Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ52 రోజులు అనేక నిర్బంధాలను ధైర్యంగా ఎదుర్కొని ఆత్మస్థైర్యంతో వీరోచితంగా సాగిన ఆర్టీసీ కార్మికుల పోరాటం అత్యంత శ్లాఘనీయం. దేశ రవాణా కార్మికుల సమ్మెలన్నింటిలోకి ఈ సమ్మె సుదీర్ఘమైనది. బెదిరింపులకు, నిర్బంధాలకు చెక్కు చెదరక వీరోచితంగా పోరాడిన కార్మికులకు జేజేలు. తాత్కాలికంగా సమ్మె విరమించి విధులకు హాజరవుతామని డిపోలకు రావడానికి సిద్ధ పడిన కార్మికులను అందుకు అనుమతించక పెద్దఎత్తున అరెస్టు లకు పాల్పడిన ప్రభుత్వం 3రోజుల తర్వాత బేషరతుగా విధులకు తీసుకుంటా మని ప్రకటించటాన్ని కార్మికులతో పాటు అన్ని వర్గాలూ స్వాగతించాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామాన్ని జాగ్రత్తగా గమనించాలి.
సమ్మె పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి అధికారులు సమర్పించిన తప్పుడు లెక్కలూ న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలూ ప్రజలతోపాటు టీఆర్‌ఎస్ శ్రేణులు కూడా జీర్ణించుకోలేక పోయారు. సమ్మె విరమించి విధులకు హాజరవుతామని ప్రకటిస్తే సమ్మె చేయడం, విరమించడం అంతా మీ ఇష్టమేనా - నిబంధనలు అందుకు అనుమతించవు.. అనీ, ఆర్టీసీ ఎండీ ద్వారా ప్రభుత్వం చేయించిన ప్రకటన పరాకాష్ట. ఆర్టీసీ కార్మికులు, ప్రజలతోపాటు చివరకు టీఆర్‌ఎస్ శ్రేణులు సహితం ప్రభుత్వాన్ని క్షమించవనే ప్రమాదాన్ని 3రోజుల తర్వాతనైనా ప్రభుత్వం గుర్తించింది. అందుకే విధులకు అనుమతించడంతో పాటు కొన్ని రాయితీలు కూడా ప్రకటించింది. కనీసం 45కోట్లు ఇవ్వలేరా అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించినా నోరు మెదపని ప్రభుత్వం నేడు తక్షణ సాయంగా సంస్థకు 100కోట్లు ఇస్తామని ప్రకటించింది. రెండురోజుల వ్యవధిలోనే రాష్ట్రస్థాయి కార్మికుల విస్తృత సమావేశాన్ని ప్రభుత్వమే నిర్వహించడానికి సిద్ధపడింది. ఇప్పటి వరకు జరిగిన తప్పులన్నీ అధికారులే చేశారని వారిని బలి పశువుల్ని చేసి ముఖ్యమంత్రి చాలా మంచివాడు, ఉదార హృదయుడు అని కార్మికులకు ప్రజలకు భ్రమ కలిగించే ప్రయత్నం ఇందులో దాగి ఉంది. ప్రజల సహకారంతో పోరాడి సాధించుకున్న విజయాన్ని మరుగున పరచే ప్రమాదం ఇది. బేషరతుగా అందరు విధుల్లో చేరడం, కొన్ని రాయితీలు సాధించడం పోరాట విజయం. ఇది కేవలం ఆర్టీసీ కార్మికుల ఒక్కరి విజయమే కాదు, మొత్తం రాష్ట్ర ప్రజలందరి విజయం. ఇక్కడితో సమస్య ముగియ లేదు. ప్రమాదం పొంచి ఉంటుంది. దీన్ని గమనంలో ఉంచుకొని భవిష్యత్‌లో కూడా ఈ ఐక్యత కొనసాగించాలి. మరింత విస్తృత మద్దతూ సంఘీభావం కూడా మొత్తం కార్మికవర్గ ప్రయోజనాలను కాపాడుకోవాలి.
ఈ సందర్భంగా కార్మిక సంఘాలపై గౌరవ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రమాదకరం. కార్మిక సంఘాలను నిర్వీర్యం చేస్తే ఆ తర్వాత యాజమాన్యాలు కార్మికులపై దాడి చేయడం, బానిసల కంటే హీనంగా చూడటం తేలికవుతుంది. అందుకనుగుణంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో లేబర్ కోడ్ ప్రవేశపెట్టింది. మొత్తం కార్మికోద్యమాన్ని నిర్వీర్యం చేసే ప్రమాదకర చర్యలకు ఇది దారి తీస్తుంది. దీన్ని విస్మరించడం, ఏమరుపాటు వహించడం తగదు.
