. మట్టి విగ్రహాలు వాడాలన్న అంశానికి ప్రజలు తగు ప్రాధాన్యం ఇవ్వకపోవడం బాధ కలిగిస్తోంది. పర్యావరణానికి మనమే ద్రోహం చేస్తున్నాం. మట్టి విగ్రహాలు వాడటం వలన అనేక ప్రయోజనాలున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి విగ్రహాల రూపంలో తీసుకొచ్చిన మట్టిని చెరువుల్లో కలపడం ద్వారా నేల మరింత సారవంతమవుతుంది. నిమజ్జనం ద్వారా పర్యావరణానికి ఒనగూరే ఈ ప్రయోజనాన్ని అందరూ విస్మరిస్తున్నారు. రసాయన విగ్రహాల వలన చెరువుల్లో జలకాలుష్యం పెరిగి అందులో నివసిస్తున్న అనేక జీవులు అంతరిస్తున్నాయి. మట్టి విగ్రహాలు వాడాలని కొన్ని స్వచ్ఛంద సంస్థలు చొరవ తీసుకొని ప్రచారం చేస్తున్నాయి. కానీ గణేశ్ మండపాల నిర్వాహకులు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. భారీ విగ్రహాల తయారీపై గతంలో న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలకు సైతం మన్నన దక్కడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రసాయన విగ్రహాల తయారీని నేరంగా ప్రకటించాలి. వాటిని అరికట్టడానికి తయారీదశలో, అమ్మకాల దశలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.
- జి. అశోక్, గోదూర్, జగిత్యాల జిల్లా.