Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యాయవ్యవస్థ చర్యలు రాజ్యాంగ ఆధారంగా ఉండాలి. మెజారిటీ కోరికల మేరకు కాదు. న్యాయవ్యవస్థ పాలకపార్టీల, ప్రభుత్వాల ప్రతిరూపమైనప్పుడు తన ప్రత్యేకతను, స్వయంప్రతిపత్తిని కోల్పోయి ప్రభుత్వ ఉపాంగమవుతుంది. అయోధ్య తీర్పు న్యాయశాస్త్ర రాజనీతిజ్ఞతో పిరికితనమో చెప్పటం కష్టమని న్యాయవాది సంతోష్ హెగ్డే వ్యాఖ్యానించారు. పురుష ప్రమేయం లేకుండా పాయసం తిన్న కౌసల్యకు అయోధ్య అత్తింటిలో రాముడు పుట్టాడు. వివాదస్థలం హిందువుల ఆరాధ్య దేవుడు రామునిదే. ఇది భక్తి విశ్వాస తీర్పు. వివాదస్థలం ప్రభుత్వానిది. ప్రభుత్వం దావా వేయలేదు. అడగనివారికి పొందే హక్కులేదు. ఇది న్యాయనిర్వీర్యం. మసీదులో రాముని బొమ్మ పెట్టటం అపవిత్ర చర్య, మసీదు కూల్చివేత ఘోర చట్ట ఉల్లంఘన అంటూనే మొత్తం 2.77ఎకరాల స్థలం రామునికి ఇచ్చారు.
గుడి కట్టటానికి మూడునెలల్లోపు ప్రభుత్వం ధర్మసంస్థ ఏర్పరచాలన్నారు. బొమ్మకు స్థల స్వాధీనత కుదరదు కాబట్టి వ్యాజ్యం వేసిన సంస్థకు స్థలం అప్పజెప్పవచ్చు. గుడి కట్టడానికి కోర్టుఎందుకు ఆదేశించాలి? కూల్చిన మసీదు నిర్మాణానికి ఎందుకు చొరవ చూపలేదు? అధికరణ 142 ప్రకారం సంపూర్ణ న్యాయం అందించటానికి స్థలహక్కు నిరాకరించబడిన నిర్మోహి అఖారాకు ట్రస్టులో స్థానం కల్పించమని కోర్టు చెప్పింది. మసీదు పునర్నిర్మాణ ఖర్చు కూల్చినవారు భరించాలని ఎందుకు చెప్పలేదు? ఈ ప్రభుత్వ భూమిలో ప్రజాప్రయోజన సంస్థలు నిర్మించమని ప్రభుత్వాన్ని ఆదేశించటానికి ఈ సంపూర్ణ న్యాయ నిబంధన నిర్దేశించదా? తీర్పు తమకు వ్యతిరేకంగా ఉంటుందన్న అనుమానమే సంఘీయులకు రాలేదు. తీర్పుకు ముందే ఆలయనిర్మాణ కాలసారికను ప్రకటించారు. తీర్పులు అనుకూలంగా రావను కున్నప్పుడు మాకు కోర్టులపై నమ్మకం లేదు. విశ్వాసాలే ముఖ్యమన్నారు. ఇప్పుడు తీర్పుతీరు తెలిసి శాంతి సామరస్యతలు పాటించమని బాధితులకు సూచించారు. అయోధ్య తీర్పు ఆమోదించినవారు శబరిమల తీర్పుపై ఎందుకు గొడవ చేశారు? బీజేపీ కోరిన న్యాయాన్నే న్యాయస్థానాలు అందించాయని ఒక బీజేపీ నాయకుడు అన్నారు. లౌకికవాదు లంతా తీర్పును గౌరవిద్దాం అన్నారు.
