Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ సమాజాన్ని మరణించేదాకా ఉరితీయమని 44ఏండ్ల క్రితం 'తీర్పు' సినిమాలో న్యాయమూర్తి తీర్పిచ్చారు. మగువలను అగ్గువ చేసిన మతాలు మగసష్టి. పౌరాణిక గ్రంథాలు పురుష రచనలు. రెండూ మగాధిపత్యాలే. కామక్రీడలు, లైంగిక దోపిడీలతో సహా నాటి పురుష సామాజిక రోగాలన్నీ దేవతలకు ఆపాదించారు. ఆదిశక్తి పార్వతి నోట పాతివ్రత్య లక్షణాలు చెప్పించారు. ఏ దేవుడూ సతీవ్రత గుణాలు వల్లించలేదు. ఆకృతిలో అలవాట్లలో మనుషులకు దేవుళ్ళకు తేడా లేదు. ఆడపిండాలను చిదిమేచేస్తాం. ఆడ మగ పిల్లల పెంపకమే వేరు. అక్రమ లైంగికంలో స్త్రీ శీలం చెడుతుందంటాం. మగమానం మలినమవుతుందనం. వ్యాపారప్రకటనల్లో, వినోదాల్లో, టీవీ కార్యక్రమాల్లో, సినిమాల్లో ఆడువారిని అంగడిబొమ్మలుగా, అమ్మకం సరుకులుగా చూపటం, మాధ్యమాల పాత్ర, అంతర్జాల అష్టమ వ్యసన ప్రభావాలు పాతమాటలే. స్మార్ట్‌ఫోన్ కొత్తగా వచ్చింది. మన ప్రథమ సేవకుడు ప్రచారకర్తగా పనిచేస్తున్న ముకేశ్ అంబానీ జియో ఫోన్ దానికి ఆజ్యం పోసింది. ప్రపంచీకరణ విధానాలతో ప్రతి సమాజ ప్రక్రియలో విదేశీ వినాశక సంస్కతి చేరింది. సామాజిక కార్యక్రమాల్లో అతివలు అధ్వాన్న స్థితికి నెట్టబడ్డారు. సమాజ నిర్మాణానికి దోహదపడవలసిన హాస్యవల్లరుల్లోనూ స్త్రీలను ఎగతాళి చేస్తున్నారు. సామాజిక నేరాలువ్యక్తి ప్రేరేపితాలు కాదు. వ్యవస్థీకృతాలు. అస్తవ్యస్త సమాజంలో తయారైన వ్యక్తులతో నిండిన సంస్థలు అవకతవకలుగానే పనిచేస్తాయి. లాభం లేనిదే బాధ్యులు పనిచేయరు. పని తప్పించుకునే ఎత్తులు వేస్తారు. పాలకపక్షపాత సంస్థల గురించి చెప్పనక్కరలేదు. పోలీసులతో సహా పలువురి వక్రవర్తనకు ఇదే కారణం. పూర్వ ప్రధాన న్యాయమూర్తి గొగోరు మీద ఆయన కార్యాలయ మాజీ మహిళా ఉద్యోగిని అసభ్య ప్రవర్తన అభియోగం మోపారు. ఆ విషయ విచారణ కమిటీ అధ్యక్షుడు గొగోరు. విచారణ కమిటీలో ఆయన ఉండరాదన్న నిబంధనకు నీళ్ళొదిలారు. మగాధికార విచారణ సాగింది. మంత్రులు, పాలకపక్ష ప్రజాప్రతినిధులు ఆరేండ్లలో ఎన్ని అత్యాచారహత్యలు చేశారో లెక్కలేదు. దిశా ఘటనపై చలనచిత్ర తారల స్పందన విచిత్రం. శృంగార అంగాంగ ప్రదర్శనల్లో, అసహ్య వ్యాపార ప్రకటనల్లో వీరి పాత్ర జుగుప్సాకరం. సంపాదనలో సామాజిక బాధ్యత మరిచిన చిత్రనటులు ముందుగా తమ బాధ్యతలు తెలుసుకోవాలి.
