Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవినీతి 'నీతి'గా మారిన వేళ మోడి పంద్రాగస్టు ప్రసంగం చేసారు. ఉపన్యాసమంతా సుద్దుల మూటగా సాగింది. పార్లమెంటు సమావేశాలలో అవినీతిని రక్షించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేసిన ప్రధాని, ఎర్రకోట నుండి మాత్రం నీతివాక్యాలు పలికారు. అంబేద్కర్ ఆశించిన ఫలాలు దళితులకు అందాయో లేదో పార్లమెంటులో చర్చించ నిరాకరించిన నేత, ఆగస్టు 15న మాత్రం దళితులను పారిశ్రామికవేత్తలుగా తయారుచేయాలని బ్యాంకులకు ఉచిత సలహా పడేసారు. రైతుల ఆత్మహత్యల ఊసే లేని ఉపన్యాసంలో వ్యవసాయశాఖ పేరు మాత్రం మారుస్తామన్నారు.
నీతి-అవినీతి మాయాజాలం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కూడా వదలలేదు. ఎర్రకోట నుండి ప్రధాని నరేంద్రమోడి చేసిన ఉపన్యాసం, విలువలను కూడా పరిహసించింది. పార్లమెంటులో నోరుమెదపని ప్రధాని, స్వతంత్ర దినోత్సవ ప్రసంగం చేయటంలో మాత్రం రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు ఏ ప్రధానీ మాట్లాడనంత ఎక్కువ సమయం మాట్లాడారు. విదేశాల్లో రాక్‌స్టార్ ఉపన్యాసాలు, ఆగస్టు 15న రికార్డు సమయం మాట్లాడిన ప్రధాని పార్లమెంటులో పలకరెందుకు? ఏమో! పార్లమెంటులో అయితే చాలామంది ప్రశ్నిస్తారేమో! ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలి కదా! విదేశీ ఉపన్యాసాల్లో అయితే చప్పట్లు, ఈలలు, కేరింతలు... ప్రశ్నలడిగేవారూ, నిలదీసే వారే ఉండరు. పంద్రాగస్టు ప్రసంగం గంభీరంగా అందరూ వినటమే తప్ప అడగటం ఉండదు. ప్రధానికి ఈజీ మార్గం బాగా దొరికింది కదా! అందుకే చాలా మాట్లాడారు.
అవినీతి నీతులు
అవినీతి రహిత భారత్ నిర్మిద్దామన్నారు. ఇందుకు చికిత్స పైనుండే ప్రారంభిస్తామన్నారు. 48 గంటల్లోనే ఎంత మార్పు? పార్లమెంటు సమావేశాల సమయమంతా కేవలం ముగ్గురు ముద్దాయిలను రక్షించేందుకు వృధాచేసిన ప్రధానమంత్రేనా ఈ మాటలు మాట్లాడింది? సొంత మంత్రివర్గంలోనే అవినీతి ఆరోపణలెదుర్కొంటున్న మంత్రి సుష్మాస్వరాజ్. మరో ఇద్దరు బిజెపి ముఖ్యమంత్రులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. న్యాయవిచారణకు వారు సిద్ధంగా లేరు. వారిని తొలగించి, విచారణ జరిపేందుకు మోడీ సిద్ధంగా లేరు. ఇందుకే కదా కోట్లాది నిధులు పార్లమెంటు సమావేశాల పేరుతో బండలపాలైంది. ఇంతలోనే ఎంత మాట! చికిత్స పైనుండే ప్రారంభిస్తామన్నారు. సుష్మా కన్నా పైనుండి అనుకోవాలా? అంతసీన్ లేదు. అట్లా చేయాలంటే ఆయనే పదవి నుండి తప్పుకోవాలి కదా! పైగా అవినీతిపరులు రాజీనామా చేయాలంటే, 45 మంది ఎంపీలు 450 మంది హక్కులు హరిస్తున్నారని స్పీకర్ సుమిత్రా మహాజన్ హెచ్చరించారు. 2010లో ఇదే డిమాండు మీద ఒక సెషన్ మొత్తం అడ్డుకొన్న ఎంపీలలో ముందువరుసలో నిలుచున్నవారే ఇప్పుడీ మాట అంటున్నారు. సుమిత్రా మహాజన్, సుష్మాస్వరాజ్‌లు ఆనాడు అగ్రభాగాన వుండి పార్లమెంటును అడ్డుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసాయి. వారి విషయం అట్లా ఉంచితే, అవినీతి చెదలు లాంటిదన్నారు మోడీ. అది నెమ్మదిగా విస్తరిస్తుందన్నారు. చివరకు మొత్తాన్నే కమ్మేస్తుందన్నారు. కానీ తన చుట్టూ తన పరివారంలోనే చెదలు పట్టిన విషయాన్ని మాత్రం దాచిపెడుతున్నారు. తన ఉపన్యాసంలో సమయానికి చికిత్స చేయాలన్నారు. ఆ చికిత్సకే కదా నిరాకరించారు!
