Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవావరణ వ్యవసాయ మార్గదర్శి....వెంకట్ (1923-2011)
తొలకరి జల్లులు కురియంగా పుడమితల్లి పులకించంగా
కారుమబ్బులూ కమ్మంగా కరువుకోరలూ తొలగంగా
జోడెడ్లు కట్టుకోని కాడినాగళ్ళతోని బీడు భూములు దున్నబోదమా
పాడీపంటలతోని పల్లెసల్లంగుండని నేలాతల్లిని వేడుకుందమా
నేలాతల్లిని వేడుకుందమా మన దుక్కులల్ల ఇత్తులేసుకుందమా ||తొల||
జానపదంతో మమేకమయిన ఒకప్పటి పల్లె జీవితం. వ్యవసాయమంటే నేల, వాన, పశువుల సమూహం. వీటిని వందల సంవత్సరాలపాటు కాపాడిన సమూహాలు. వ్యవసాయమంటే కరువు, ఆకలిమంటలు, క్షామాన్ని దరిచేరనీయకుండా కాపాడిన విధానం. కానీ ఇప్పుడు ఆధునిక వ్యవసాయం పేరుతో వచ్చిన విధానాలు దిగుబడులనయితే పెంచాయి కానీ ఆకలిని మాత్రం నిర్మూలించలేకపోయాయి. పైగా నేలసారాన్ని, సహజ వనరులను దారుణంగా దెబ్బతీశాయి. వ్యవసాయానికి ఎంతో ముఖ్యవనరైన నేల శాశ్వతంగా నిస్సారమయ్యే పరిస్థితి ఏర్పడుతుంటే వస్తున్న దారుణ పరిణామాలను మనం రైతు ఆత్మహత్యల రూపంలో చూస్తున్నాం. పల్లె కనిపించని కుట్రలతో కన్నీరు పెడుతోంది. ఒక విషవలయంగా వ్యవసాయం మారటం మన కళ్ళముందున్న వాస్తవం. దీనికి పరిష్కారాన్ని ముక్కలు ముక్కలుగా ఒకదానితో ఒకటి సంబంధం లేనివిగా చూడకూడదు. దీనికి అసలు సమస్య మూలాల్లోకి వెళ్ళాలి. సహజసిద్ధంగా భూమిసారాన్ని పెంచే పద్ధతులను అధ్యయనం చేయాలి. ఆచరణలోకి తీసుకురావాలి. ప్రత్యామ్నాయ పద్ధతుల గురించి వ్యవసాయ సమూహాలే కాదు, వ్యవసాయంతో అనుసంధానమైన వినియోగదారులు కూడా తప్పనిసరిగా ఆలోచించితీరాలి. ప్రకృతి సహజంగా ఏర్పడాల్సిన సారవంతమైన భూములు, ఆరోగ్యకరమైన సమాజం కోసం కృషి జరగాలి. అలాంటి ఒక ప్రత్యామ్నాయ విధానంలో మూడు దశాబ్దాలపాటు నిశ్శబ్దంగా పనిచేసి మనమధ్యలోనే వుంటూ విలువైన జ్ఞానసంపదను అందించి 88ఏండ్ల వయస్సులో మరణమనే జీవనచక్రంలో ఇమిడిపోయిన ఒక అసాధారణ వ్యక్తి గురించి ఇక్కడ తెలుసుకుందాం.