ప్రపంచీకరణతో వృత్తులు దెబ్బతిన్నాయి. ఉపాధులు, ఉద్యోగాలు ఊడాయి. గ్రామీణ నిరుపేదలు పట్టణాలకు వలసవచ్చారు. అక్కడి మురికివాడల్లో చిన్న ఏకగది గుడిసెలే వారి ఇండ్లు. పెద్దల దాంపత్యజీవిత కార్యక్రమాలు యుక్తవయసు పిల్లలకు నిత్యదృశ్యాలు. పనిస్థలాల్లో ఆడవాళ్ళు అత్యాచారాలకు గురవుతున్నారు. పిల్లలను కార్పొరేట్ బళ్ళకు పంపే స్థోమత ఈ పేదలకు లేదు. పిల్లలు హౌటళ్లలో, సారా అంగళ్ళలో, బార్లలో, పబ్బుల్లో పని చేస్తారు. అక్కడి అకృత్యాలు చూస్తూ ఉంటారు. సంపన్నుల పిల్లల వగలు, వయ్యారాలు చూసి ఉద్రిక్తులవుతారు. ఈర్ష్యాద్వేషాలు పెంచుకుంటారు. అవకాశం దొరికితే వాళ్ళపై కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇక పట్టణాల పార్కుల్లో, బహిరంగ ప్రదేశాల్లో, రోడ్ల పక్కన జరిగే శృంగార కార్యక్రమాలు వీళ్ళ కంటపడతాయి. మానసిక ఉద్విగతలకు గురై లైంగికదాడులు, హత్యలు, ఇతర నేరాలకు పాల్పడతారు. ప్రపంచాన్నే కుదిపిన నిర్భయ, దిశా అత్యాచారులు ఈ కోవవారే. ప్రపంచీకరణ ప్రభావాలకు మహిళలూ అతీతులు కాదు. అక్కడక్కడా ఆడవారి అకృత్యాలు వాటిఫలితమే. నేటి విభిన్న పక్ష మతపక్షపాత పాలనలో నిరుద్యోగం గత 45ఏండ్లలో లేని అధోగతికి చేరుకుంది. 15-35 ఏండ్ల సామాజిక వ్యర్థపదార్థాల సంఖ్య పెరిగింది. సామాజిక రోగాలు విజృంభించాయి.
ఆధునిక ఆధ్యాత్మిక గురువులు అతివల అత్యాచార హత్యాచక్రవర్తులు. వీరిని పాలకులు సమర్థించారు. రాజకీయ లబ్ది పొందారు. పాలకపక్ష నాయకులూ ఈ వికృత కార్యవీరులే. ఈ కండ్లల్లో సంఫ్‌ు పాలకులు పండితులు. ముస్లిం మహిళలపై అత్యాచారాలతో ఎన్నికల విజయాలు సాధించారు. గుజరాత్, ముజఫర్ పూర్ ఘటనల్లో మోడీ, షా సూత్రధారులు. కతువాలోని లైంగికదాడిలో సంఫ్‌ు మంత్రులు పాత్రధారులు. సంఫ్‌ు తాత్వికతలో స్త్రీ బానిసత్వం, పాతివ్రత్యం మాన్య సిద్ధాంతాలు. 11లక్షలమంది ముస్లిం స్త్రీల కోసం తక్షణ తలాక్ చట్టం చేశారు. 4.3కోట్ల హిందూ ఏకవనితలు బృందావన్, మధుర, కాశీ, హరిద్వార్ లాంటి హిందూ మందిరాల్లో పూజారుల, మహంతుల, బాబాల శారీరక, మానసిక, లైంగిక దోపిడీకి, అత్యాచారాలకు గురవుతున్నారు. వీళ్ళు నేటి పాలకులకు పట్టరు. ఈ దోపిడీదారులను పాలకవర్గం సమర్థించింది. 2012 కర్నాటకలో భారత పోలీసు ఉన్నతాధికారుల నేరనిరోధక సభ జరిగింది. సారా నిషేధించి 80శాతం సిబ్బందిని తగ్గించండి. శాంతిభద్రతలు కాపాడతామని ఆ సభ ప్రతిపాదించింది. ప్రజలను మత్తుల్లో ముంచి ప్రశ్నించేవారు లేకుండా చేసిన పాలకులు అన్ని కమిటీల నివేదికలలాగే ఈ సభ తీర్మానాన్ని తుంగలో తొక్కారు.
వ్యక్తుల శిక్షలు వ్యక్తుల వరకే. మరణ శిక్ష ప్రభావం శూన్యం. రోగానికి చికిత్స కంటే నిరోధం ముఖ్యం. మన ఆశయాలు ఆచరణ ఒకటే కావాలి. చెప్పిందే చేయాలి. మహిళలకు సంపూర్ణ ఉచిత విద్య, శాసనసభల్లో, పాలనా విధాన నిర్ణయాల్లో, న్యాయస్థానాల్లో జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం ఉండాలి. ఇది సమాజ నిర్మాణానికి, నిర్వహణకు, సామాజిక రుగ్మతల నిరోధానికి, చికిత్సకు ఉపయోగకారి కాగలదు.
- సంగిరెడ్డి హనుమంత రెడ్డి
సెల్:: 9490204545