సమ్మె సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు సంఘాలు, రాజకీయ పార్టీలు, సీపీఐ(ఎం), సీపీఐ, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఆర్‌టీడబ్ల్యూఎఫ్ కేంద్ర కమిటీలు, దేశంలోని వివిధ రాష్ట్రాల రవాణా కార్మిక సంఘాలు, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్, గ్రీస్, కాంగో, ట్రేడ్ యూనియన్ ఇంటర్నేషనల్ (ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్), మద్దతు, సంఘీభావం ప్రకటించడం విశేషం. అనేక డిపోలలో మహిళా కార్మికులు ప్రదర్శించిన ధైర్యం, పట్టుదల అపూర్వం. సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఎలాంటి అనుభవంలేని డ్రైవర్లతో ప్రభుత్వం బస్సులు నడిపించి అనేక మంది ప్రాణాలను బలిగొనడం అత్యంత దారుణం. ఆత్మాహత్యలు, గుండెపోటులతో సుమారు 30మంది కార్మికులు, మరణించడం పెద్ద విషాదం. ఆ కుటుంబాల రోదన, అవస్థలు వర్ణనాతీతం.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెచ్చిన మోటారు వాహన చట్ట సవరణను వినియోగించుకొని 50శాతం రూట్లు ప్రయివేట్‌వారికి ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. అక్కడ చట్టంచేసి ఇక్కడ వ్యతిరేకిస్తున్న బీజేపీ రెండు నాల్కల వైఖరి సమ్మె సందర్భంగా బట్టబయలు అయింది. పీఆర్‌సీ ఎర చూపి ప్రభుత్వోద్యోగులను సమ్మెకు మద్దతుగా నిలబడకుండా ప్రభుత్వం చేయగలిగింది. తీరా పీఆర్‌సీ ఇప్పుడు లేనట్టేనని పత్రికల్లో వార్తలొచ్చాయి. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాల విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి పెద్ద చెంప పెట్టు. ముగ్గురు విశ్రాంత సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తులతో కమిటీ వేస్తామన్న సూచనలను సహితం ప్రభుత్వం నిరాకరించిన తీరు న్యాయస్థానాల పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం గౌరం లేదని రుజువు చేసింది. పదేపదే సమ్మె అక్రమం అని ప్రకటించాలని ఎంత మొర పెట్టుకున్నా ఉన్నత న్యాయస్థానం అందుకు నిరాకరించడం, రాజ్యాంగపరంగా యాజమాన్య, ప్రభుత్వ బాధ్యతలను నొక్కి చెప్పడం అభినందనీయం. అత్యంత నిబద్ధత, విలువలు, నియమనిబంధనల పాటింపు, జవాబుదారీతనంతో పనిచేయాల్సిన ఐఏఎస్ అధికారులు సమ్మె సందర్భంగా ప్రభుత్వ బాకాదారులుగా, న్యాయస్థానం ముందు ముద్దాయిలుగా నిలబడిన తీరు అధికార వ్యవస్థకే మాయని మచ్చగా నిలిచింది. ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచాలని సమ్మె విరమణ సందర్బంగా ప్రభుత్వం నిర్ణయించడం కార్మికుల పోరాటానికి అండగా నిలచిన ప్రజలపై దాడిచేయడమే. ప్రజలను కార్మికులకు వ్యతిరేకంగా నిలిపే కుట్ర ఒక వైపు మరొక వైపు భారీగా కి.మీకు 20పైసలు పెంచడంతో ఆర్టీసీలో ఓఆర్ పడిపోయి దివాళా తీసే ప్రమాదం ఉంది. గత అనుభవం దీన్నే రుజువు చేసింది. మరొక వైపు గుర్తింపు సంఘ కార్యాలయాన్ని యాజమాన్యం స్వాధీనం చేసికోవడం, సంఘ నాయకులకున్న సదుపాయాలూ రద్దు చేయడం కార్మిక సంఘాలపై దాడి చేసి నాయకులను భయపెట్టి లొంగతీసుకునే దుర్మార్గపు ఎత్తుగడ. దీనికి తగిన విధంగా స్పందించి నాయకత్వం తమ పరిణితిని ప్రదర్శించడం అభినందనీయం. మొత్తంగా తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె కార్మికోద్యమ చరిత్రలోనే ఒక ముఖ్య ఘటన.
- ఆర్. లక్ష్మయ్య
సెల్: 9971511954