సాదాసీదా జీవితం, అనంతమైన విజ్ఞానం. మార్క్సిజం, సాహిత్యం, వ్యవసాయం ఈ మూడింటిని ఆయన విస్తృతంగా అధ్యయనం చేశారు. వృత్తిపరంగా వైద్యసంబంధిత రంగంలో పనిచేశారు. 60ఏండ్ల వయస్సులో పర్మాకల్చర్ విధానానికి ఆద్యుడైన బిల్ మాలిసన్ (ఆస్ట్రేలియా) పరిచయం, స్నేహం ఆయన జీవితంలోని చివరి మూడు దశాబ్దాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. పర్మాకల్చర్ (పర్మనెంట్ అగ్రికల్చర్ అన్న రెండు పదాలను కలిపినది) విధానాన్ని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఒక వ్యవసాయ ప్రయోగ క్షేత్రాన్ని దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ సహకారంతో రూపొందించిన వ్యక్తి. దీనితో పాటు చుట్టుపక్కల గ్రామాలలోని బాల్వాడీలలో వారి పోషకాహార భద్రతకు పెరటితోటల పెంపకాన్ని రూపొందించారు. చిన్నవి, తక్కువే అయినప్పటికీ వ్యవసాయాన్ని ప్రేమించేవారు, తమ జీవనవిధానంగా మార్చుకున్నవారు, తెలుసుకోవాలనుకునేవారు జీవితకాలం దాచుకోదగ్గ కాదు పంచుకోదగ్గ కొన్ని పుస్తకాలను అందించారు. అందులో కొన్ని: నూతన వ్యవసాయం.. పర్మాకల్చర్....; వాటర్‌షెడ్ అభివృద్ధి ఒక సమాలోచన; దిబ్బ ఎరువు తయారీ...సేంద్రియ వ్యర్థ పదార్ధాల తిరిగి వినియోగం. మంచిపుస్తకం ప్రచురణల ద్వారా ఇవి అందుబాటులో వున్నాయి.
ఇంతకీ ఎవరీయన? పర్యావరణానికి హానికలిగించకుండా, జీవావరణ సూత్రాలతో వ్యవసాయం చేస్తున్న ఎంతోమందికి ఆయన స్నేహితుడు, మార్గదర్శి, గురువు. జన్మత: తమిళుడు, ఎన్నో తరాలక్రితమే సికిందరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆయనే పర్మాకల్చర్ వెంకట్. వ్యవసాయం లాభసాటిగా వుండటం గురించి గానీ, ఇతర యాజమాన్య పద్ధతుల గురించిగానీ వెంకట్ ఎప్పుడూ మాట్లాడలేదని, ఆయన మాట్లాడినది, ఆచరించినదీ పూర్తిగా జీవావరణంలో దోపిడీకి గురికానివ్వని పరస్పర సహకార సంబంధాలపై ఆధారపడిన ఒక తాత్విక జీవన విధానానికి సంబంధించిన విషయమంటున్నారు కె.సురేష్. మసనోబు ఫుకువోకా రాసిన 'వన్‌స్ట్రా రివల్యూషన్' పుస్తకాన్ని 'గడ్డిపరకతో విప్లవం' పేరుతో అనువదించి తెలుగు పాఠకులకు అందించిన వ్యక్తి సురేష్. వెంకట్‌తో తనకున్న ముఫ్పై ఏండ్ల సుదీర్ఘ పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు.
'' 86-87 ప్రాంతాల్లో డిడియస్ వాళ్ళు బిల్‌మాలిసన్‌ని పిలిచి మొట్టమొదటిసారిగా మనదేశంలో పర్మాకల్చర్ మీద ఒక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అక్కడే నాకు వెంకట్ పరిచయమయ్యి తర్వాతి కాలంలో చిరకాలస్నేహితులుగా మారారు. భారతదేశంలో పర్మాకల్చర్ అసోసియేషన్ ఏర్పడటంలో, దాని కొనసాగింపు కార్యక్రమాల్లో వెంకట్‌ది చాలా ప్రత్యేకమైన పాత్ర. అయితే వ్యవసాయాన్ని కేవలం ఒక డెవలప్‌మెంట్ పనిగా చూపించటాన్ని ఆయనకు ఇష్టముండేదికాదు. అనేక సంవత్సరాల పాటు ఆ అసోసియేషన్‌తో చాలా సన్నిహితంగా పనిచేసినప్పటికీ తర్వాత కాలంలో ఈ అంశం మీదే