చట్ట ప్రకారం మసీదు లోపలి భాగం ముస్లింలకు, రాంచబూతర, సీతా రసోయి ఉన్న బయటి ప్రాంతం హిందువులకు ఇవ్వాలి. ఈ తీర్పు పాలక మెజారిటీకి నచ్చదు. తీర్పుశాంతి సహచర్యలకు భంగం కాకుండా ఉండాలి కదా. ''తీర్పు మనకు అనుకూలంగా వచ్చి ఉంటే కొత్త మసీదు నిర్మాణం కాదు పాతమసీదులు కూలేవి. దేశం ముస్లింల శ్మశానమయ్యేది. ఈ తీర్పే మంచిది.'' అని యువకులు పెద్దలకు నచ్చచెప్పారు. ఈ తీర్పు మితవాదం వైపు మొగ్గింది. లౌకికత్వానికి చట్టనిబంధనలకు గట్టి దెబ్బ. మసీదును రక్షిస్తామని తనకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కి రాజ్యాంగ విరుద్ధంగా మసీదు కూల్చినవారికే మసీదు స్థలం కట్టబెట్టింది. చట్టవ్యతిరేక చర్యలనే గౌరవించటం, బాధితులకు కాక నేరస్తులకే లబ్ధి చేకూర్చటం తీర్పు వైరుధ్యం. ''మసీదు కూల్చివేతకు మద్దతు ఇచ్చిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలను కేంద్రం రద్దు చేసింది. ఈ రద్దు సమంజసమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. లౌకికత్వం రాజ్యాంగ ప్రాథమిక లక్షణమంది. ఆ కోర్టే నేడు న్యాయ, పాలనా వ్యవస్థల విభజన రేఖను చెరిపేసింది.'' సుప్రీం కోర్టు న్యాయవాది కాళీశ్వరం రాజ్ బాధపడ్డారు. తీర్పు ఏకగ్రీవం కావడం బాధాకరం. ఏకాభిప్రాయంలో సమన్యాయం, నిష్పక్షపాతం ఉంటాయన్న నమ్మకం లేదు.
ముస్లింల యాజమాన్యాన్ని నిరూపించే రెవెన్యూ రికార్డులు, రాజపత్ర ప్రచురణలను కోర్టు పరిశీలించలేదు. హిందువుల విశ్వాసాలను, మసీదును కూల్చిన మహంతుల నోటిమాటలను ఆమోదించింది. రామాయణం, స్కంధ పురాణం, రామచరిత మానస్ లాంటి హిందూ పురాణాలను రామ జన్మభూమి రుజువులుగా ఉటంకించింది. వ్యక్తిగత ఆధ్యాత్మిక విశ్వాసాలు ఆస్తుల స్వాధీనతల రుజువుగా ఆమోదించటం బహుచెడ్డ పూర్వామోదం (జూతీవషవసవఅ్). 12వ శతాబ్దం క్రితం ఏదో కట్టడం ఉన్నదన్న సందేహాత్మక నివేదికను నమ్మిన కోర్టు 1528లో కట్టబడి మన కండ్లముందే 27ఏండ్ల క్రితం కూల్చబడ్డ మసీదు ఉనికిని ఎందుకు పరిగణించలేదు? ''జన్మస్థలానికి'' దూరంగా మసీదుకు స్థలం ఇవ్వమని హైందవులు ఎప్పటి నుండో వాదిస్తున్నారు. ఈ 2.77 ఎకరాలు మాకు ఇవ్వండి. అయోధ్య బయటికి మసీదును మేమే మా ఖర్చులతో మారుస్తామని 1980లో ప్రస్తావించారు. ఈ తీర్పు పరిహారం లేకుండానే మసీదు స్థలాన్ని కూల్చినవారికిచ్చింది. నేరస్తులకు మహుమతి ముస్లింల నెత్తిన మసీదు నిర్మాణ ఖర్చు.
''మసీదు నిర్మాణ కాలం నుంచి అంతరాయం లేకుండా నమాజ్ జరగలేదు. 1856-57 నుంచి మసీదు బయటి భాగంలో హిందువులు ఎడతెరపి లేకుండా ప్రార్థన చేస్తున్నారు. లోపలి 3 గుమ్మటాల మసీదు ప్రదేశం తమదేనని వాదిస్తున్నారు. ఈ అంశాలు హిందువుల స్థల స్వాధీనతను బలపరుస్తున్నాయి. ముస్లింలు ప్రస్తావించిన ప్రతికూల స్వాధీనతను తిరస్కరిస్తున్నాయి.'' తీర్పులో ఒకభాగం. ముస్లింల మసీదు ప్రవేశాన్ని మహంతులు అడ్డుకున్నారు. ఏ కారణం చేతనైనా ఒక నిర్మాణాన్ని కొంతకాలం వాడుకోలేకపోతే దాని యాజమాన్య హక్కులు కోల్పోతామా? పరుల భవనాలు మనవని గొడవచేసి, వాదించి, వ్యాజ్యం నడిపితే అవి మనవైపోతాయా? పూజలు చేయని ఎన్నోగుళ్లున్నాయి. వాటిని ప్రభుత్వం ఎందుకు స్వాధీనపరచుకోదు? ఇవి న్యాయశాస్త్రం తెలియని సామాన్యుని సందేహాలు.
