Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏకీకృత సర్వీస్ రూల్స్ విషయంలో 2017 జూన్22న రాష్ట్రపతి ఇచ్చిన 'సవరణ ఉత్తర్వులు' చెల్లవని ఉన్నత న్యాయస్థానం తీర్పునివ్వడంతో 1992 నుంచి కొనసాగుతున్న పీఆర్ ఉపాధ్యాయుల పోరాటం మళ్లీ మొదటికొచ్చింది. ఈ తీర్పును ప్రభుత్వ ఉపాధ్యాయులు స్వాగతిస్తుండగా, పీఆర్ ఉపాధ్యాయుల ఆశలు గల్లంతయ్యాయని ఆవేదన వ్యక్తం చేసారు. ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రభుత్వ వైఫల్యమేనని చెబుతున్నారు. కోర్టుతీర్పుతో ఇంతకాలం ఉపాధ్యాయ, ఆధ్యాపక పోస్టులకు సంబంధించి ప్రమోషన్ల విషయంలో అడ్డంకిగా ఉన్న కేసులు మళ్లీ మొదటికొచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్దాలుగా ఖాళీగా ఉంటూ వస్తున్న ఎంఈఓ, డిప్యూటీ ఎంఈఓ, డైట్‌లెక్చరర్స్ తదితర పోస్టుల భర్తీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ముందు రెండు అవకాశాలు మాత్రమే మిగిలాయి. అందులో ఒకటి రెండు రాష్ట్రాలూ మళ్లీ సుప్రీం కోర్టుకెళ్లడం, మరొకటి రాజ్యాంగసవరణ ద్వారా ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్‌కు సంబంధించి ఏకీకృతానికి ఆమోదం పొండడం. ఇది తప్ప ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మరో అవకాశం లేదన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలనే, రాష్ట్రపతి కూడా 'సవరణ ఉత్తర్వులు' ఇచ్చారు. ఇలాంటి కీలకాంశంపై ప్రభుత్వ ఉపాధ్యాయులు హైకోర్టుకెళ్లిన సందర్భంలో తెలుగు రాష్ట్రాలు సుప్రీంకోర్టు న్యాయవాదితో సరైన సమయంలో కోర్టులో వాదనలు వినిపించినట్టయితే తీర్పు వేరేలా ఉండేదన్న వాదన కూడా సర్వత్రా వినిపిస్తోంది. ఇప్పట్లో రాజ్యాంగసవరణ అంత తేలిక కాదన్న విషయం కూడా చర్చ జరుగుతోంది. దేశంలో ఒకపక్క ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతుండగా ఈ సమయంలో రాజ్యాంగసవరణ ఉండబోదన్నదే తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 25,991 పాఠశాలలుండగా అందులో 3వేలలోపు ప్రభుత్వ పాఠశాలలు కాగా, 23వేలకు పైగానే పీఆర్ పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో ప్రస్తుతం ఉపాధ్యాయుల ఏకీకృతసర్వీస్ రూల్స్‌కు సంబంధించే ఉపాధ్యాయుల పదోన్నతులు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉంటున్నాయి. డీఎస్సీ నిర్వహించినప్పటికీ కీలక పోస్టుల్లో ఇంచార్జీలే కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 584 మండలాలకుగాను కేవలం 36మంది మండల విద్యాశాఖాధికారులే ఉన్నారు. ఇవి భర్తీకాకపోవడానికి కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉండటమే కారణం. నిరంతరం పాఠశాలలను తనిఖీచేయడం, ఉపాధ్యాయుల పనితీరును, విద్యార్థుల ప్రతిభను పర్యవేక్షించే ఎంఈఓ పోస్టులు 500కు పైగా ఖాళీగా ఉంటే విద్యావ్యవస్థ ఎంతవరకు సజావుగా నడుస్తుందో అర్దం చేసుకోవచ్చు. ప్రమోషన్లతో మాత్రమే భర్తీచేసే వీలున్న డిప్యూటీ డీఈఓ పోస్టులు రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్కటి కూడా భర్తీచేయకపోవడం నేటి విద్యావ్యవస్థకు అద్దంపడుతుంది. డైట్ లెక్చరర్స్ కూడా రాష్ట్రంలో 206పోస్టులకు గాను దాదాపు 180కి పైగా ఖాళీలే దర్శనమిస్తున్నాయి. ఫలితంగా డైట్ కాలేజీల్లో పాఠాలు తూతూ మంత్రంగానే నడుస్తున్నాయి.బీఈడీ అధ్యాపకులు సుమారు 100, గ్రేడ్ వన్ హెచ్‌ఎం పోస్టుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడం పరిస్థితిని మరింతగా దిగజారేలా చేస్తోంది. దాదాపు 27 ఏండ్లుగా కోర్టుల్లో సాగుతున్న ఉపాధ్యాయుల పోరాటానికి తాజా హైకోర్టు తీర్పు ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో మాత్రం సంతోషాన్ని నింపి, పీఆర్ ఉపాధ్యాయుల్లో తీవ్ర నిరాశను మిగిల్చింది. కోర్టుతీర్పుతో దాదాపు మూడు దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశపడ్డ పీఆర్ ఉపాధ్యాయులకు చుక్కెదురైంది. ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్‌ను ఏకీకృతం చేయాలంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు, ఆయా మంత్రి వర్గాలు, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రులు, విద్యాశాఖాధికారులతోచర్చించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా రెండు ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకోకపోతే ఉపాధ్యాయలు మరోపోరాటానికి శ్రీకారం చుట్టే వీలుంది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హైకోర్టు తీర్పుపై సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా చర్చించి భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయిస్తామని చెప్పారు. ఇక పీఆర్ ఉపాధ్యాయులు ప్రభుత్వంపై ఇప్పటికే సీరియస్‌గా ఉన్నారు. తమకు న్యాయం చేయాలనుంటే ప్రభుత్వం సకాలంలో, సుప్రీంకోర్టు న్యాయవాదితో వాదనలు వినిపించేవారని వాదిస్తున్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శిస్తున్నారు. అసలే ముందస్తు ఎన్నికల బిజీలోఉన్న తెలంగాణ సర్కారుకు 23వేల పాఠశాలల్లోని ఉపాధ్యాయులు ఎలాంటి అల్టిమేటం ఇవ్వనున్నారో వేచిచూడాల్సిందే.
- వనం నాగయ్య
సెల్: 9490099343