Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉన్నత విద్యపై జరుగుతున్న దాడిని నేడు మనం చూస్తున్నాం. స్వాతంత్య్రానంతరం ఇటువంటి దాడిని మనం చూడలేదు. మన దేశంలో కనీస సృజనా... స్వతంత్ర చింతనా... కాపాడుకోవాలంటే, మెట్రోపాలిటన్ పెట్టుబడిదారీ దేశాలపైన ఆధారపడే వలసపాలన నాటి సంపూర్ణ మేధో పరాన్నభుక్కుగా మారకుండా ఉండాలంటే ఈ దాడిని తిప్పికొట్టాలి.
పరస్పర సంబంధంగల నాలుగు ప్రత్యేక స్థాయిల్లో ఉన్నత విద్యపై దాడి జరుగుతున్నది. మొదటి దాడి జ్ఞాన క్షేత్రానికి సంబంధించినది. వాస్తవానికి సంబంధించిన ప్రతిపాదనలో ఎంత సత్యమున్నదన్న విషయాన్ని నిర్ధ్దరించటానికి సాక్ష్యాధారాలతో పనిలేదనే ఆలోచనకు అధికారికంగా అనుమతించటమనే రూపంలో ఈ దాడి ఉంటుంది. దీనితో విజ్ఞాన శాస్త్రానికి, దురభిప్రాయానికి మధ్య, చరిత్రకి, పురాణానికి మధ్య, వాస్తవానికి, కల్పనకు మధ్య గలతేడా నశిస్తుంది. ప్రాచీన కాలంలోనే భారతదేశంలో ప్లాస్టిక్ సర్జరీ చేసేవారని గణేష్ తల చెబుతుందని ఇండియన్ సైన్స్ కాంగ్రెసు వంటి సమావేశంలో ప్రధాని చెప్పటం జ్ఞాన క్షేత్రంపైన, చింతనపైన చేస్తున్న దాడికి ఉదాహరణగా ఉంది. అంటే చింతన ప్రాతిపదికగాగల ఉన్నత విద్యా క్షేత్రంపై చేసిన దాడి ఇది. ఇదేదో పట్టించుకోనవసరంలేని యాధృచ్ఛిక వ్యాఖ్య కాదు. అనేకమంది పాలక పార్టీ నాయకులు ఇటువంటి విచిత్ర వ్యాఖ్యలను చేయటంలో తలమునకలౌతున్నారు. పాలక పార్టీ మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్ చరిత్రపట్ల తనదైన అవగాహన కలిగివున్నది. ఈ అవగాహన హిందూ రాష్ట్రాన్ని స్థాపించాలనే ఆలోచనను సమర్థిస్తుంది. అంతేకాకుండా ఈ అవగాహనకు వ్యతిరేకంగా లభించే చారితక్ర ఆధారాలను పూర్తిగా తిరస్కరిస్తుంది. జ్ఞానరంగంపై జరుగుతున్న ఇటువంటి దాడిని కేవలం కాకతాళీయంగా జరిగిన ఘటనగా భావించకూడదు. ఇది హేతువును నాశనం చేయటానికి కావలసిన భూమికను తయారుచేస్తుంది. ఈ భూమిక మతతత్వ-నిరంకుశ పాలనకు కేంద్రకంగా ఉంటుంది.
హేతువును నాశనం చేసేందుకు రాజకీయ నాయకత్వం చేస్తున్న ఇటువంటి ప్రయత్నం రెండవ కారకం కారణంగా మరింత కలతకు గురిచేస్తుంది. ఉన్నత విద్యారంగంపైన రాజకీయ నియంత్రణను సాధించే ప్రయత్నమే రెండవ కారకం. వర్తమాన ప్రభుత్వం అధికారంలోకి రాకముందునుంచే విద్యారంగంలో రాజకీయ జోక్యం పెరిగింది. అయితే వర్తమాన ప్రభుత్వంలాగా హిందూ రాష్ట్ర దృక్పథంతో క్రూర రాజకీయ జోక్యం గతంలో లేదు.
యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ)ను రద్దు చేయాలనే ప్రతిపాదనతో ఈ ప్రయత్నం పతాక స్థాయికి చేరింది. విశ్వవిద్యాలయాలకు ప్రస్తుతం నిధులను కేటాయిస్తున్న యూజీసీ నిర్వహించే పాత్రను మానవ వనరుల మంత్రిత్వశాఖ కైవశం చేసుకోబోతున్నది. యూజీసీ పోషించిన పర్యవేక్షక పాత్రను హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(హెచ్‌ఈసీఐ) ద్వారా మానవ వనరుల మంత్రిత్వ శాఖ పోషిస్తుంది.
హెచ్‌ఈసీఐలో ఉండే 12మంది సభ్యులలో కేవలం ఇద్దరే ఉన్నత విద్యారంగంలో పనిచేస్తున్న వారు. మిగిలిన వారందరూ ప్రభుత్వ విధానాలకు కట్టుబడి వుండే ఏదో ఒకరకమైన అధికారులే(వీరిలోని ఇద్దరు వైస్ చాన్సలర్లు కూడా వేరేవిధంగా ఉండే అవకాశం లేదు). విశ్వవిద్యాలయాలలో ఏఏ కోర్సులు ఉండాలి, ఆ కోర్సులలో ఎటువంటి సిలబస్ ఉండాలి, డీన్లు, అధ్యక్షులుగా ఎవరు ఉండాలి తదితర విషయాలను నిర్ణయించటంలో యూజీసీ కంటే ఎంతో ఎక్కువ అధికార పరిధి హెచ్‌ఈసీఐకి ఉంటుంది. అంతేకాదు దీని నిర్దేశాలను పాటించకపోవటం నేరమవుతుంది. అటువంటి నేరాలకు పాల్పడిన విశ్వవిద్యాలయ అధికారులకు రెండేండ్ల వరకు జైలుశిక్ష విధించవచ్చు.
ఇది సరిపోదన్నట్టుగా హెచ్‌ఈసీఐపై అడ్వయిజరీ కౌన్సిల్ ఉంటుంది. ఈ అడ్వయిజరీ కౌన్సిల్‌కు మానవ వనరుల శాఖామంత్రి అధ్యక్షుడిగా వుండి హెచ్‌ఈసీఐ కార్యకలాపాలను ప్రభావితం చేస్తాడు. క్లుప్తంగా చెప్పాలంటే యూజీసీ స్థానంలో రాబోయే సంస్థ ఉన్నత విద్యాసంస్థల పాలనను విద్యావేత్తలనుంచి రాజకీయ నాయకులకు బదలాయిస్తుంది. దీనిని ప్రస్తుత రాజకీయ పాలకుల జ్ఞాన సంబంధిత దురభిమానాలతో కలిపి చూసినప్పుడు మన ఉన్నత విద్యా వ్యవస్థ భవిత అగమ్యగోచరంగా తయారవుతుంది.
కారకంవైపు మీ దృష్టి ఆకర్షించదలిచాను. ఉన్నత విద్యాసంస్థలలో చేరే విద్యార్థుల సామాజిక మేళనంలో దళిత, ఇతర అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులు మినహాయింపునకు గురవుతున్న రూపంలో ఈ మూడవ కారకం ఉన్నది. ప్రభుత్వ విద్యాసంస్థలలో ఇప్పటిదాకా అమలవుతున్న రిజర్వేషన్ విధానం తన కార్యసాధకత కోల్పోతున్నది. దీనికి కారణం ఉన్నత విద్యారంగం మరింతగా ప్రయివేటీకరింపబడుతుండటమే కాకుండా ప్రభుత్వ విద్యాసంస్థలలో కూడా రిజర్వేషన్ విధానాన్ని ఏ మాత్రం జంకకుండా అతిక్రమిస్తున్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో ప్రత్యేకంగా 'చెల్లించే' కోర్సుల రూపంలో ఎటూ రిజర్వేషన్ విధానాన్ని అతిక్రమిస్తున్నారు. అయితే గతంలో బాగా ఉపయోగపడిన సాధారణ కోర్సుల పట్ల విశ్వవిద్యాలయాలు తగిన శ్రద్ధ చూపటం లేదు. దీనికి కారణం అధికారంలోకి వచ్చిన హిందూత్వ ఆధిపత్యం అగ్రకుల ఆధిపత్యంగా పరిణమించటమే.