''1856-57 నుంచి కాకున్నా 1949 నుంచి అనగా మన రాజ్యాంగం అమలు కాక ముందు నుంచి అక్కడ నమాజ్ చదువుతున్నారు. నమాజ్ చదివిన స్థలం మసీదుతో సమానం. రాజ్యాంగ ప్రాథమిక హక్కు మతస్వేచ్ఛను ఈ తీర్పు తిరస్కరించింది. నిన్నటి నిజాన్ని కాదని లక్షల ఏండ్ల నాటి స్థల యాజమాన్యాన్ని కోర్టు ఎలా నిర్ణయించగలదు? మందిర్, మసీదు, చర్చి, శిక్కు, బౌద్ధ జైన మందిరాల స్థలాల తీర్పులు కోర్టులు ఇవ్వటం మొదలు పెడితే చాలా గుళ్ళు, మసీదులు, చర్చిలు, స్థూపాలను కూల్చాలి రాముడు ఎవరో చెప్పటం కోర్టు బాధ్యత కాదు. ఉన్నవాటిని రక్షించటం కోర్టు విధి. మసీదు ఉండటం దాన్ని కూల్చటం అందరికీ తెలుసు. అందుకే కదా మసీదుకు ఐదెకరాల భూమి కేటాయించమన్నారు. అక్కడ కడితే మసీదు కట్టాలి. లేదంటే విద్యాలయం, ఆస్పత్రి నిర్మించాలి.'' అని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి అశోక్ కుమార్ గంగూలీ అన్నారు. పురావస్తుశాఖ తొలి పరిశోధనల్లో మసీదు కింద ఎలాంటి నిర్మాణ అవశేషాలు దొరకలేదు. 2003 నివేదిక వివాదాస్పదమైంది. మసీదు కింద ముస్లిం కట్టడం కానిదేదో ఉందని కొందరు నివేదించారు. మసీదు కింద పాత మసీదుల అవశేషాలే ఉన్నాయని కొందరు ధ్రువీకరించారు. కోర్టు మొదటి అభిప్రాయాన్ని స్వీకరించి రెండవ అభిప్రాయాన్ని పట్టించుకోలేదు. మసీదు ఉంటే దాన్ని కూల్చి గుడికి ఇచ్చేవారా?
తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తే రాజకీయ రాక్షసం, కళేబర పూజలు మొదలవుతాయని ముస్లింల భయం. అందుకే మౌనమే మేలనుకున్నారు. హిందువులకు ''రామజన్మ స్థలంలో'' రామాలయం విజయంగా కనిపించవచ్చు. పాలకులకు ఇది హైందవ మత భావాలను, ముస్లింల భయాలను రాజకీయాలకు వాడుకునే మహా అవకాశం. మసీదు స్థలాన్నే మాకిచ్చినపుడు మసీదుకు స్థలం ఎందుకు? దీన్ని సవాలు చేస్తామని హిందూ మహాసభ ప్రకటించింది. ప్రత్యేక ట్రస్ట్ అవసరం లేదు. మేమే గుడి కడతామని సంఫ్‌ు సంస్థలు ప్రధానికి విన్నవించాయి. మసీదు కూల్చివేతలో సహా నేటివరకు మరణించిన కరసేవకులను అమరవీరులుగా ప్రకటించి వారికి పింఛను వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం, ఉద్యోగాలు ఇవ్వాలని, కరసేవకులపై కేసులు ఎత్తేయాలని ప్రభుత్వాన్ని కోరింది. కరసేవక ప్రాతినిధ్య పాలకవర్గం హిందూ మహాసభ కోర్కెలు తీర్చినా ఆశ్చర్యంలేదు. అనేక కేసుల్లో ముస్లింలకు కోర్టులు యిచ్చిన పరిహారాలను బీజేపీ ప్రభుత్వాలు చెల్లించలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నేతలిద్దరూ మసీదు కూల్చివేత సూత్రదారులే. మందిర నిర్మాణ బూచీని రాజకీయలద్ధికి వాడుకున్నవారే. ముస్లింలకు భూమి కేటాయిస్తారన్న నమ్మకం లేదు. అద్వానీ మొదలెట్టిన మతతత్వ పోటీ దుర్మార్గాలకు ఇది కొనసాగింపు. మతోన్మాదానికి అంతం కాదు. వేల మసీదుల స్వాధీనానికి ఆరంభం. ఈ విషయాన్ని సంఫ్‌ు ప్రధాన ప్రచారక్ భగవత్ దాటేసినా విశ్వహిందూ పరిషత్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆలోక్ కుమార్నొక్కి చెప్పారు. భారతమత మైనారిటీలకు ఆధిపత్య దురహంకార మతోన్మాద పాలనను నిలువరించే తమ అభిరుచుల రక్షించే న్యాయవ్యవస్థ
- సంగిరెడ్డి హనుమంతరెడ్డి అవసరముంది.
సెల్: 9490204545