దానినుంచి రాజీనామా చేశారు. పనిచేయడానికే ఎక్కువ ఇష్టపడేవారు తప్పించి తాను ఆచరిస్తున్నదానిని రాయడానికి ఆసక్తి చూపించేవారు కాదు. మీరు చెప్పండి, మేము రాస్తాము అన్నాగానీ ఒప్పుకునేవారు కాదు. ఈ కొద్దిపుస్తకాలు కూడా నిజానికి అందరం కలిసి అప్పుడప్పుడు పెట్టిన ఒత్తిడే కారణం. సైద్ధాంతికంగా చాలా అవగాహనతో వుండి, అది ఆచరణాత్మకంగా చేసి చూపించటం, అంత విస్తారమైన విజ్ఞానం ఎక్కడినుంచి వచ్చిందనేది నాకైతే ఎప్పుడూ ఆశ్చర్యమే. నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టి, అదే చదువుకున్నా గానీ ఇన్ని విషయాలపట్ల నాకు అంత అవగాహన వుందనుకోను. ఆయన తన పెరట్లోనే చాలా మొక్కలు పెంచేవాడు. మొక్కల పెరుగుదలను నిరంతరం అధ్యయనం చేస్తుండేవారు. చర్చించేవారు. చిన్నపెరడే కానీ పెద్దచెట్ల నుంచీ చిన్నమొక్కలవరకూ చాలావుండేవి. ఆ పెంచే విధానంలో చాలా వైవిధ్యత వుండేది. తాను పెంచే చెట్లనుంచి విత్తనాలు సేకరించేవారు. ఆయన పెరట్లోనే మట్టిని నిరంతరం వివిధ సహజసిద్ధమైన వాటిని కలియవేయటం(మల్చింగ్)వల్ల మట్టి చాలా సారవంతంగా వుండేది. ఆయనకున్న విజ్ఞానం కేవలం పుస్తకాలు చదవటం వల్ల మాత్రమే వచ్చింది కాదు, నిరంతరం ఆచరణలో పెట్టి చూపించారు కూడా. అయితే ఆయన దాన్ని చిన్నస్థాయిలోనే వుంచారు. ఆయన ఏపనిచేసినా చాలా పద్ధతిగా చేసేవాడు. తాను పెంచిన మొక్కల నుంచి విత్తనాలను సేకరించడమే కాకుండా బయట నుంచీ కూడా సంప్రదాయ విత్తనాల సేకరణ కూడా ప్రధాన వ్యాపకంగా చేసేవారు. అలా సేకరించిన అన్ని విత్తనాలను సీసాల్లో విడివిడిగా జాగ్రత్త చేసేవారు. వాటి పేర్లు, వివరాలు రాసి అంటించేవారు. ఆసక్తి వుండి, ఈ రంగంలో కృషిచేయాలనుకుంటున్న వాళ్ళకి తన దగ్గరవున్న విత్తనాలను ఇచ్చేవారు. డిడియస్‌తో కలిసి పర్మాకల్చర్ క్షేత్రంతో పనిచేసినప్పుడు చేసిన ప్రతిపనినీ నమోదుచేసారని విన్నాను. అది ఇప్పుడు అందుబాటులో వుందో లేదో తెలియదు. వుంటే గనుక ఈ విధానంలో పనిచేయాలనుకున్నవాళ్ళకి చాలా ఉపయోగకరంగా వుంటుంది.''
పర్మాకల్చర్ అంటే పర్యావరణానికి హానికలిగించని ఒక వ్యవసాయ విధానం. ఒక పొలంలో ఏది ఎక్కడవుండాలి అని జాగ్రత్తగా ఆలోచించటం. దానిద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని పొందడం. భూమి సంరక్షణ, ప్రజల సంరక్షణ ప్రధానంగా దీనిలో భాగంగా వుంటాయి. వచ్చినదానిలో ఎక్కువభాగం తిరిగి నేలకే అందించడం. ఇవి ప్రధాన సూత్రాలుగా పర్మాకల్చర్ పనిచేస్తుంది. వైవిధ్యత, స్థిరత్వం, ఆటుపోట్లకు తట్టుకునే విధంగా వ్యవసాయ వ్యవస్థలను తయారుచేసి నిర్వహించటం. ఈ విధానం ప్రజలకు, పర్యావరణానికి మధ్య ఒక సుహృద్భావ సంబంధాన్ని నెలకొల్పుతుంది. జీవావరణంలోని అన్ని జీవాలకు ప్రయోజనం కలిగే విధంగా తయారుచేసిన పద్ధతి. దీని ఆధారంగానే వెంకట్ స్థానిక వనరులని చూసుకుంటూ, వాటిని అవగాహనతో ఉపయోగించడం అనేదాని మీద చాలా శ్రద్ధపెట్టి పనిచేశారని అర్ధం చేసుకోవచ్చు.
