Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక ఆర్థిక వ్యవస్థలో ఆదాయాభివృద్ధి మందగించినప్పుడు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కూడా తగ్గుతుంది. ప్రభుత్వానికి అనివార్యంగా చేయవలసిన వ్యయం ఉంటుంది కాబట్టి అందుకు కావలసిన ఆదాయం కోసం మరిన్ని పన్నులను విధించటమో లేక విత్తలోటు విస్తృతపరచటమో చేయాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితులలో విత్తలోటును విస్తృతపరచటంవల్ల (రెండవ ప్రపంచ యుద్ధానంతరం పెట్టుబడిదారీ సంక్షేమ ప్రభుత్వాలు ఇలానే చేసేవి) ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ వ్యయంవల్ల ఏర్పడే డిమాండ్‌కి చెందిన ఒక పార్శం బలోపేతం అవుతుంది. అంటే అది మందగమనం వేగాన్ని పరిమితం చేస్తుంది. దీనిని 'స్వయంచాలక స్థిరత్వ కారకం'గా అర్థశాస్త్ర పాఠ్యపుస్తకాల్లో అభివర్ణిస్తారు. ఈ పరిస్థితులలో ప్రభుత్వ వ్యయం 'స్వయంచాలక స్థిరత్వ కారకం' పాత్రను నిర్వహించి మందగమనాన్ని పరిమితం చేస్తుంది.
గతంలోని సంక్షేమ ప్రభుత్వాల కాలంలో ఇలా జరిగేది. అయితే నయా ఉదారవాద పాలనలో విషయాలు పూర్తిగా వేరుగా ఉంటాయి. నయా ఉదారవాద పాలనలో ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండటంవల్ల పన్నుపై వచ్చే ఆదాయం తగ్గినప్పుడు ప్రభుత్వం అదనంగా పన్నులు విధించజాలదు(ప్రభుత్వ వ్యయం కోసం కార్మికులపై అదనపు పన్నులు విధిస్తే సమిష్టి డిమాండ్ పెరగదు. అంటే మందగమనం తగ్గదు). అలాగే విత్తలోటును కూడా విస్తృతపరచలేదు. ఎందుకంటే ఈ రెండు చర్యలను అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అంగీకరించదు. ఒకవేళ నయా ఉదారవాద పాలనలో ఈ చర్యలను అమలు చేస్తే పెట్టుబడులు ఉపసంహరింపబడతాయి. అది ఆర్థిక సంక్షోభం ఏర్పడటానికి కారణమవుతుంది.
నిజానికి అమెరికాతప్ప మిగిలిన అన్ని దేశాలు తమ విత్తలోటును స్థూల జాతీయోత్పత్తిలో 3శాతానికి మించకుండా (భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విడివిడిగా 3శాతం పరిమితి ఉంది) ఉండేలా చూసే చట్టాలను చేశాయి. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నందున పన్నులపై వచ్చే ఆదాయమే కాదు విత్తలోటు పెరుగుదలకు కూడా పరిమితి ఏర్పడుతుంది. అంటే దీనితో మొత్తం ప్రభుత్వ వ్యయం పెరుగుదలకు కూడా పరిమితి ఏర్పడుతుంది.
కాబట్టి నయాఉదారవాద పాలనలో ప్రభుత్వ వ్యయం అంతకుముందు లాగా స్వయంచాలక స్థిరత్వ కారకంగా పనిచేయదు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగమనంలో పడినప్పుడు ప్రభుత్వ వ్యయంలో వృద్ధి కూడా ఉండదు. దానితో ఆర్థిక వ్యవస్థ మరింత మందగమనంలో పడుతుంది. దీనిని కొన్నిసార్లు ప్రభుత్వ వ్యయం 'చక్రీయ ప్రతికూలత'లో ఉందని అనటానికి బదులుగా 'చక్రీయ అనుకూలత'లో ఉందని అంటుంటారు.
ఇదే నయాఉదారవాద విత్త విధాన దుష్టత్వంలోని ప్రధాన అంశం. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో పడకుండా కాపాడే సాధనాన్ని 'విత్త బాధ్యత (ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ)' అనే భారాన్ని అన్ని ప్రభుత్వాలమీద రుద్ది అందుబాటులో లేకుండా చేస్తుంది. దీనితో మందగమనం ప్రక్రియ మరింతగా తీవ్రమవుతుంది.
