Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి శుక్రవారంతో ఏడాది పూర్తికానుంది. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతల్లోకి వచ్చారు. కేసీఆర్ పరిపాలనపై చర్చ తీవ్రంగానే జరుగుతున్నది. ఈ కాలంలో ప్రజాస్వామ్య, రాజకీయ విలువలకు విఘాతం కలిగింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను తన గుంపులో కలుపుకోవడం ద్వారా రాజ్యాంగ వ్యతిరేక పాలనకు శ్రీకారం చుట్టారు. ఇతరపార్టీల ఎమ్మెల్యేలను నియోజకవర్గ అభివృద్ధి పేర ఏమార్చడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే దెబ్బ. ఎన్నికల్లో అనేక సంక్షేమ పథకాలను ప్రకటించిన గులాబీ నేత, అమలుకు వచ్చేసరికి ఆర్థికమాంద్యం పేర కండ్లు తేలేస్తున్నారు. ఆర్థిక సంక్షోభాన్ని ఎజెండా చేసి, తన బాధ్యతల నుంచి తప్పుకోజూస్తున్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటే రాష్ట్రానికి భారీగా నిధులొస్తాయని నీతిసూత్రాలు చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు అసలు నిధులే ఇవ్వలేదంటున్నది. ఒకసారి విమర్శిస్తూ, మరోసారి మెచ్చుకుంటు అవకాశవాద ధోరణులను ప్రదర్శించి, తాజాగా నిష్టూరానికి దిగింది. పౌరసత్వ సవరణ బిల్లును సరిగానే వ్యతిరేకించిన టీఆర్‌ఎస్, ప్రజల ఆయుధమైన సమాచార హక్కు చట్టం కోరలు పీకే బిల్లుకు అనుకూలంగా ఓటేయడం దారుణం. ఇది అప్రజాస్వామికం. విధానపరంగా ప్రజాస్వామ్యానికి, విలువలకు కట్టుబడి ఉండి ఉంటే, సమాచార చట్టం విషయంలోనూ వ్యతిరేకించి ఉండేది. ఎన్నికల పేరుతో దాదాపు ఏడాది కాలంగా పాలనే సాగలేదు. ఉన్న పథకాలకు నిధుల కొరత. రైతుబంధు దగ్గర నుంచి ఆసరా ఫించన్ల వరకు అన్నింటికీ కాసుల కటకటే. రైతుబంధు ఇంకా లక్షలాది మందికి చేరకపోగా, పింఛన్ల చెల్లింపును నెలల తరబడి ఆలస్యం చేస్తున్నది. మాంద్యంపై సీఎం తరచుగా మాట్లాడటం వెనుక రాజకీయ వ్యూహాం దాగుంది. ఇది కొత్తగా ఉత్పన్నమైన విషయమేమి కాదు. ఎన్నికలకు ముందు నుంచే తెలిసిన విషయమైనా ఓట్ల కోసం ధనికరాష్ట్రమని నమ్మబలికారు. పార్టీ మ్యానిఫెస్టో అమలుకు నిధులు అడ్డంకి కావడంతో ఆర్థిక మాంద్యమంటూ సీఎం గొంతుచించుకుంటున్నారు. గగ్గోలు పెడుతున్నారు. ఐదున్నరేండ్లుగా బీజేపీతో నెరపిన సత్సంబంధాలు, సఖ్యత రాష్ట్ర ప్రజల అవసరాలను తీర్చలేకపోయింది. అదనపు నిధుల సంగతి పక్కనపెడితే, చట్టబద్దంగా రావాల్సిన సోమ్ముకే ఎసరుపెట్టిన బీజేపీతో అంటకాగారు. సర్కారు అప్పులు ప్రస్తుతం రూ.2.03 లక్షల కోట్లు. ఇందులో తలసరి అప్పు రూ. 58,202 కావడం గమనార్హం. రాష్ట్రాలకు రావాల్సిన నిధుల్లో కేంద్రం కోతపెడితే, ఆ చర్యను కేరళ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశాలు పెట్టి దేశవ్యాప్త ఆందోళనకు పూనుకుంది. అప్పుడు మన ప్రభుత్వాధినేత ఆ రాష్ట్రంతో గొంతు కలపలేదు. జాతీయ ఉపాధి హామీ చట్టం పనులకు మోడీ సర్కార్ నిధులను తగ్గిస్తే, అప్పటి త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌సర్కార్ దేశ రాజధానిలో చేసిన నిరసన దీక్షకూ సంఘీభావం చెప్పలేదు. రాష్ట్రాలన్నీ ఏకమైతేనే కేంద్రం మెడలు వంచడం సాధ్యమవుతుందనే సంగతిని కేసీఆర్ విస్మరించారు. 2019-20లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నులవాటా రూ.19,719 కోట్లు. కానీ వచ్చింది రూ. 10,304 కోట్లే. బీజేపీ సర్కార్ రూ.9,415 కోట్లు తక్కువగా ఇచ్చింది. ఏండ్ల తరబడి కేంద్ర ప్రభుత్వ హామీలన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయని టీఆర్‌ఎస్ ఎంపీల సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలిసినవే. ఇంతకాలం బీజేపీతో స్నేహాం చేసి ఏం సాధించినట్టు ? కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. నివురుగప్పిన నిప్పులా సామాజిక రుగ్మతలు రాష్ట్రాన్ని చుట్టుముట్టాయి. దిశ, సమత, మానసతోపాటు మరో నలుగురు యాదాద్రి యువతులపై జరిగిన లైంగికదాడులు, హత్యలు సమాజంపై తీవ్ర ప్రభావాన్నే చూపాయి. ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. దిశ కేసులో దేశమంతా స్పందించినా, కేసీఆర్ నుంచి ఉలుకూ, పలుకూ లేదు. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌ను నియమించలేదు. నిర్భయ చట్టంపై అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ప్రజలకు కల్పించిన అవగాహన అంతంతే. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 1.17 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసినా, కేవలం 30 శాతం ఉద్యోగాలనే సర్కార్ భర్తీచేసింది. మిగతా 70 శాతం ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉండటం వైఫల్యానికి నిదర్శనం. చట్టాల పట్టింపులేదు. చిత్తశుద్ధి అంతకన్నా లేదు. దీంతో నిరుద్యోగ సమస్య ఎప్పటిలాగే రాష్ట్రాన్నీ వేధిస్తున్నది. ఇవి గులాబీ నేతకు, ఆయన సర్కారుకు చెరగని మరకలు. పరిపాలనాంశాల్లో హైకోర్టు ఎన్నోసార్లు తప్పుబట్టిన చరిత్రా అందరికీ ఎరుకే. సమ్మె హక్కును నిరాకరిస్తున్నది. ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా అత్యంత నిరంకుశంగా, బాధ్యతారహితంగా వ్యవహరించింది. రానున్న కాలం ప్రజలకు పరీక్షా సమయం. ఆర్థిక, సామాజిక సమస్యల పరిష్కారానికైనా, ప్రజాస్వామ్య హక్కుల కోసమైనా ప్రజాఉద్యమాలే శరణ్యం. సమస్య ఏదైనా పోరాటమే మార్గం.