Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అది 1947 సెప్టెంబరు రెండోవారం. అప్పటి వరకు కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కావాలన్న గాంధీ, నెహ్రూ, అబ్దుల్లాల ఆకాంక్ష పట్ల సర్దార్ వల్లభారుపటేల్ స్పష్టమైన వైఖరి తీసుకోలేదు. పైగా సెప్టెంబరు 13న తొలి రక్షణ మంత్రి బల్దేవ్‌సింగ్‌తో మాట్లాడుతూ ''కాశ్మీర్ వేరే డొమినియన్‌లో కలవాలని నిర్ణయించుకుంటే ఆ పరిస్థితులను నేను అర్థం చేసుకోగలను'' అని కూడా అన్నాడు. దాదాపుగా 1946-47 మధ్య కాలంలో రెండేండ్ల పాటు జరిగిన చర్చల్లో హిందువులంతా ఒక దేశంగానూ ముస్లింలంతా మరో దేశంగానూ ఏర్పడాలన్న భావన అటు బ్రిటిష్ పాలకులు, ఇటు తాత్కాలిక ప్రభుత్వంగా ఏర్పడిన కాంగ్రెస్, హిందూమహాసభ, ముస్లిం లీగ్ నాయకుల్లో వేళ్లూనుకుపోయింది. గత రెండేళ్లలో బెంగాల్, పంజాబ్‌లలో జరిగిన మతమారణహౌమం కండ్లారా చూసిన ప్రజలు కూడా అదే అభిప్రాయాన్ని క్రమక్రమంగా అంగీకరించే స్థితికి చేరుకున్నారు.
అదేరోజు అంటే సెప్టెంబరు 13న జూనాఘడ్ సంస్థానాన్ని పాకిస్థాన్‌లో విలీనం చేయటానికి రాజు సిద్ధపడినట్టు వార్తలొచ్చాయి. అధిక సంఖ్యలో హిందు ప్రజలున్న జూనాఘడ్ సంస్థానానికి రాజు ముస్లిం కాగా అధిక సంఖ్యలో ముస్లిం ప్రజలున్న కాశ్మీర్ సంస్థానానికి రాజు హిందూ. దీంతో ఆగ్రహించిన పటేల్ కాశ్మీర్‌ను భారత్‌లో కలపటానికి ఉన్న మార్గాలను అన్వేషించటం ప్రారంభించాడు. ఢిల్లీ నుంచి పంజాబ్ మీదుగా జమ్మూ వరకు భారత ప్రభుత్వ టెలిగ్రాఫ్ లైన్లు, రహదారి నిర్మాణం, ఇతర సదుపాయాలు ఏర్పాటు ముమ్మరం చేయాలని రక్షణమంత్రితో కలిసి ఆదేశాలిచ్చారు. పంజాబ్‌హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న మహాజన్‌ను కాశ్మీర్ ప్రధానిగా నియమిస్తూ ఆదేశాలు వెళ్లాయి. నెహ్రూ, పటేల్‌లు సంప్రదించుకున్న తర్వాత జైల్లో ఉన్న కాశ్మీర్ సింహం షేక్ అబ్దుల్లాను విడుదల చేసి చర్చల కోసం ఢిల్లీ పిలిపించాడు. కాశ్మీర్‌లో మెజారిటీ ప్రజలు ముస్లింలు కాటం, రాజు హరిసింగ్‌కు వ్యతిరేకంగా ప్రజాతంత్ర పరిపాలన కోసం గత రెండు దశాబ్దాలుగా సాగుతున్న ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తిగా షేక్ అబ్దుల్లాకు ప్రజల్లో అత్యంతగౌరవం ఉన్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. దాంతో కాశ్మీర్‌లో పటేల్ నాయకత్వంలో తెరతీయనున్న వ్యూహానికి అబ్దుల్లా సహాయ సహకారాలు, అబ్దుల్లా రూపంలో సంస్థాన ప్రజల సహాయ సహకారాలు అవసరమని భావించటమే ఈ చర్యల అంతరార్థం.
