Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వచ్చే విద్యాసంవత్సరం నుండి దేశమంతటా అన్ని పాఠశాలల్లోనూ యోగా శిక్షణను విధిగా అమలు చేయటానికి కేంద్రప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సిబిఎస్‌ఇ స్కూళ్లలో, కొన్ని (మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ తదితర) బిజెపి ప్రాలిత రాష్ట్రాల్లో యిప్పటికే అమల్లో వున్న యోగాను అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయించాలనేది కేంద్రప్రభుత్వ సంకల్పం. జాతీయ ఉపాధ్యాయ విద్యా సంస్థ (ఎన్‌సిటిఇ) యోగా శిక్షణకు సంబంధించిన మాడ్యూల్స్‌ను సిద్ధం చేసింది. వాటిపై తర్ఫీదు పొందటం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఉపాధ్యాయ శిక్షణ (బి.ఇడి.,డైట్ కాలేజీల్లో) సంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకులను బెంగుళూరులోని స్వామి వివేకానంద యోగా అనుసాధన సంస్థాన్ (యోగా విశ్వవిద్యాలయం)కి పంపిస్తున్నారు. పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరూ 10 రోజుల యోగా శిక్షణ పొందాలని తెలంగాణ విద్యాశాఖలోని ఉన్నతాధికారి చెప్పినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. పాఠశాల విద్యాప్రణాళిక (కరిక్యులమ్)లో కూడా యోగా పాఠ్యాంశాన్ని చేర్చుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
శారీరక, మానిసిక స్వస్థతకు యోగా వుపయోగపడుతుందని చాలామంది చెబుతున్నారు. బడిపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా యోగా పరిష్కరిస్తుందా? కేంద్రప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ కోసం యునిసెఫ్ నిర్వహించిన సర్వే ప్రకారం బడిఈడు పిల్లలల్లో 38.80శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. బాలికల్లో 53శాతం మంది వయసుకి తగిన బరువుకంటె తక్కువగా వున్నారు. పేద కుటుంబాల పిల్లలు, హాస్టళ్లు, ఆశ్రమ స్కూళ్లలోని విద్యార్థుల్లో రోగనిరోధకశక్తి తక్కువగా వుంటుంది. రక్తహీనత, మలేరియా, డయేరియా తదితర జబ్బులతో బాధపడుతుంటారు. వారికి ప్రభుత్వం యిస్తున్న భోజనంలో కూడా పౌష్టిక విలువలు తగినంత లేకపోవటం వలన నిరంతరం అస్వస్థతకు గురవుతుంటారు. అలాంటి వారికి సరైన వైద్య సదుపాయాలు లేవు. అందువలన చాలామంది విద్యార్థులు రోజుల తరబడి పాఠశాలకు, హాస్టల్‌కు గైర్‌హాజరు అవుతుంటారు. కోయగూడాలు, గిరిజన తండాలు, మైనార్టీ బస్తీల్లోని పిల్లలు అర్థాకలితో, కాలేకడుపుతోనే బడికి వస్తుంటారు. అలాంటి వారికి ఉదయంపూట ఉపాహారం పెట్టేపని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బడిపిల్లలకు ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు 90శాతంగా వున్న ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల పౌష్టికాహార సమస్యను యోగా తీరుస్తుందా? సరైన తిండిలేని వారికి కూడా మంచి శారీరక సౌష్టవాన్ని సమకూరుస్తుందా?
పాఠశాల విద్యార్థుల్లో నెలకొన్న ప్రధాన సమస్యల్లో కనీస విద్యాప్రమాణాలు, అభ్యసనా సామర్థ్యాలు లేకపోవటం. 8వ తరగతి విద్యార్థుల్లో 45శాతం మంది 5వ తరగతి గణితంలోని కూడికలు, హెచ్చవేతలు, భాగహారాలు చేయలేకపోతున్నారని, 5వ తరగతి విద్యార్థుల్లో 40శాతం మంది 3వ తరగతి తెలుగు వాచకంలోని రెండు పేరాలు కూడా సరిగా చదవలేకపోతున్నారని అసెర్, న్యూపా, ఎస్‌ఎస్‌ఏల నివేదికలు పదేపదే ప్రకటిస్తున్నాయి. ఇలాంటి నాసిరకం చదువులకు కారణం యోగా పాటించకపోవటమేనని ఏ నివేదికలోనూ చెప్పలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు తగినంతమంది లేక (ప్రాథమిక పాఠశాలల్లో సగటున ఇద్దరు, కొన్ని స్కూళ్లు సింగిల్ టీచర్‌తోనే నెట్టుకొస్తున్నాయి), ఉన్న టీచర్లు కూడా బడి పనిదినాల్లో మూడోవంతు కాలం చదువుచెప్పే పరిస్థితి లేకపోవటం, పాఠశాలల్లో ఆడియో విజువల్ పరికరాలు లేకపోవటం, ఐసిటి వినియోగం లేకపోవటం తదితర విషయాలు బోధనాభ్యసన స్థాయిని పరిమితం చేస్తున్నాయి. ఇక ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులకోసం, గ్రేడుల కోసం విద్యార్థులను మానసికంగా, భౌతికంగా వేధిస్తున్నాయి. ఇలాంటి సమస్యలకు యోగా ఉపశమనం కల్గిస్తుందా?