వీరతాడుకు అర్హులే!
తన ప్రభుత్వం మీద ఒక్కటికూడా అవినీతి ఆరోపణ రాలేదన్నారు. హవ్వ! నవ్విపోదురు గాక నాకేటి సిగ్గన్నట్టు లేదూ!? అదేమిటంటే సుష్మా, వసుంధరల మీద వచ్చిన ఆరోపణలలో డబ్బు పాత్ర లేదన్నారు. నిధులు దుర్వినియోగం అయితేనే అవినీతి అనాలట! నేరస్థులకు సహాయపడటం అవినీతి కాదట! బిజెపి నిఘంటువులో అది 'నీతి'. అందుకేనేమో రేప్ కేసుల్లో ఉన్నవారిని కూడా తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు! మరి వ్యాపం కుంభకోణం మాటేమిటంటే... అది కాంగ్రెసు కాలం నుండీ నడుస్తున్నదేనని కొట్టిపారేసారు. కాబట్టి కాంగ్రెసు చేసిన అవినీతి బిజెపి కూడా చేస్తే అది అవినీతి కాదు. మైనస్ మైనస్‌తో గుణిస్తే ప్లస్ ఐనట్టు, వీరిద్దరి అవినీతి కలిస్తే 'నీతి' అవుతుందన్న మాట. బిజెపి నిఘంటువులో ఇది మరో కొత్త అర్థం. ఘటోద్గజుడుంటే గ్యారంటీగా వీరతాడు వేసే వాడే...!
ఎక్కడ దాగున్నాయో కదా...
ఇక నల్లధనం వెలికితీయడం సుదీర్ఘప్రక్రియ అని అధికారంలోకి వచ్చిన తర్వాత జ్ఞానోదయం అయ్యిందట! కసరత్తు చేస్తున్నారట! వందరోజుల్లో విదేశాల్లోని నల్లధనం తెచ్చి ప్రతి పేదకుటుంబానికి రూ.15 లక్షలు ఎకౌంట్‌లో వేస్తామన్నారు కదా! ''అవినీతిపై పోరాటానికి మా నిబద్ధతను మేము విలేకరుల సమావేశంలో ప్రదర్శించలేదు. క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టి ప్రదర్శించాం. ఫలితాలు సాధించాం'' అన్నారు మోడీ. ఆ చర్యలేవీ అటు విలేకరులకు, ఇటు ప్రజలకు కనిపించకుండా ఏ క్షేత్రంలో దాగున్నాయో కదా!
మొసలి కన్నీరు!