ఓవైపు షేక్ అబ్దుల్లా సహాయసహకారాలు ఆశిస్తున్నప్పటికీ హరిసింగ్ విషయంలో పటేల్ వైఖరి ఏమీ మారలేదు. అన్ని సంస్థానాలకు హామీ ఇచ్చినట్టే హరిసింగ్ గుర్తింపు, గౌరవం, ఆస్తులకు రక్షణ కల్పించాలన్న తన వర్గ వైఖరి నుంచి పటేల్ వెనకంజ వేయలేదు. ఈ కారణంగానే అక్టోబరు 2న హరిసింగ్‌కు కబురు పంపుతూ ''అబ్దుల్లాను చర్చల నిమిత్తం ఢిల్లీ ఆహ్వానించాం. అబ్దుల్లా నుంచి మీకు ఎదురవుతున్న సమస్యలేమిటో వెల్లడిస్తే వాటిని కూడా (ఆయనతో) చర్చించి మీకు కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. దానికి బదులుగా మీరు భారత ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమోదించాల''ని కబురు పంపాడు. ఈ చర్చలు సంప్రదింపులు తర్వాత మరో కబురు పంపుతూ షేక్ అబ్దుల్లాను ప్రభుత్వంలో భాగస్వామిని చేయాలని సూచన కూడా చేశాడు పటేల్. ఇక్కడ కనిపించే మౌలిక సూత్రం ఒక్కటే. భారతదేశంలో కాశ్మీరీ ప్రజలు కూడా భాగమేనన్న విశ్వాసం కల్పించకుండా కాశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం చక్కబెట్టేదేమీ లేదన్న సూత్రాన్ని పటేల్ నెహ్రూ ద్వయం అర్థం చేసుకుంది కాబట్టే కాశ్మీరీ ప్రజలకు ప్రతినిధిగా ఉన్న షేక్ అబ్దుల్లాను కాశ్మీర్ పరిపాలనలో భాగస్వామి చేసుకోవాలన్న నిర్ణయం ఈ పరిపాలన దక్షతలో భాగమే. సర్దార్ పటేల్‌ను ఘనంగా కీర్తించే ప్రస్తుత పాలకులకు ఈ పాలనా దక్షత లోపించిందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇంతలో అక్టోబరు 22న ఐదువేలమంది స్థానిక గిరిజన తెగకు చెందిన సైనికులతో పాకిస్థాన్ చొరబాటుకు సిద్ధమైంది. నేటి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఐదువేల మంది చొరబాటుదారులను అడ్డుకోవటానికి మిగిలిన భారత సైన్యం బ్రిగేడియర్ రాజీందర్‌సింగ్ నాయకత్వంలోని 150మంది మాత్రమే. వీళ్ల శవాలు మీదుగా చొరబాటుదారులు బారాముల్లా ప్రవేశించారు. శ్రీనగర్ ప్రవేశానికి బారాముల్లా సింహద్వారం. దాన్ని స్వాధీనం చేసుకుంటే శ్రీనగర్ వెళ్లే సరఫరాలన్నింటినీ అడ్డుకోవచ్చు. త్వరలోనే శ్రీనగర్‌ను వశం చేసుకోవచ్చు అన్నది పాక్ వ్యూహం. ఇంత జరుగుతున్నా హరిసింగ్ సైన్యం నుంచి భారత ప్రభుత్వానికి అధికారికంగా దాడి విషయం 24 తేదీ సాయంత్రానికి గానీ చేరలేదు. 25 ఉదయం జరిగిన రక్షణ వ్యవహారాల క్యాబినెట్ ఉపసంఘం చొరబాటుదారులను తిప్పికొట్టాలని తీర్మానించింది. అయితే శ్రీనగర్ వరకు సైన్యాన్ని చేర్చేలోపు జరగబోయే భీబత్సం గురించే అందరి భయాందోళనలు. దాదాపు హరిసింగ్ అస్త్రసన్యాసం దశకు చేరుకున్నాడు. ప్రధానిగా ఉన్న మహాజన్ ఎటువంటి ఆదేశాలు ఇచ్చే స్థితిలో లేడు.
ఈ పరిస్థితుల్లో నెహ్రూ నివాసంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి పటేల్, నెహ్రూ, రక్షణమంత్రి బల్దేవ్‌సింగ్‌లతో పాటు కాశ్మీర్ నుంచి అబ్దుల్లాను కూడా ఆహ్వానించారు. భారత సేనలు శ్రీనగర్ చేరేలోగా పాక్ చొరబాటుదారులను నిలువరించి ఉంచటం ఎలా అన్నదే ఎజెండా. ఎట్టకేలకు 27 సాయంత్రానికి 329 మంది పదాతిదళం శ్రీనగర్ చేరారు. కానీ విమానాశ్రయం ఎవరి స్వాధీనంలో ఉందో అర్థం కాని స్థితి. 2000 మంది భారత సైన్యాలు కాశ్మీర్‌లోయకు చేరేసరికి నవంబరు వచ్చేసింది. కాశ్మీర్ లోయలో చొరబాటుదారులు చొచ్చుకొచ్చినంత దూరం హిందూ ముస్లిం సిక్కు వ్యత్యాసం లేకుండా అకృత్యాలకు పాల్పడ్డారు. లైంగికదాడులు లెక్కే లేదు. నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులను బహిరంగంగా కాల్చేశారు. అయినా మొక్కవోని ధైర్యంతో భారత సైన్యాలు నిర్ణయాత్మక పాత్ర పోషించే వరకు కాశ్మీర్ పాక్ ప్రేరేపిత చొరబాటుదారుల వశం కాకుండా ప్రాణాలొడ్డి సాయుధలై కవచంలా నిలిచారు.