ఆటలు, పాటలు, సాంస్కృతిక కళాప్రదర్శనలే ఎదిగే పిల్లలకు శారీరక దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని అందరికీ తెలుసు. అలాంటి అవకాశాలు కొన్ని హైస్కూళ్లలో తప్ప చిన్న సన్నకారు పాఠశాలల్లో కనుమరుగవుతున్నాయి. ప్రైవేట్ స్కూళ్లలో ఆటస్థలాలే వుండవు. పట్టణాల్లోని ప్రభుత్వ పాఠశాలల ఆటస్థలాలు కబ్జాలపాలై కరిగిపోతున్నాయి. వ్యాయామ ఉపాధ్యాయు (పిఇటి)లు కొన్ని హైస్కూళ్లలో వుంటారు. వారు కూడా పాఠశాల ప్రారంభం, ముగింపు ప్రార్థనా సమయాల్లో మార్చింగ్ చేయించటం, ఆవరణలో పిల్లలు తిరగకుండా, అల్లరి చేయకుండా క్రమశిక్షణ అమలు చేయటానికే పరిమితం అవుతున్నారు. కొన్ని స్కూళ్లలో ఆటస్థలాలు వున్నా పరికరాలు లేకపోవటం వలన కూడా ఆటలు ఆడించటం లేదు. ప్రైవేట్ స్కూల్ పిల్లలు బడి సమయం తర్వాత ట్యూషన్‌లకు పోవాల్సిన హడావిడిలో ఆటస్థలం వైపే చూడలేకపోతున్నారు. అలసిపోయేదాకా ఆటలాడి, వ్యాయామం చేయాల్సిన వయసులో అదిలేక విద్యార్థుల ఎదుగుదలకు జరుగుతున్న అపారమైన నష్టాన్ని యోగా పూడ్చగలదా?
పిల్లలకు కావాల్సిన పౌష్టికాహారం అందివ్వకుండా, ఆటలు వ్యాయామానికి అవకాశం కల్పించకుండా యోగా చేయించాలనే ఆతృత కేేంద్రప్రభుత్వానికి ఎందుకు? తమ మత ప్రయోజనానికి తప్ప. ప్రపంచ యోగా దినోత్సవం (జూన్ 21) సందర్భంగా కేంద్రప్రభుత్వం చేసిన ఆర్భాటంలోనూ మతోన్మాద ప్రచారానికి ప్రాకులాడినట్లే తేటతెల్లమైంది. ప్రపంచస్థాయి, అంతర్జాతీయ దినోత్సవాలు అనేకం వున్నాయి. వాటిలో వేటినీ పట్టించుకోకుండా యోగా దినోత్సవానికే ఎందుకు అంత ప్రాధాన్యత యిచ్చినట్లు? బాలల, ఆహార, మానవత, మానవ హక్కుల, శాంతి, జనాభా, ధరిత్రీ, పర్యావరణ, ఆరోగ్య, ఉపాధ్యాయ తదితర ప్రపంచ దినోత్సవాలు వున్నాయి. అలాగే అక్షరాశ్యత, మహిళ, కార్మిక వగైరా అంతర్జాతీయ దినోత్సవాలు వున్నాయి. ఇవేవీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ప్రాధాన్యతగల విషయాలు కావు. వారి సైద్ధాంతిక ప్రతీకలు అంతర్గతంగా వున్నందునే యోగాని ఆకాశానికి ఎత్తటం, బడిపిల్లలకు బలవంతంగా రుద్దేపనికి పూనుకున్నది. యోగాసనాలు ఆరోగ్యానికి ఉపయోగపడేవి కావని ఎవరూ అనటం లేదు. కానీ దానికి మతాన్ని ఆపాదించటమే అభ్యంతం.
9490300577
నాగటి నారాయణ