ఈ నేపథ్యంలో తాము చిక్కుకున్న సంధిగ్దావస్థ నుంచి బయటపడటానికి ప్రభుత్వాలు తప్పులు చేయటానికి వెనకాడవు. భారతదేశంలో ప్రస్తుతం మనం అలాంటి రెండు దుష్ట ప్రయత్నాలను చూస్తున్నాము. మొదటిది, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విధులకు భంగకరంగా వ్యవహరిస్తూ రాష్ట్రాలను పిండుతూ తన విత్తసంక్షోభ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీదకు బదిలీ చేస్తున్నది. రెండవది, నయావుదారవాద ఆర్థిక వ్యవస్థ పరిమితులకు లోబడి ఎంతోకొంత డబ్బును సమకూర్చుకోవటానికి అత్యంత హేయమైన పద్ధతులలో ప్రభుత్వరంగ సంస్థల్ని హడావిడిగా ప్రయివేటీకరిస్తున్నది.
రక్షణ వ్యయంలో కొంత మొత్తాన్ని రాష్ట్రాలకు బదిలీ చేసి రాష్ట్రాల వనరులను కేంద్ర ప్రభుత్వం పిండుతుందని గతంలో చర్చించాం. రక్షణరంగం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ చెబుతోంది. అంటే రక్షణ వ్యయాన్ని భరించవలసిన బాధ్యత, రక్షణకు సంబంధించిన విషయాలను నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అయినప్పటికీ పంచుకోవలసిన వనరుల(డివిసివ్ పూల్) నుంచి రక్షణ వ్యయానికి అవసరమైన నిధుల్ని కేటాయించమని కేంద్ర ప్రభుత్వం 5వ ఫైనాన్స్ కమిషన్‌ను కోరింది. అంటే రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లోవున్న ఏర్పాటు మారనప్పటికీ, రక్షణకు సంబంధించిన అన్ని నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం మాత్రమే తీసుకుంటున్నప్పటికీ రక్షణ వ్యయంలో కొంత భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరించేలా చేయటమే ఇది. కానీ ఇది ఇప్పటిదాకా కనీసం ఒక ప్రమాదంగానే ఉంది. మరోచోట కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలను పిండుతోంది. ఇది జీఎస్‌టీ నష్టపరిహారానికి సంబంధించినది. వస్తువుల, సేవల పన్ను వ్యవస్థను రాష్ట్రాలచేత ఆమోదింప జేయటానికి ఒకవేళ రాష్ట్రాల ఆదాయం తగ్గితే ఐదేండ్లపాటు నష్టపరిహారం చెల్లిస్తానని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ రెవెన్యూ నష్టాన్ని ఆధార రెవెన్యూ స్థాయిని పరిగణనలోకి తీసుకుని నామమాత్రపు షరతులతో 14శాతం వార్షిక వృద్ధిగా లెక్క కట్టవలసి ఉంటుంది. ఇలా లెక్కగట్టిన మొత్తంకంటే రాష్ట్రాల ఆదాయం ఎంత తక్కువ అయితే అంత మొత్తాన్ని నష్టపరిహారంగా కేంద్ర ప్రభుత్వం సమకూర్చవలసి ఉంటుంది. ఇది ప్రతి రెండు నెలలకు ఒకసారి జరగాలి. ఇందుకోసం ఒక నష్టపరిహార సెస్ ఫండ్ ఏర్పాటుచేసి కొన్ని పన్నులపై వచ్చే ఆదాయాన్ని దానిలోకి మళ్ళించవలసి ఉంటుంది.
కానీ కేంద్ర ప్రభుత్వం రాష్రాలకు అటువంటి నష్టపరిహార చెల్లింపుల్ని ఆగస్టు నుంచి నిలిపేసింది. నష్టపరిహార సెస్ ఫండ్‌లో తగినంత నగదు లేదని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. అయితే నష్టపరిహారాన్ని చెల్లించటానికి నష్టపరిహారం ఫండ్ పరిమాణంతో సంబంధం లేదని రాష్ట్రాలు సరిగ్గానే వాదిస్తున్నాయి. ఈ నిబంధన రాజ్యాంగ సవరణలోనే ఉంది. నష్టపరిహార నిధిలో డబ్బులేకపోతే లేక సరిపడా లేకపోతే కేంద్ర ప్రభుత్వం తన జీఎస్‌టీ ఆదాయం నుంచి నష్టపరిహారం చెల్లించాలి. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ నెలలపాటు జీఎస్‌టీ నెలసరి ఆదాయం లక్ష కోట్ల దిగువకు పడిపోయింది. జీఎస్‌టీ స్వభావంలోగల లోపంవల్ల, ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండటంవల్ల ఈ లోటు ఏర్పడుతోంది. పండగ వాతావరణం ఉండే నవంబరు నెలలో జీఎస్‌టీ ఆదాయం ఒక లక్ష కోట్లను దాటిందనే వాస్తవం జీఎస్‌టీ ఆదాయం బిజినెస్ టర్నోవర్‌తోను, అంటే ఆర్థిక వ్యవస్థలోని కార్యకలాపాల స్థాయిపైన ఆధారపడి ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తుంది.