పాశ్చాత్యదేశాల్లో వ్యవసాయ క్షేత్రాలు, ఇళ్ళు కలగలిసి వుంటాయి. ఇంటికి అవసరమైన రోజువారీ పంట ఎక్కడ వుండాలి, ఎంత దూరంలో వుండాలి, ఏది వుండకూడదు అని ఐదు విభాగాలుగా వర్గీకరిస్తారు. ఐదోభాగాన్ని సహజమై పద్ధతిలో అడవి పెరిగేలా వదిలేస్తారు. వ్యవసాయం సహజ సిద్ధంగా ఎలా జరగాలని చెప్పేదే ఈ పర్మాకల్చర్. మనకు వచ్చే వాననీరు గానీ, సూర్యరశ్మి గానీ ఎలా ఉపయోగిస్తాం వీటన్నిటి మీద కూడా శ్రద్ధ పెట్టాలనేది ఇందులో ఒక ముఖ్యాంశం. ఇది కేవలం వ్యవసాయానికి సంబంధించినదే కాదు, పర్యావరణ హిత సమాజాన్ని పెంపొందించటం కూడా. దీనిగురించి వెంకట్ ఎక్కువ ఆలోచించి పనిచేశారని అనిపిస్తుంది. వెంకట్‌తో సన్నిహితంగా పనిచేసిన కొంతమంది ఇప్పుడు పర్మాకల్చర్ విధానంలో విశేషకృషి చేస్తున్నారు. అందులో నరసన్న, పద్మ ముఖ్యులు. వారిద్దరు ఇప్పుడు 'అరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్‌నేటివ్స్' పేరుతో పర్మాకల్చర్ శిక్షణా కేంద్రాన్ని నడుపుతున్నారు. ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలలో ఈ విధానం మీద స్థానిక సమూహాలతో పనిచేస్తున్నారు. పర్మాకల్చర్ విధానం మీద వచ్చే రెండేండ్లలో జాతీయ, అంతర్జాతీయ సమాలోచనలను హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించబోతున్నారు.
పర్మాకల్చర్ వల్ల కొన్ని సమూహాలు పనిచేస్తున్నప్పటికీ ఇంకా విస్తృత స్థాయిలోకి వెళ్ళాలంటే అది విధాన నిర్ణయాలవల్లే సాధ్యమవుతుంది. అప్పుడే ఇది ఒక నిర్మాణాత్మక రూపంలో అవసరమైన మద్దతు వ్యవస్థలను నిర్మించటానికి అవకాశం ఏర్పడుతుంది. దీనిని పూర్తిగా అర్ధం చేసుకోగలిగి జీవిత విధానంగా మార్చుకుని ఆచరణలో తీసుకెళ్ళగలిగిన వారు ప్రస్తుతం తక్కువమందే వున్నప్పటికీ అక్కడక్కడా చేస్తున్నకృషిలో మంచి ఫలితాలు వస్తున్నాయి. వ్యవసాయ విధానాల్లో మార్పు కోసం, పర్యావరణానికి హానికలిగించని విధానాలపై కృషి చేయాల్సిన అవసరం చాలావుంది. మన చుట్టూ ప్రస్తుతం నడుస్తున్న వ్యవసాయం ప్రకృతి వ్యతిరేకమే అనేదాంట్లో ఎటువంటి సందేహం లేదు. వ్యవసాయాన్ని కేవలం మార్కెట్ విధానం నుంచీ కాకుండా, ప్రకృతితో కలిసి నడిచే విధానంగా రూపొందించాల్సిన సమయం ఆసన్నమయింది. అందుకోసం బాటలు వేసిన వెంకట్ లాంటివారిని గుర్తుంచుకుందాం.
సామాజిక కార్యకర్త, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
9948352008
కె. సజయ