గతంలో రిజర్వేషన్ విధానంలో భాగంగా ఒక స్తరానికి(స్ట్రేటమ్) చెందిన దళిత, ఇతర ఉపాంత నేపథ్యాలు గల విద్యార్థులు విశ్వవిద్యాలయాలలో ప్రవేశించారు. వీరికి హేతువు ఆధారిత విద్యాసంబంధ ప్రవచనాన్ని కొనసాగించాలనే నిబద్ధత ఉండేది. తమతమ సామాజిక వర్గాల దుస్థితిపట్ల సమాజాన్ని చైతన్యపరచటానికి దానిని సాధనంగా వాడేవారు. వీరి మినహాయింపు పెరగటంతో విశ్వవిద్యాలయాలలో హేతువుకు గల సామాజిక విస్తృతి కుంచించుకుపోయే పరిస్థితి ఏర్పడింది. వీరి మినహాయింపు ఇతర కారణాలచేత కూడా గర్హనీయమైనదనేది స్పష్టం. దానితో సామాజిక న్యాయం తిరస్కరింపబడుతుంది. ఇది మౌలికంగా అప్రజాస్వామికమైనది. అంతేకాకుండా విశ్వవిద్యాలయ వ్యవస్థలో హేతువు నాశనాన్ని, పురాణాలను చరిత్రగా చూపే ప్రయత్నాలను, దురభిమానాలను విజ్ఞాన శాస్త్రంగా చూపటాన్ని ఎదుర్కొనగలిగే సామాజిక రక్షణ శ్రేణిని అటువంటి మినహాయింపు తొలగిస్తుందనే విషయాన్ని చాలామంది గ్రహించటం లేదు.
ఇలా రాజకీయ ప్రేరితంగా హేతువు నాశనం కావటం విద్య సరుకీకరణ జరగటమనే నాలుగవ కారకంతోపాటు గాను, దానికి పూరకంగాను జరుగుతుంది. విద్య సరుకీకరణలో ఉన్నత విద్య ప్రయివేటీకరింపబడటం ఒక స్పష్టమైన వ్యక్తీకరణ. సామాజిక పాత్రను పోషించటం కోసం సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులకు విద్యను ఉచితంగా అందించటానికి బదులుగా లాభార్జన కోసం అపరిమితమైన వ్యయాన్ని భరించగలిగే విద్యార్థులకు మాత్రమే ఉన్నత విద్యను పెట్టుబడిదారులు అందిస్తున్నారు.
అలా లాభాలను ఆర్జించే ప్రయివేటు విద్యాసంస్థలను మూడు విధాలుగా వాటి అనుకూలురు సమర్థిస్తున్నారు. అయితే ఇవన్నీ బూటకపు సమర్థనలే. లాభాలన్నీ తిరిగి సంస్థలలోకే పెట్టుబడులుగా వస్తాయనేది మొదటి సమర్థన. ఇదొక బూటకపు సమర్థన అనేది స్పష్టం. లాభార్జనే ధ్యేయంగాగల ఒక కార్పొరేట్ సంస్థ స్వభావం తన లాభాలను తిరిగి అదే సంస్థలో పెట్టుబడిగా పెట్టినప్పటికీ ఎలా మారదో లాభాలను ఆర్జించే విద్యాసంస్థ తన లాభాలను తిరిగి పెట్టుబడిగా తన సంస్థలోనే పెట్టినప్పటికీ లాభాలను ఆర్జించాలనే దాని స్వభావం మారదు.