ఇలా కోల్పోయిన ఆదాయాన్ని పూడ్చుకుని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కటానికి కేంద్ర ప్రభుత్వం తాను నష్టపరిహారం చెల్లిస్తానని రాష్ట్రాలకు ఇచ్చిన మాటను పక్కనబెట్టి రాష్ట్రాలను పిండుతోంది. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపకం జరగవలసిన సమిష్టి వస్తువుల, సేవల పన్ను(ఐజీఎస్‌టీ) వసూళ్ళలో సింహభాగాన్ని కేంద్ర ప్రభుత్వమే ఉంచుకుంటోంది.
ఇలా రెండు విధాలుగా పీడనకు గురవుతున్న రాష్ట్రాలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. పేదల కోసం చేసే సంక్షేమ వ్యయంలో చాలా భాగం రాష్ట్రాల ఆదాయం నుంచే రావటం, ఆ ఆదాయం కుదింపునకు గురవటంవల్ల విద్య, ఆరోగ్య సంరక్షణ సహా సంక్షేమ వ్యయం ప్రతికూలంగా ప్రభావితమవుతోంది.
రాష్ట్రాలను గనుక కేంద్ర ప్రభుత్వం పిండకపోతే, ఆదాయం తగ్గిన రాష్ట్రాలకు మాట ఇచ్చిన ప్రకారం కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించినట్టయితే, అందుకోసం విత్తలోటును పెంచినట్టయితే(కేంద్ర ప్రభుత్వానికి పెట్టుబడిదారులపై పన్ను విధించాలనే ఆలోచన లేకపోవటమేకాదు వాస్తవంలో వారికి పన్ను రాయితీలను కూడా ఇవ్వటం జరిగింది) ఇలా జరిగేది కాదు. విత్తలోటును పెంచితే ద్రవ్యోల్బణ పర్యవసానాలు లేకుండా సమిష్టి డిమాండ్ బలోపేతం అవటంతోపాటు, ఉద్యోగిత, ఉత్పత్తి పెరిగేవి. ఆర్థిక వ్యవస్థలోకి ద్రవ్యోల్బణం మెల్లగా జొరబడుతున్నదనేది నిజం. అయితే ఉల్లిపాయలవంటి కొన్ని ప్రత్యేక రంగాలకే అది పరిమితమవుతుంది. దానిని అదుపు చేయటానికి ప్రజా పంపిణీ వ్యవస్థను ఉపయోగించి సరఫరా నిర్వహణకు సంబంధించిన ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. అటువంటి పరిస్థితిలో సరఫరా నిర్వహణకు సంబంధించిన ప్రత్యేక చర్యలు తీసుకుని విత్తలోటును పెంచితే ద్రవ్యోల్బణం పెరగటం అంటూ ఉండదు
అయితే విత్తలోటును అలా విస్తృతపరచటం అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి ఆమోదయోగ్యం కాదు. దేశంలోని నిస్సహాయులైన మైనారిటీలను బెదిరించటమే మగతనంగా భావించి విర్రవీగే మోడీ ప్రభుత్వానికి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిని ఎదిరించే దమ్ము లేదు. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆమోదించని చర్యల్ని తీసుకుని ఆర్థిక వనరులను సమకూర్చుకోవటానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఆర్థిక వనరులను కాజేయటం, పేదల సంక్షేమం కోసం చేసే కేటాయింపులకు కోత విధించటంవంటి చర్యలకు పాల్పడుతోంది. ఆర్థిక వ్యవస్థను ఇబ్బందులపాలు చేసే ద్రవ్య పెట్టుబడి చర్యలను ఆచరణలోపెట్టే వాహకంగా కేంద్ర ప్రభు త్వం పనివిధానం ఉంది. దానితో నయా ఉదారవాద పాలన దుష్టత్వం అనుభవంలోకి వస్తోంది.
- ప్రభాత్ పట్నాయక్
అనువాదం: నెల్లూరు నరసింహారావు
సెల్: 8886396999