ప్రధాని సుద్దులకు హద్దుల్లేవు. దేశంలో ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క దళితుడిని, లేదా గిరిజనుడిని లేదా కనీసం ఒక్క మహిళను పారిశ్రామికవేత్తగా తయారుచేయాలన్నారు. తిండికి లేనివారి సంగతి చూడమంటే క్రీమీలేయర్ గురించి మాట్లాడుతున్నారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటే పారిశ్రామికవేత్తల బాగోగుల గురించి చెబుతున్నారు. పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలు పరిష్కరించాలంటే చిత్తశుద్ధి కావాలి. ఎంత కష్టం...! అందుకే... రిజర్వేషన్లతో లాభపడిన కొద్దిమందిని చేరదీసి గాలమేస్తే ఓటు బ్యాంకును వారే పదిలంగా కాపాడుతారు కదా! పదవుల రాజకీయాలకు దగ్గరిమార్గం. కాంగ్రెసు నేర్పిన పాఠం. ఇప్పుడు ఈ కార్యక్రమం కోసం 'స్టార్టప్ అండ్ స్టాండ్ అప్' అంటున్నారు. ఈ ఏడాది అంబేద్కర్ 125వ జయంతి జరుపుకుంటున్న సందర్భంగా ఈ పిలుపు నిస్తున్నానన్నారు. అంబేద్కర్ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా సిపిఎం ప్రతిపాదించిన విధంగా పార్లమెంటులో ప్రత్యేక చర్చ పెట్టియుండాల్సింది. స్వాతంత్య్రానంతర కాలంలో దళితులకు ఏమేరకు మేలు జరిగిందో బేరీజు వేయడానికి సిద్ధపడి యుండాల్సింది. కానీ మోడీ ఇందుకు మాత్రం నిరాకరించారు. ప్రజల దృష్టి మరలించడానికిప్పుడు స్టార్టప్ అంటున్నారు.
ఇంటిపేరు మారుస్తా...
వ్యవసాయశాఖ పేరు మారుస్తారట. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల హస్తరేఖలు మార్చుతారనుకుంటే ఇంటిపేరు మారుస్తామంటున్నాడేమిటని ముక్కుమీద వేలేసుకోవటం రైతుల వంతవుతున్నది. ఇక నుండి వ్యవసాయశాఖ పేరు 'వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ'గా మారుస్తామన్నారు. రైతులు నష్టపోకుండా పరపతి సౌకర్యాలు, ఎరువులు, పురుగుమందుల సబ్సిడీ, విత్తనాలు, గిట్టుబాటు ధర, మార్కెట్ సౌకర్యాల గురించి పట్టించుకోకుండా కేవలం పేరుమారిస్తే సరిపోతుందా? 'ఇంటిపేరు కస్తూరివారు.. ఇంట్లో గబ్బిలాల కంపు' అన్నట్టున్నది మోడీ వ్యవహారం. కార్మికశాఖ యజమానుల శాఖగా పనిచేస్తున్న తీరు చూస్తే పేరు మార్చినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని స్పష్టమవుతోంది. వ్యవసాయంలో ప్రభుత్వ పెట్టుబడులు పెంచితే తప్ప దీనికి విరుగుడు లేదు. కానీ వ్యవసాయాన్ని పెట్టుబడిదారులకు, వడ్డీవ్యాపారులకు వదిలేస్తున్నారు. రైతులను దిక్కులేనివారిని చేస్తున్నారు. అసలు విషయం నుండి రైతుల దృష్టి మరల్చడానికిప్పుడు రైతుల వ్యక్తిగత సమస్యల మీద దృష్టిసారిస్తామన్నారు. రైతులను ఆత్మహత్యలకు, వ్యవసాయం వదిలేయడానికి పురికొల్పుతున్న సమస్యలేవీ వ్యక్తిగతం కాదు.
పరివారం ప్రేలాపనలు