అభివృద్ధి చెందిన దేశాలలోని ప్రయివేటు విద్యాసంస్థలు కూడా ఇదే అర్థంలో లాభాలను ఆర్జించే సంస్థలు అని చెప్పటం రెండవ అసత్యం. దాతలు వ్యక్తిగతంగాను, సమూహాలగాను స్థాపించే విద్యాసంస్థలకు, లాభార్జన కోసమే స్థాపించే విద్యాసంస్థలకు మధ్యగల తేడా గమనించాలి. దాతలచే స్థాపించబడిన విద్యాసంస్థల గురించి మనకు చాలా కాలంగా తెలుసు. క్రైస్తవ మిషినరీల విద్యాసంస్థలు ఈ తరగతికి చెందినవే. అమెరికా వంటి దేశాలలో హార్వర్డ్, స్టాన్‌ఫొర్డ్, కొలంబియా వంటి ప్రయివేటు విద్యాసంస్థలను దాతలు విరాళాలతో స్థాపించారు. అయితే ఈ విద్యాసంస్థలు భారతదేశంలో స్థాపింపబడుతున్న విద్యాసంస్థల వలే లాభాలను ఆర్జిస్తున్న సంస్థల తరగతికి చెందవు. దీనికి రెండు స్పష్టమైన కారణాలున్నాయి. భారతదేశంలోని క్రిష్టియన్ విద్యాసంస్థలతో సహా అటువంటి విద్యాసంస్థలలో అంతర్గత రాయితీ విధానం ఉంటుంది. కొంతమంది విద్యార్థులు ఎక్కువ స్థాయిలో ఫీజులు కడితే మరికొందరు అసలు ఫీజు లేకుండానో లేక కొద్దోగొప్పో ఫీజు కట్టే పద్ధతి ఉండటం మొదటి కారణం. భారతదేశంలో స్థాపించబడుతున్న విద్యాసంస్థలలో ఫీజులు విదేశాలలోని విద్యాసంస్థలు వసూలు చేస్తున్న ఫీజులకంటే అధికంగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ విద్యాసంస్థలలోని విద్యార్థులకు ఎటువంటి రాయితీలు లభించటం లేదనేది రెండవ కారణం.
అంతగా ఫీజులు ఎక్కువగా ఉన్నప్పటికీ పేద విద్యార్థులు అటువంటి విద్యాసంస్థలలో చేరటానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదనీ, అందుకు కావలసిన డబ్బును అప్పుగా తీసుకుని విద్యాభ్యాసం పూర్తిచేసుకుని ఆర్జన మొదలుపెట్టిన తరువాత సదరు అప్పును తిరిగి చెల్లించవచ్చనే వాదన మూడవది. ఈ వాదనలో ఏమాత్రం నిజం లేదు. ఎందుకంటే మనం పూర్ణ ఉద్యోగితలేని సమాజంలో జీవిస్తున్నాం. డబ్బును పెద్ద ఎత్తున ఫీజుల రూపంలో గుంజే విద్యాసంస్థలలో చదివిన విద్యార్థికి ఉద్యోగం వస్తుందనే గ్యారంటీ ఏమీ లేదు. దానితో సదరు విద్యార్థికి అప్పుతీర్చే సామర్థ్యం ఉంటుందనే గ్యారంటీ ఉండదు. ఈ వాస్తవం నేపథ్యంలో అప్పుజేసి చదువుకోవటానికి విద్యార్థులు ఉత్సాహపడరు. క్లుప్తంగా చెప్పాలంటే ఈ విద్యాసంస్థలు స్వతస్సిద్ధంగా మినహాయించే స్వభావం గలవి.
(మిగతా భాగం తరువాయి సంచికలో)
అనువాదం: నెల్లూరు నరసింహారావు
- ప్రభాత్ పట్నాయక్
సెల్: 8886396999