అక్టోబరు 26న ఢిల్లీలో జరిగిన సమావేశంలో షేక్ అబ్దుల్లాను ప్రధానిగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అప్పటికే చొరబాటుదారులతో హౌరాహౌరీ తలపడుతున్న కాశ్మీరీ ప్రజలకు ఈ నిర్ణయం ఉత్సాహం నింపింది. దాదాపు పాతికవేల మందిని సమీకరించి గెరిల్లా సైన్యాన్ని నిర్మించింది నేషనల్ కాన్ఫరెన్స్. హరిసింగ్ సైన్యం అస్త్రసన్యాసం చేయటంతో ఆయుధాగారాలు నేషనల్ కాన్ఫరెన్స్ గెరిల్లాలు స్వాధీనం చేసుకున్నారు. చొరబాటుదారులు మూడు కిలోమీటర్ల దూరంలో కాచుకుని ఉన్నప్పటికీ శ్రీనగర్‌లో శాంతిభద్రతలకు ఎటువంటి సమస్యా రానీయలేదు. క్రమంగా ఢిల్లీ పరిణామాలు చకచకా జరుగుతున్న వేగానికి తగ్గట్టుగా ప్రజలు సాయుధులై చొరబాటుదారులపై ఎదురుదాడి మొదలుపెట్టారు. నవంబరు 3న శ్రీనగర్ విమానాశ్రయాన్ని ఆక్రమించుకున్న పాక్ చొరబాటుదారులపై తిరగబడింది కాశ్మీరీ ప్రజలే అన్న చారిత్రకవాస్తవం అధికారిక నివేదికల్లో ఎక్కడా కనిపించదు. 1948లో కమ్యూనిస్టుపార్టీ ప్రచురించిన కరపత్రంలో ఈ విషయాలు నమోదయ్యాయి. శ్రీనగర్ విమానాశ్రయంలో ఫిరంగి మోతలు చెవులు దిబ్బుళ్లు పెడుతున్నా శ్రీనగర్‌లో పౌరజీవనం మాత్రం యధావిధిగా సాగిపోయింది. కాశ్మీరీ ప్రజలు హరిసింగ్ సైన్యం కంటే నేషనల్ కాన్ఫరెన్స్ రూపొందించిన గెరిల్లా సైన్యాన్నే ఎక్కువగా విశ్వసించారని, భారత వాయుసేన శ్రీనగర్ గగనతలాన్ని ఆక్రమించి పాక్ చొరబాటుదారులపై దాడిని విజయవంతం చేసేవరకు ఈ చొరబాటుదారుల నుంచి కాశ్మీర్‌ను కాపాడింది షేక్ అబ్దుల్లా నిర్మించిన ఈ సైన్యమే అన్న వాస్తవాన్ని గుర్తించటానికి మనోధైర్యంతో పాటు చారిత్రకవాస్తవాల పట్ల నిజాయితీతో కూడిన దృక్ఫథం కూడా కావాలి.
పాక్ చొరబాటుదారులను తరిమికొట్టిన తర్వాత అక్టోబరు 26న పటేల్ సమక్షంలో జరిగిన అవగాహన ప్రకారం జమ్ముకాశ్మీర్ పరిపాలన బాధ్యతలు షేక్ అబ్దుల్లాకు అప్పగించాలని, ఆయన్ను ప్రధానిగా నియమించాలని కోరుతూ జవహర్‌లాల్ నెహ్రూ డిసెంబరు 2న మహారాజు హరిసింగ్‌కు లేఖ రాశారు. ఈ విషయంపై హరిసింగ్‌తో స్వయంగా పటేల్ రాయబారం నడిపారన్నది చారిత్రకవాస్తవం.
- కొండూరి వీరయ్య