కులతత్వం, మతతత్వం గురించి కూడా నీతులు చెప్పారు. గుజరాత్ మారణహోమాన్ని జనం మరచిపోయారను కున్నారేమో! మోడీ ప్రధాని అయిన తర్వాత దేశంలో 900కు పైగా మత ఘర్షణలు జరిగాయి. బిజెపికి ఓటేయని వారు పాకిస్తాన్ పోవాలని, బిజెపికి ఓటేసేవారే రాముడిపుత్రులని, ఇతరులు అక్రమ సంతానమని నీచ ప్రేలాపనలు చేసినవారు బిజెపి నేతలే కదా! పైగా సాథ్వీ నిరంజన్ జ్యోతి కేంద్ర మంత్రి కూడా. గాంధీని హత్యచేసిన గాడ్సేకు ఆలయం నిర్మించడానికి స్థలం కేటాయించాలని మోడికి ఆర్జీ ఇచ్చుకున్న హిందూ సంస్థ సంగతేమిటి? ముగ్గురు ఖాన్‌ల సినిమాలను బహిష్కరించాలన్న సాధ్విప్రాచీ మాటలు మోడీకి వినిపించలేదా? దేవుళ్ళు ఉండేది ఆలయాల్లోనే తప్ప చర్చిలోగానీ, మసీదులోగానీ కాదన్న సుబ్రహ్మణ్యంస్వామి ఎవరు? దేశంలో మైనార్టీలు లేరనీ, పుట్టుకతోనే అందరూ హిందువులేనని ఆరెస్సెస్ జాతీయనేత దత్తాత్రేయ హొస్పలే అనలేదా? ముస్లింలకు ఓటు హక్కు రద్దు చేయాలని శివసేన నేత రావత్ అన్నారు. మరొకాయన బీఫ్ నిషేధించాలన్నారు. కొన్ని రాష్ట్రాలలో బిజెపి ఈ నిషేధం ప్రారంభించింది కూడా. యోగా అవసరం లేదన్న వారు దేశం విడిచి వెళ్ళిపోవాలని బిజెపి ఎంపి ఆదిత్యనాథ్ అన్నారు. ఇట్లా చెబుతూపోతే బిజెపి, ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్ నేతల కవ్వింపు చర్యలకు హద్దుల్లేవు. మతవైషమ్యాల ఎజెండాతోనే అమిత్‌షా గుజరాత్‌లో మోడీని ముఖ్యమంత్రిగాను, దేశానికి ప్రధానిగాను చేయగల్గారు కదా! అందుకేనేమో ఈ బాధ్యత అమిత్‌షా మీద పెట్టి, మోడీ మాత్రం అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు.
హైజాకింగ్...
స్వచ్ఛభారత్‌ను మహాత్మునికి అంకితం చేస్తున్నానన్నారు ప్రధాని. గాంధీని హత్య చేసిన సంస్థలో ప్రచారక్ అయిన మోడీ, గాడ్సేను పొగిడే నేతలకు నేత అయిన మోడీ, గాంధీ పేరును హైజాక్ చేసే ప్రయత్నమిది. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికి, మతసామరస్యానికి గాంధీ ప్రతీక. ఈ రెండింటిలోను గాంధీకి పూర్తి విరుద్ధంగా వ్యవహరించే మోడీ, ఇప్పుడు గాంధీని కేవలం వీధులు శుభ్రం చేసేచర్యకు ప్రతీకగా దిగజార్చుతున్నారు. గాంధీ దళితవాడల్లో వీధులు శుభ్రం చేసిందికూడా జాతీయోద్యమ బాటలో వారిని కదిలించేందుకేనన్న విషయం మరుగుపరుస్తున్నారు. స్వార్థరాజకీయాలకు ఇది పరాకాష్ట సుమా!
టీమిండియా ఎవరు?
టీం ఇండియా గురించికూడా మాట్లాడారు. ఎవరా టీమిండియా? విదేశీ పర్యటనలు చూస్తే అర్థమవుతుంది. అంబానీలు, ఆదానీలు, ఇతర పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకే తప్ప విదేశాంగమంత్రికి కూడా చోటు లభించదు. మోడీ టీమ్ ఎవరో గత పార్లమెంటు ఎన్నికలకు ముందే తేలిపోయింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దేశంలోని బడా పారిశ్రామికవేత్తలంతా విలేకరుల సమావేశంలోనే మోడీని ఆకాశానికెత్తారు. 'రాజులకు రాజు మోడీ', 'మనుషుల్లో దేవుడు మోడీ' అని అంబానీ చేసిన పొగడ్తలు తెలుగు సినిమా పాట 'అన్న షర్టేస్తే మాస్, షూ వేస్తే మాస్' గుర్తుకు వస్తుంది. ఈ భజనపరులే కదా మోడీ టీమిండియాలో సభ్యులు. అందుకే కార్మిక చట్టాలను వారు కోరుకున్నట్టు మార్చడానికి, కోరిన రాయితీల వరాలు కుమ్మరించడానికీ వెనుకాడటం లేదు. కానీ వీరినే 125 కోట్ల ప్రజల ప్రతినిధులంటున్నారు మోడీ. పార్లమెంటు సభ్యులు ఆయన దృష్టిలో డమ్మీలు... పార్లమెంటు వృధా వేదికే! అందుకేనేమో ఆర్డినెన్సులకిచ్చిన ప్రాధాన్యత పార్లమెంటుకు లేదు.
ఎస్.వీరయ్య